కన్నయ్యకు బెయిలు- కట్టుకథలకు చెల్లు

కన్నయ్యకు బెయిలు- కట్టుకథలకు చెల్లు

జెఎన్‌యు విద్యార్థి సంఘ అద్యక్షుడు, ఎఐఎస్‌ఎప్‌ నాయకుడు కన్హయ్య కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు ఆరునెలల తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది.ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి ప్రతిభా రాణి ఉత్తర్వులిచ్చారు.దాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం తరపు న్యాయవాది ముందుకు తెచ్చిన అభ్యంతరాలను ఆమె తోసిపుచ్చారు. కపిల్‌ సిబాల్‌ కన్నయ్య తరపున వాదించారు అంటే అప్పటికీ ఏ సమస్య రాకపోతేహైకోర్టు మళ్లీ బెయిలుJNU-1455877234 kannhayya333పొడగిస్తుందన్నమాట. కన్నయ్యపై ఏ ఆధారం లేకుండానే దేశద్రోహం ముద్ర వేసి దేశమంతా దుష్ప్రచారం సాగించిన మతతత్వ శక్తులకు ఇది నిస్సందేహంగా చెంపపెట్టు. అసలు కన్నయ్య గురించి మాట్లాడిన వారంతా దేశద్రోహులు జాతి ద్రోహులు అనేంత వరకూ వెళ్లిన బిజెపి జాతీయ నేతలు కేంద్ర మంత్రులు ముఖ్యంగా సృతి ఇరానీ వంటి వారు ఇప్పుడు ఏ సమాధానం చెబుతారో చూడాలి. నిజంగా అతను అంత ఘోరమైన దేశద్రోహానికి పాల్పడినట్టు ఆధారాలుంటే అతని వల్ల ప్రమాదముంటే హైకోర్టు బెయిలు మంజూరు చేయదు. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించినప్పుడే ఈ ప్రచారాలకు రెండో వైపు వుందని తేలిపోయింది. ఆ తర్వాత కూడా పార్లమెంటులో ఉద్రేకంగా ప్రసంగాలు సాగించిన ఇరానీ వంటి వారు కన్హయ్యకు గాని, అసలు కేసుకు గాని ఏ సంబంధం లేని పోస్టర్లు కరపత్రాలు చదివి దుర్గాదేవిభక్తులకు కూడా బాధకలిగించారు. పైగా అవన్నీ సైద్ధాంతికంగా కమ్యూనిస్టులకు, రాజకీయంగా కాంగ్రెస్‌కు ఆపాదించారు. అంబేద్కరిస్టులపైన మైనార్టిలపైన చెలరేగిపోయారు. కనీసం కేసు ఉన్నత న్యాయస్థానాల్లో వుందన్న మెళకువ కూడా ఏలిన వారికి లేకపోయింది. హెచ్‌సియులోనూ జెఎన్‌యులోనూ కూడా ఎబివిపి ఫిర్యాదు ఆధారంగానే మంత్రులు ఫిర్యాదులు చేసి ఒత్తిడి తెచ్చారు. మళ్లీ వారే విశ్వవిద్యాలయాలలో రాజకీయ జోక్యం తగదని సుద్దులు చెప్పారు. ఇంత జరిగిన తర్వాత ఈ రోజున మళ్లీ ఎబివిపి నాయకుడు సౌరభ్‌కుమార్‌ జెఎన్‌యు విద్యార్థి సంఘాల డీన్‌పై చర్య తీసుకోవాలని వైస్‌ ఛాన్సలర్‌కు ఉత్తరం రాశారంటే ఎంత ఉక్రోషంగా వున్నారో తెలుస్తుంది. కాశ్మీర్‌లోగాని, ఈశాన్య భారతంలో గాని ఒకప్పటి సిక్కు ఉగ్రవాదులను గాని దేశద్రోహులుగా ముద్రవేసి వెలివేయలేదు. వారికి నచ్చజెప్పి జాతీయ స్రవంతిలోకి తీసుకురావాలనే ఈ రోజుకు ప్రయత్నిస్తుంటాం. అలాటిది విశ్వ విద్యాలయాల విద్యార్థులపై విద్రోహ ముద్ర వేసి విషప్రచారం చేయడం పెద్ద దుస్తంత్రం. ఈ కళంకం మోడీ ప్రభుత్వాన్ని ఒకపట్టాన విడిచిపెట్టదు.ఒకప్పుడు బంకిం చంద్రుడు దుర్గాదేవిని ఉద్దేశించి వందేమాతరం రాస్తే మనం దేశానికి అన్వయించుకున్నాం. ఆ పాటలో మూడు చరణాలే జాతీయ గీతంగా తీసుకున్నాం. కాని ఇప్పుడు ఇరానీ దేశమాతను దుర్గామాతగా చేసి ఆమెను అన్నారంటూ మత భావనలు పురికొల్పేందుకు విఫల యత్నం చేశారు. ఇందుకు ఆమెపై హక్కుల తీర్మానం కూడా ప్రతిపాదించారు. ఆమెను చూసి ఉత్తేజపడిన బండారు దత్తాత్రేయ తానో హక్కుల తీర్మానం ఇచ్చారు. జరిగిన పొరబాటును గుర్తించి ఇప్పటికైనా సర్దుకుంటే కొంత మెరుగు. అలాగే ఆలోచనా రహితంగా ఈ ప్రచారాలను నమ్మి నావంటి వారితో మొదలు పెట్టి సీతారాం ఏచూరి వరకూ అందరిపైనా బెదిరింపులకూ హీన వ్యాఖ్యలకు పాల్పడిన దుందుడుకు వాదులు ఒకింత ఆలోచించేలా వారు ఆరాధించే దుర్గాదేవి అనుగ్రహించాలని ఆశిద్దాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *