మోడియాగా ఎన్‌డిటివి? పాక్ మీడియా ధిక్కారం!
2014 ఎన్నికలకు ముందు మోడీని త్రీడీలో చూపే ప్రయత్నంలో మీడియాను కార్పొరేట్లు మోడియాగా మార్చేశారని నేను సరదాగా అంటుండేవాణ్ణి. అంతకుముందు గుజరాత్ మారణహౌమం నేపథ్యంలో టీవీలనే బహిష్కరించిన మోడీ హఠాత్తుగా దానికి డార్లింగ్‌గా మారిపోయారు. ఆయన ప్రధాని అయ్యాక ఒకటి రెండు సార్లు మీడియాతో ఇష్టాగోష్టి కూడా జరిపారు. బాగానే వుంది. కాని జెఎన్‌యు ఘటనలు, గోసంరక్షణ పేరట దాడులు వంటివి సంభవించాక మరోసారి మీడియాపై ఒత్తిళ్లు పెరిగాయి. వాటిపైనా దేశభక్తి/ద్రోహం ముద్ర వేసే ధోరణి పెరిగింది. ఈ క్రమంలో టైమ్స్ నౌ అర్నాబ్ గోస్వామి టీవీ సింహమై పోగా రాజ్‌దీప్ సర్దేశారు, బర్ఖాదత్ వంటివారిపై తీవ్రదాడి జరిగింది. ఎన్‌డిటివిని బహిష్కరించాలని కూడా సోషల్ మీడియాలో పరివార్ మిత్రులు రాశారు. అయితే విచిత్రంగా ఇప్పుడు అదే ఎన్‌డిటివి మోడీ సర్కారు ఒత్తిడికి లొంగిపోవడం ఆశ్చర్యమే గాక ఆందోళన కూడా కలిగిస్తుంది. కాంగ్రెస్ నాయకుడు సీనియర్ కేంద్ర మంత్రి పి.చిదంబరం సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగాలు కొన్ని చూపిస్తూ ప్రోమోలు వేసిన ఎన్‌డిటివి హఠాత్తుగా ఆ సమయానికి దాన్ని నిలిపేసింది. రాజకీయాల కన్నా ఇండియా మిన్న అన్న ట్యాగ్‌లైన్ తెరపై ప్రదర్శించింది. ఈ విషయమై ప్రముఖ పత్రికల్లో గాని ఛానళ్లలో గాని పెద్దగా చర్చ జరగకపోవడం, విమర్శలు రాకపోవడం మరీ ఆశ్చర్యంగా వుంది.హిందూ మాజీ సంపాదకుడు ఇప్పుడు చాలా జయప్రదంగా నడుస్తున్న వైర్ వెబ్ సైట్ నిర్వాహకుడు సిద్ధార్థ వరదరాజన్ దీనిపై చాలా వివరమైన విమర్శ రాశారు. అసలు సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఛానళ్లలో పొంగిపొర్లుతున్న హైపర్ దేశభక్తిని ఆయన ఆక్షేపించారు. వార్తలు చదివే వారు సైనిక యూనిపాంలు వేసుకోవడం, కొత్తగా చివరలో జైహింద్ అంటూ ముగించడం ఇవన్
నీ కృత్రిమంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చిదంబరం ఇంటర్వ్యూను ప్రకటించికూడా నిలిపివేసేందుకు ఎన్‌డిటివి వివరణ ఇవ్వలేదు. సిద్ధార్థ వరదరాజన్ పంపిన ప్రశ్నావళికి కూడా నిర్దిష్టత లేని రోటీన్ సమాధానాలతోనే సరిపెట్టింది. ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌లలో జరిగినట్టు జాతీయంగా కూడా మీడియాను లొంగదీసుకునే ప్రక్రియ లేదా వారే వీరవిధేయత ప్రదర్శించడం ఎంత వికృత స్తాయికి చేరిందో దీన్ని బట్టే అర్థమవుతుంది.చిదంబరం మాట్లాడింది తప్పయితే వీక్షకులు ఆయననే విమర్శిస్తారు.కాంగ్రెస్‌కు నష్టం కలుగుతుంది. అంతేగాని ప్రకటించి ప్రసారం నిలిపివేయడమెందుకు? ఖచ్చితంగా దానివల్ల ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందనే భావన ఇందుకు కారణమై వుండాలి.ఈ విధంగా సర్జికల్ స్ట్రైక్స్ మీడియా స్వేచ్చకు సంకెళ్లు కావడం వూహించని ఉత్పాతం. పైగా ఫలానా విధంగా చేస్తేనే చెబితేనే దేశభక్తిలేదంటే కాదని కొందరు రాజముద్ర వేసే పద్ధతి ప్రజాస్వామ్యం కూడా కాదు.
ఎన్‌డిటివి వైఖరికి పూర్తి భిన్నంగా వుంది పాకిస్తాన్‌లోని డాన్ పత్రిక జర్నలిస్టు సెరిల్ అల్మీదియా ఉదంతం. పాక్ సైన్యానికి పౌర ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతున్నదని ఆయన రాసిన కథనం సంచలనం కలిగించింది.ప్రభుత్వానికి రుచించలేదు. దాంతో ఆయనను దేశం వదలివెళ్లకుండా ఆంక్షలు విధించింది. దీనిపై ఆయన ధైర్యంగా స్పందించారు. అసలు దేశం వదలివెళ్లే ఆలోచనే లేదు, రాసినదానిపై వాస్తవాలు వివరించేబదులు ప్రభుత్వం దాడి చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.ఆ పత్రిక యాజమాన్యం కూడా బాసటగా నిలిచింది.
విశేషం ఏమంటే ఈ అంక్షల తర్వాత కూడా నేషన్ పత్రిక సంపాదకీయంలో జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థల అధినేతలపై చర్యలు తీసుకోకూడదన్న సైన్యం వైఖరిని తప్పు పట్టింది.వారిపై చర్యలు తీసుకుంటే వచ్చే ప్రమాదం ఏమిటో ప్రకటించాలని కోరింది. మొత్తానికి పాక్ మీడియాలో ప్రభుత్వంపైనే గాక సైన్యంపైన కూడా విమర్శలు వస్తున్నాయి. కాని మన దేశంలో బిజెపి నేతలపై ప్రభుత్వంపై విమర్శలను సైన్యంపై దాడిలా చిత్రించి విమర్శనా స్వేచ్చను చర్చను అడ్డుకోవడం విచిత్రం.
