మరో కృత్రిమ వివాదం
ప్రజల జీవితాలతో గాని ప్రభుత్వ విధానాలతో గాని సంబంధం లేని నిరర్థక వివాదాలపైకి దృష్టి మరల్చడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. ప్రత్యేక హౌదాపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు సృష్టించిన రభసను అందరూ ఖండించారు. నిరసన తెల్పవలసిందేగాని ఈ విధంగా మైకులు విరిచేయడం బల్లలు ఎక్కి గొడవ చేయడం సరికాదని నేనూ రాశాను.చెప్పాను కూడా. అయితే ఇప్పుడు అనేక రాజకీయాంశాలు ఉద్యమాలు ముందుకు వస్తున్న తరుణంలో వైసీపీ ఎంఎల్‌ఎలు పన్నెండు మందికి నోటీసులు ఇవ్వడం ద్వారా చర్చ అటు వైపు మరల్చడం ప్రభుత్వ ఉద్దేశం. ఇది స్పీకర్ కార్యాలయం చూసుకుంటుంది గాని మాకేమీ సంబంధం లేదని చెప్పొచ్చు గాని ఇవన్నీ వ్యూహాత్మక నిర్ణయాలే. వైసీపీ సభ్యులు కూడా తమ వ్యూహ రాహిత్యాన్ని సమీక్షించుకుని కేవలం రభస చేయడమే
సరిపోదని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రత్యేక హౌదా కోసం చేశామంటూ సమర్థించుకోవాలనుకుంటున్నారు. అక్టోబరు23,24 తేదీల్లో వారి హాజరు కూడా రాజకీయ హడావుడికి దారితీయడం అనివార్యం. ఆ సందర్భంలో కొత్త సమస్యలు వచ్చినా రావచ్చు. దానిపై మళ్లీ టిడిపి వారెలాగూ ఎదురుదాడి చేస్తారు. ఏతావాతా ఇది ఇరు పార్టీల తగాదాగా తయారై సమస్యలు మరో వంద మైళ్లు వెనక్కు పోతాయన్న మాట. ఏంచేస్తాం? నేను గతంలోనే అన్నట్టు ఇదో విధమైన మ్యాచ్ మిక్సింగ్..అంటే ఉభయుల ఆలోచనల సంగమం. శ్రమలేని సందడి. ప్రచార తతంగం. వైసీపీపై దాడికి టిడిపీకీ అవకాశం.
