మరో శంకుస్థాపనలో మతలబులు

28brk115b

ఆంధ్ర ప్రదేశ్‌ నూతన రాజధాని అంటే సీడ్‌ క్యాపిటల్‌,కోర్‌ క్యాపిటల్‌,స్టార్టప్‌క్యాపిటల్‌ అంటూ రకరకాల పదాలతో గందరగోళపరుస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజధానికి శంకుస్థాపన చేసిన మాట నిజమైనప్పుడు పాలనా భవనాలు లేని రాజధాని ఎలా వుంటుంది? ఆ తర్వాత ఏడాది గడిచినా అడుగు ముందుకుపడలేదనే విమర్శ రాకుండా ఈ వేడుక తలపెట్టారా? ఈసారి ఏకంగా వాస్తు కమిటీనే వేశామన్నార. ుఒక తెలుగుదేశం ఎంఎల్‌ఎ మాతో చర్చలలో అన్నట్టు ఆ శంకుస్థాపన కేమైనా వాస్తుకోణం వుందా? లేక రాజకీయ కోణమేనా? అదీ ఇదీ కాదంటే ఈవెంట్ల ద్వారా రేట్లు పెరుగుతాయనే రియల్‌ కోణమా? కట్టిన తర్వాత ప్రతిభవనానికి ప్రారంభోత్సవం చేసుకుంటే అదో తీరు.కాని శంకుస్థాపనలూ భూమిపూజలే పదే పదే చేయరు. నిజానికి అవసరం లేని శంకుస్థాపనకు అరుణ్‌జైట్లీని పిలిపించడంలోనే చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం ప్రదర్శించింది.
అసలు సందడి కోసం శంకుస్థాపన వేడుక అనుకుంటే అతిధిగా పిలవడానికి మరెవరూ దొరకరని కాదు. వెంకయ్య జైట్లీ జోడీని పిలిపించి వాళ్లచేతుల మీదుగా కానిచ్చి పొగిడి పంపించడం ద్వారా ఉభయత్రా ప్రజలను మురిపించి మరిపించవచ్చుననే పాచిక ఇందులో వుంది. పైగా ఈ తతంగంతో పాత కథలు మరుగునపడిపోతాయని కూడా భావించివుండొచ్చు. హౌదా తిరస్కరించిన బిజెపి నేతలను పొగిడేస్తూ దానికోసం ఉద్యమం చేస్తున్న ప్రతిపక్షాలపై ౖ ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించడం తలకిందులు తర్కమే. అయిదేళ్లమీద 2,003,000 కోట్లు ఇస్తున్నామని జైట్లీ పదేపదే గొప్పలు పోతుంటే అవి అన్ని రాష్ట్రాలతో పాటు ఇచ్చేవే తప్ప ప్రత్యేకంగా ఇస్తున్నవి కావని వివరించలేదు. మొదటి ఏడాది రెవెన్యూలోటును కూడా ఇప్పటి వరకూ భర్తీ చేయలేదన్నది అసలు నిజం.ప్రధాని వచ్చినప్పుడు ప్రత్యేక హౌదా మాటే ఎత్తకుండా ప్యాకేజి అడిగి పంపించారు.ఇప్పుడేమో అరకొర ప్యాకేజినే ఆకాశానికెత్తి మరింత అసంబద్దంగా వ్యవహరించారు. ఇప్పటి వరకూ హౌదాపై రాజీ లేదని , దానికోసం కూడా పోరడతామని చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి ఈ సభతో అధికారికంగా ఆ అధ్యాయం ముగించారన్నమాట.ఒక్కముక్కలో చెప్పాలంటే ఇది శంకుస్థాపన కాదు, ప్రత్యేక హౌదా సమాపనోత్సవం.(ముగింపుసభ) హౌదావల్ల ఉపయోగం లేదనే వాదన ఎంత తప్పో ప్రణాళికా సంఘం జరిపించిన అధ్యయనాలు , కాగ్‌ డైరెక్టర్‌ గోవింధ భట్టాచార్జీ రాసిన పుస్తకం వంటివి చూస్తే స్పష్టమవుతుంది.
కాంగ్రెస్‌ హౌదాపై హామీ ఇచ్చింది గాని చట్టంలో చేర్చలేదని పదే పదే చెబుతున్నారు. నిజానికి క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం ద్వారా మన్మోహన్‌ ప్రభుత్వం దానికి అధికార ముద్ర వేసింది. మోడీ కావాలంటే దాని ఆధారంగా నిరభ్యంతరంగా హౌదా ఇచ్చి వుండొచ్చు. వారే విధానం మార్చామన్నారు తప్ప గత ప్రభుత్వ బాధ్యతేమీ లేదు. చాలా ఆసల్యంగా అరకొరగా ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకైనా చట్టబద్దత కల్పించారా? రెండు మాసాలు గడిచిపోతున్నా ఎందుకు కాలయాపన చేస్తున్నారు?మనం అడగడమే గాని ప్రధాని నోటి వెంట ఆ మాట వచ్చిందా? పైగా ఈ సభ అధికారికమైంది. ఇక్కడ కాంగ్రెస్‌ను వైసిపిని తిట్టి బిజెపిని పొగిడి రాజకీయ ప్రచారం చేసుకోవడం రాజ్యాంగబద్దమేనా? నిజానికి బిజెపి టిడిపి నాయకులు విడివిడిగా కలసినపుడు తమ నాయకులు అవలలివారికి లోబడిపోయారని చెబుతుంటారు. తెలుగుదేశం తప్పులపై పోరాడేందుకు జాతీయ నేతలు ఒప్పుకోవడం లేదని బిజెపి వారంటే, కేంద్రంపై పోరాడేందుకు తమ అధినేత అనుమతినివ్వడం లేదని టిడిపి వారంటారు. చివరకు వచ్చేసరికి మోడీ బాబు జోడీ అంటూ పొగిడేసి దాడుగుమూతలతో దగా చేస్తుంటారు.ఈ మొత్తం ప్రక్రియలో పారదరశకత గాని ప్రజాస్వామిక స్పూర్తిగాని నాస్తి.ఒకరినొకరు కప్పిపుచ్చుకోవడానికి ఇది ఇంటి వ్యవహారం కాదు. ఈ రెండు పార్టీలనూ లేదా ముఖ్యనేతలను ఇంతగా కలిపివుంచుతున్న ప్రయోజనాలేవో శక్తులేవో ముందుముందు తెలియకపోదు.
(అక్టోబరు 30 ఆదివారం ప్రజాశక్తిలోరాసిన వ్యాసంలో కొన్ని భాగాలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *