పనిలేని ఆదేశంతో కొత్త వేధింపులు, గొడవలు
సుప్రీం కోర్టుకు కేంద్రానికి మధ్య ఇటీవల వరుసగా ఉద్రిక్త ఘర్షణ జరుగుతున్నది. ఈ వాతావరణంలో తను కూడా జాతీయ భావనలో దేశభక్తిలో వెనకబడకూడబోనని సుప్రీం కోర్టు ప్రకటించుకోవాలనుకున్నట్టుంది. లక్షల్ల కొద్ది పెండింగు కేసులను వదలిపెట్టి సినిమా థియేటర్లలో జాతీయ గీతం వేయడం తప్పనిసరి అని ఉత్తర్వు నిచ్చింది. ఆ సమయంలో లేచి నిలబడని వారు శిక్షార్హులని ప్రకటించింది. మనం ఒక దేశంలో జీవిస్తున్నామనీ, రాజ్యాంగ దేశభక్తికి స్వతస్సిద్ధమైన జాతీయ లక్షణాలకు ప్రతీకగా జాతీయ గీతాన్ని గౌరవించాలని పౌరులందరూ గుర్తించాల్సిన అవసరం వచ్చింది అని వ్యాఖ్యానించింది. నిజానికి అత్యున్నత న్యాయస్థానానికి ఈ సందేహం ఎందుకు వచ్చిందో తెలియదు. వచ్చిందనుకున్నా ఉత్తర్వులతో దేశభక్తిని పెంపొందించాలని ఎలా భావించిందో అసలే అర్థం కాదు. ప్రతి సినిమా ప్రదర్శనకూ ముందు తప్పక జాతీయ గీతం ప్రదర్శించాలని ఆ ఉత్తర్వు సారాంశం. వాణిజ్య చిత్రాలకు మాస్ మసాలా సినిమాలకు వెళ్లేవారందరిలో దేశభక్తి పాదుకొల్పాలనే ఆలోచనే వింతగా వుంది. ఈ ఉత్తర్వులో ఎలాటి జరిమానాలు ప్రతిపాదించలేదు గాని దేశంలో అప్పుడే దీనిపై ఘటనలు గొడవలు మొదలైనాయి. చెన్నై అశోక్‌నగర్‌లో కాశీ థియేటర్లో జాతీయ గీతం వేస్తున్నప్పుడు లేచి నిలబడకుండా సెల్ఫీలు తీసుకుంటున్నారని పక్కసీట్లో వారు గొడవ పెట్టుకున్నారట. ఒక మహిళపైనా వారి జులం సాగింది. తర్వాత ఇదంతా కేసయింది. పోలీసులు 1971 చట్టం కింద జాతీయ గీతానికి అవమానం కేసు నమోదు చేశారు.వారేమో దౌర్జన్యం కేసు పెట్టారు. దేశంలో సవాలక్ష సమస్యలు వుండగా ఈ కొత్త వివాదాలు తీసుకురావడం అవసరమా జస్టిస్? ఇక నరేంద్ర మోడీ గారి దేశభక్త రాజ్యంలో ఇది మరెన్ని వెర్రితలలు వేస్తుందోచూడాల్సిందే.