పవన్ సభ -టిడిపి, వైసీపీ ఏకాభిప్రాయం
అన్ని విషయాల్లోనూ హౌరాహౌరీగా విమర్శించుకునే తెలుగుదేశం వైఎస్సార్ పార్టీలు జనసేన అద్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను విమర్శించే విషయంలో మాత్రం ఇంచుమించు ఒకే విధంగా మాట్లాడుతున్నారు. అనంతపురంలో ఆయన సభలో ఆయన ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హౌదాపై ప్రధానంగా మాట్లాడారు. రాష్ట్రం కోసం కృషి చేస్తున్నది తామేనని పవన్ తెలుసుకుని మాట్లాడాలని టిడిపి చీప్‌విప్ కాలువ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ నేతలైతే మేము ప్రత్యేక హౌదా కోసం పోరాడుతుంటే ఇంతకాలం వూరుకుని ఇప్పుడు వచ్చి హడావుడి చేయడమేమిటని విమర్శిస్తున్నారు. అదే సమయంలో పవన్ టిడిపి బిజెపిల తరపునే వుత్తుత్తి నాటకం నడుపుతున్నారనేది వైసీపీ ఆరోపణ. ఇప్పుడు ఎన్నికలు లేవు గనక పవన్ ఏమి చెప్పినా తక్షణ సమస్య వుండదు. ప్రత్యేక హౌదా నిరాకరణపై ఏ విమర్శ చేసినా అది ప్రభుత్వానికి వ్యతిరేకమే అవుతుంది. అలాటప్పుడు పవన్‌పై వైసీపీ ఎందుకు దాడి చేస్తుందో అర్థంకాదు. పవన్‌తో సహా వచ్చిన ప్రజారాజ్యం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కావాలని తీసుకొచ్చారని తెలుగుదేశం ఆరోపించేది. ఇప్పుడు పవన్‌ను టిడిపి తెస్తున్నట్టు వైసీపీ అంటుంది. ఒకవేళ ఆయన అన్నదానికి కట్టుబడకపోతే ప్రజలే తిరస్కరిస్తారు. ఇప్పటినుంచే ఎందుకు సందేహించాలి? ఇక తెలుగుదేశం జాతీయ కార్యదర్శి లోకేశ్ పవన్ విమర్శలను పాజిటివ్‌గా తీసుకుంటామన్నట్టు వచ్చిన కథనాలు వ్యూహాత్మకవైఖరిని సూచిస్తున్నాయి. కావాలనే ఆయన వెనకచేరేవారిని గజిబిజికి గురిచేయాలనేది వీటి ఉద్దేశం కావచ్చు. ఏమైనా లోకేశ్ అలా అన్నారుగనక పవన్‌ను సందేహించడమంటే తెలుగుదేశం మాటలకే ఎక్కువ విలువ ఇస్తున్నట్టమాట. రాజకీయ రంగస్థలం ఎవరికోసం ఖాళీగా వుండదు. వచ్చేవారు వస్తుంటారు. చెప్పేది చెప్పి చేసేది చేస్తుంటారు. జనసేన రాకను స్వాగతించకపోయినా వూరికే దానిపై దాడి చేస్తే వైసీపికి కలిగే రాజకీయ ప్రయోజనం లేకపోగా కంగారు పడుతున్నారనే విమర్శకు దారితీస్తుంది. లేదా కొత్త శక్తులను రానివ్వడం లేదనే మాట వస్తుంది.
సభ తర్వాత కూడా శుక్రవారం జిల్లాలోనే వుండిపోయిన పవన్ గుత్తిలో విద్యార్థులతో ముఖాముఖి జరిపారు. అగ్రవర్ణ పేదలకు కూడా రిజర్వేషన్ లేదా సదుపాయాల గురించి చర్చ జరగాలని చెప్పారు. కాపుల ఆందోళన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తనపై కుల ముద్ర పడకుండా చూసుకోవడానికి, అదే సమయంలో పై కులాల వారిని ఆకట్టుకోవడానికి ఉద్దేశించినట్టు కనిపిస్తుంది. నేను పోటీ చేస్తానని ఆయన అన్నమాటను కొంతమంది వ్యక్తిగతంగా తప్ప పార్టీ తరపున చేయరన్నట్టుగా కొందరు, అనంతపురం నుంచే చేస్తారని మరికొందరు చిత్రిస్తున్నారని జనసేన కీలక ప్రతినిధి వొకరు వివరించారు. ఆయన ఉద్దేశం పోటీ చేయడమేనని ఎక్కడ అనేది చెప్పలేదని ఆ ప్రతినిధి తెలిపారు.