బయిటి ‘బీఫ్’ తినొచ్చు.. బాంబే హైకోర్టు

మోడీ ప్రభుత్వం వచ్చాక దేశమంతటా వ్యాపించిన వివాదాల్లో ఒకదానిపై బాంబే హైకోర్టు కీలకమైన తీర్పు నిచ్చింది. బీఫ్(గొడ్డుమాంసం) తినడంపై నిషేదం నియంత్రణ వ్యక్తిగత హక్కులకు స్వేచ్చకు భంగకరమని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆవులు ఎద్దులు గేదెలు వంటివాటిని వధించరాదంటూ చేసిన చట్టం చెల్లుబాటును సమర్థిస్తూనే బయిటనుంచి తెచ్చుకున్న బీప్ తినకుండా నిల్వచేసుకోకుండా అడ్డుకోవడం వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగకరమని తేల్చిచెప్పింది. ఆ మేరకు చట్టంలోని సెక్షన్5డిలోని నిబంధనలను తోసిపుచ్చింది. అదే సమయంలో ఎవరైనా ఇంట్లో గొడ్డుమాంసం నిల్వ చేసుకుంటే దానికి సంబంధించిన వివరాలను ఆధారాలను నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుందని పేర్కొంటున్న నిబంధనలను కొట్టివేస్తూ దాన్ని ఆ ఇంటివారిపైనే పెట్టింది. దీపక్ మిశ్రా, శివ కీర్తిసింగ్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు దేశంలో సాగుతున్న వివాదాలపై చాలా ప్రబావం చూపించనుంది. దాద్రి హత్యలతో మొదలుపెట్టి అసలు బీఫ్ తినడమే నేరమైనట్టు నిల్వ చేసుకోవడం నేరమైనట్టు దాడులు చేస్తున్న మతోన్మాద శక్తులకు కనువిప్పు అయితే మంచిదే. అందరి ఆహారపు అలవాట్లను గౌరవించాలనే రాజ్యాంగ సూత్రాన్ని హైకోర్టు నిర్ధారించింది. అదే సమయంలో పశుసంపద కాపాడుకోవడానికి చట్టాలు చేసే ప్రభుత్వాల హక్కును కూడా సమర్థి:చింది. అంతేగాని గోవు పేరిట వివాదాలు రగిలించేవారికి మద్దతు తెల్పకపోవడం గమనించదగింది.