తెలుగు ఐరనీ.. (మూడు తెలుగు ముచ్చట్లు)

telugu111ఈ మధ్య ఇంటర్‌నెట్‌(అనగా అంతర్జాలం?)లో లేదా నెట్టిల్లులో బ్లాగర్లు(ఇది కూడా తెలుగే) ఐరనీ అన్న ఆంగ్ల పదానికి సమానార్థకమైన తెలుగుపదం ఏమిటని తెగ పెనుగులాడుతున్నారు. రకరకాల మెసేజ్‌లు(సందేశాలు అనాలా?) నడుస్తున్నాయి. నేనైతే ఆ చర్చలో పాల్గొనలేదు గాని అది లేవనెత్తిన మరింత విస్త్రతమైన అంశాల గురించి ఆలోచిస్తున్నాను. అదే ఐరనీ. మన భాషలో చెప్పుకోవాలంటే విచిత్రం. అలాగే ఒక పత్రిక ప్రతిదాన్నీ తెలుగులోనే రాస్తానని కంకణం కట్టుకుని కొత్త కొత్త లేదా అతిపాత పదాలను వదులుతున్నది. దాన్నుంచి ఉత్తేజం పొందిన కొందరు ఆ పదాలను వాడేందుకు విఫలయత్నాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలైన తర్వాత కూడా తెలుగైతే ఒకటే కనుక దాన్ని తమ తమ రాష్ట్రాలకు ప్రత్యేకంగా అన్వయించడంలో ఇంకొందరు తమదైన సృజనాత్మకత చాటుకోవడం మూడో కోణం. ఎప్పట్లాగే ఈ తెలుగు గొడవ పట్టని కొందరు సంసృత ప్రియులు పాత శ్లోకాలనే పట్టుకు వూరేగుతున్నారు. అచ్చతెలుగు, అనువాద తెలుగు, ఆంధ్ర ప్రదేశ్‌ తెలుగు తెలంగాణ తెలుగు, సంసృత భూయిష్టమైన తెలుగు ఇన్ని తెలుగుల పెనుగులాట.
వెయ్యేళ్లకు పైబడిన తెలుగు సాహిత్యం, అర్థశతాబ్ది మించిపోయిన ఆధునిక పాలనా వ్యవస్థ, హేమాహేమీల వంటి కవులు రచయితలు కళాకారులూ విద్యావేత్తలు విజ్ఞానవేత్తలు నేతల వారసత్వం తర్వాత కూడా ఈ దుస్తితి ఏమిటి? ఏది మార్గమో నిర్ణయించుకోలేని గజిబిజి ఎందుకు? భాష సజీవంగా వుండాలంటే ముందు సహజంగా వుండాలని శక్తివంతంగా పలకాలని ఎందుకు అర్థం కావడం లేదు? మరెందుకు ఆమోదించడం లేదు?
ముందు ఐరనీ చూడ్దాం. ఐరనీ ఐరానికల్‌ అన్న ఇంగ్లీషు పదాన్ని తెలుగులో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా వాడతుంటాం. వ్యంగ్యం, వక్రోక్తి, అవహేళన అని కొందరు అర్థం ఇచ్చారు గాని విచిత్రం, విడ్డూరం, విషాదం,విపరీతం, అనుకోని పరిణామం, అన్నిటికీ ఈ పదాన్ని తెస్తుంటారు. వైశాల్యం, వైవిధ్యం, ప్రాచీనత, సమ్మేళనం వంటి అనేక కారణాల వల్ల భారతీయ భాషల్లో మరీ ముఖ్యంగా తెలుగులో ఒకే అర్థానికి స్వల్ప తేడాతో రకరకాల పదాలు వాడుకలో వున్నాయి.వాటిని సందర్భోచితంగా వాడుకోవడం జ్ఞాన లోపం కాదు, భాషా సంపన్నత. ఉదాహరణకు ఫస్ట్‌ అంటే మనం తెలుగులో అర్థభంగం లేకుండానే – మొదట,ి తొలి ప్రధమ, ప్రారంభ, ఆది వంటి అనేక పదాలను తీసుకోవచ్చు. అది ఇక్కడ భాషా సంప్రదాయం. ్ద సంసృతం ప్రాకృతం, ఉర్దూ,పారశీకం, ఇంగ్లీషు వంటి భాషల నుంచి అనేక పదాలు కలవడం వల్ల కలిగిన సౌకర్యమిది. ఇంగ్లీషులో వారు అర్థం చేసుకున్నట్టే తెలుగుపదం వారికి అనిపించకపోతే అది భాష తప్పు కూడా కాదు. కావలసింది పరిశీలన అన్వయశీలత, లోకజ్ఞానం మాత్రమే గాని నిఘంటువులూ వ్యాకరణ సూత్రాలు కానేకాదు. భాషలోంచి సాహిత్యం వస్తుంది గాని సాహిత్యంలోంచి భాష రాదు. దాని స్వరూప స్వభావాలు మారుతుంటాయంతే. ఇదో విధమైన అప్‌డేటింగ్‌. అంటే తాజాపర్చుకోవడం. ఇక్కగ తాజా అన్నది తెలుగు పదమా అంటే లక్షణంగా తెలుగే. విజయవారి మాయాబజార్‌ చిత్రం టైటిల్‌లో బజార్‌ ఏ భాషా పదం? ఒక పౌరాణిక చిత్రానికి పొసుగుతుందా అని ఎవరికి ఎన్నడూ సందేహం రాలేదంటే పొందికే కారణం. దానికన్నా ముందే పాతాళభైరవిలో ఎంత ఘాటు ప్రేమయో అంటే ప్రేమకు ఘాటేమిటని ఎవరూ అడగలేదే? పైపెచ్చు అదో ప్రయోగంగా స్థిరపడిపోయిందే? కాబట్టి భావంతో ా ఆలోచిస్తే భాష వికసిస్దుంది లేదంటే ముకుళిస్తుంది.
ఇక రెండోది కొంతమంది మిత్రులు పాత్రికేయుల కృత్రిమ భాషాయజ్ఞం. మొబైల్‌ పోన్‌ను చరవాణి అని రాస్తున్నారు. అది తెలుగా? ఈ దేశంలో ఎవరైనాఎప్పటికైనా చరవాణిలో మాట్లాడాను అనడాన్ని వూహించగలమా? ఎన్నడో కనిపెట్టిన ఫోన్‌కే దూరవాణి అన్న పదాన్ని వాడామా? తెలుగు మీడియాను తెలుగు మాధ్యమం, మీడియాను ప్రసార మాధ్యమాలు అని కొందరు పనిగట్టుకుని వాడటం తప్ప నిజంగా వినియోగంలోకి వచ్చే ముచ్చటేమైనా వుంటుందా? రానప్పుడు ఎందుకు ఈ వ్యర్థ ప్రయాస?అసలు ఈ పనులన్నీ చేయవలసిన తెలుగు సంస్థకే తెలుగు అకాడమీ అని పేరు పెట్టుకున్న విశాలత్వం మనది. వాల్‌పోస్టరును గోడపత్రిక అని వాడటం బాషా పరంగాగాని సాంకేతికంగా గాని సరైందేనా? ఆహ్వాన పత్రిక లగపత్రిక,దినపత్రిక వంటి పరంపరలో పోస్టరు పత్రిక అవుతుందా? పాఠశాల,వైద్యశాల, కళాశాల,కార్యాలయము వంటి పదాలను తెలుగువారెవరైనా ఎక్కడైనా దైనందిన ప్రయోగంలో వాడటం నేనైతే చూడలేదు. రాతకే పరిమితం. అదే కాస్త ఇంచుమించుగా వున్న సహజమైన తెలుగు ఉర్దూ సంసృత పదాలు వాడుతునే వుంటాం. పాఠశాలకు పంపించానని ఏ తెలుగు తల్లి చెప్పదు కాని బడికి వెళ్లడం అని అప్పుడప్పుడూ అంటుంది. ద్విచక్రవాహనం, చాతుర్చక్రవాహనం అని ఎవరూ అనరు.(పోలీసు ప్రకటనల్లో తప్ప) బండి అని మాత్రం అంటారు.వైద్యశాల అనం గాని తెలుగీకరించుకున్న ఆస్పత్రి అంటాం. టీవీ చానల్‌ అన్న మాట తీసుకుంటే టీవీ అనే రెండక్షరాల మాటను ఎలక్ట్రానిక్‌ ప్రసార మాధ్యమం అనడం కన్నా ప్రహసనం ఏముంటుంది? మాధ్యమం అన్న మాటపై ఓటింగు పెడితే(ఓటింగుకు లేదా ఓటుకు తెలుగేది?) ఏ పదిశాతమో తప్ప మిగిలిన వారికి అర్థం కాదు. చానల్‌కు ఎలాగూ తెలుగు లేదు. హైదరాబాదులో సచివాలయం పక్కనే సెక్యూరిటీ ప్రెస్‌ వుంటుంది.దానికి ప్రతిభూతి ముద్రణాలయం అని రాసివుంటుంది.ఎవరికి అర్థమయ్యేట్టు?కాబట్టి సందర్భం సారాంశం అన్నిటినీ గమనంలో వుంచుకుని అర్థవంతమైన పదాలు సృజించగలిగితే మంచిదే.(ఎంత తెలుగువీరాభిమానైనా ఇక్కడ ఓకె అంటే ఆశ్చర్యపోవనవసరం లేదు.) అతకనివి కనిపెట్టి రుద్దితే అతుకుల బొంతే అవుతుంది. ఎవరూ ఇష్టపడరు. అది చిరకాలం మన్నదు కూడా. గతంలో చాలా సార్లు చెప్పుకున్నట్టు మానవ సంబంధాలు భావాలు కుటుంబ బంధాలు రాగద్వేషాలు రాచరిక వ్యవస్థ వరకూ తెలుగులో పుష్కలంగా పదాలుంటాయి. ఆధునిక ప్రక్రియలకూ సాంకేతిక పరికరాలకు సంబంధించిన పదాలు వుండవు. వాటిని ఎరువు తెచ్చుకోవడం పరువు తక్కువేమీకాదు.గౌరవసూచకమైన ‘గారు’ అన్న మాట ఉర్దూనుంచి వచ్చిచేరిందని ఎందరికి తెలుసు? అటక అన్నది ఇంగ్లీషు మాట అని మరెందరికి గుర్తుంటుంది? ఇక ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాయలసీమ మీమాంస చూద్దాం. ఎవరో కొందరు దురభిమానులు చేసిన వ్యాఖ్యలను బట్టి కొన్నిచోట్ల తెలుగు గొప్పదని కొన్నిచోట్ల కాదని లేక మూడు చోట్ల వాడే తెలుగు వేరువేరని అనుకుంటే అంతకన్నా అశాస్త్రీయం అచారిత్రికం మరొకటి వుండదు. తిక్కన, పాల్కురికి సోమనాథుడు, బమ్మెరపోతన, తాళ్లపాక అన్నమయ్య, వేమన వీరిలో ఎవరిది తెలుగు కాదు? . ఇవన్నీ చక్కటి తెలుగులే. ఈ మధ్యనే మిత్రులతో దీనిపై ఆసక్తికరమైనచర్చ జరిగింది. తిక్కనది నాటకీయత నిండిన అచ్చతెలుగు.పాల్కురికిది సంసృతం మేళవించిన తెలుగు. పోతనది భక్తిపారవశ్యం పొంగిపొర్లిన
తెలుగు.అన్నమయ్యది అన్నమంత సహజమైన తెలుగు. వేమనది వేయి వేటుల పదునుగల తెలుగు. ఇక ఆధునిక రచయితలు కవుల విషయంలోనూగ పదంతో కదం తొక్కించిన శ్రీశ్రీ నుంచి తొలిపాటలోనే ‘పూలదండవోలె.. కర్పూరకళిక వోలె’ అని తెలుగు వారి హృదయాలు దోచిన సినారె వరకూ.ూఉద్యమకవులది ప్రజా కవులూ రచయితలది మరో జాబితా. ఆకలి,అన్నం, విప్లవం పోరాటం చైతన్యం, ఉద్యమం వంటి మాటలకు తేడానే లేదు. దేశాల సరిహద్దులనే చరిత్ర చెరిపేసిన నేపథ్యంలో ఇప్పుడు రెండు రాష్ట్రాలైనాయి గనక కొత్త భాష వచ్చేస్తుందని అనుకుంటే పొరబాటే. అయితే గతంలో ఏవైనా చక్కని ప్రయోగాలుండి కూడా వినియోగంలోకి రాకపోతే తీసుకురావచ్చు. మరుగుపడిన అంశాలను వెలికితీయొచ్చు. కాని ఆ ప్రయత్నం సహజంగా జరిగితేనే నిలుస్తుంది. ఇప్పటికి ఈ మూడు ప్రాంతాల్లోనూ నేను ఇంచుమించు సమానమైన కాలం వున్నాను గనక వాటిలోతుపాతులు విశేషాలు వివాదాలు చాలానే చూశాను. ఎవరి అ భిమాన దురభిమానాలు ఎలా వున్నా ఏ ఒక్కరు ఒక్క ప్రాంతం భాషలోనే మాట్లాడటం నేటి ప్రపంచంలో సాధ్యం కాని పని. రాతలో అసలే జరగదు. అలా అనుకోవడం ఆత్మతృప్తికి లేదా ప్రభుత్వ ధనం ఖర్చు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆయా చోట్ల గల ప్రత్యేకతలు కాపాడుకుంటూనే – కొత్త పదాలు సృష్టించుకుంటూ – అన్న భాషాపదాలు కూడా స్వీకరిస్తూనే తెలుగును సుసంపన్నం చేసుకోవాలి. ఇంగ్లీషే గొప్పది గనక మాతృభాషను వదిలేసి దానివెంట పరుగులు తీయనవసరం లేదు. బళ్లలో వసతులు లేని మీడియంలు రుద్దనవసరం లేదు. కాని ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువులోకి అయ్యో అనే తెలుగుపదం ప్రవేశించడంలోని ఐరనీని అర్థం చేసుకోవాలి. వేగంగా పరుగెడుతున్న ఈ కాలంలో అది మరింత అవసరం.అదే తెలుగుకు వెలుగు.
(ఆంధ్రజ్యోతిఎడిట్‌పేజి, గమనం, 21,,10,16. బ్రాకెట్లో శీర్షిక అదనంగా చేరింది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *