వైఎస్సార్ పార్టీ అతి అంచనాలు, ఆచరణ?

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నట్టు మాట్లాడేవారు వైసీపీ నాయకులు 2014కు ముందు. ఆ అతి విశ్వాసంతోనే మరెవరినీ ఖాతరు చేయకుండా ఒంటరిగా వెళ్లి కొద్దిపాటి ఓట్ల తేడాతో పెద్దగానే సీట్లు కోల్పోయి ప్రతిపక్షంగా అదీ ఏకైక ప్రతిపక్షంగా శాసనసభకు అలంకరించారు. అదైనా గొప్ప విజయమే. అసెంబ్లీలో ఒక్క పార్టీయే వున్నా అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఏకపక్ష ధోరణికి ఇటు వైసీపీ వ్యూహ రాహిత్యం కలసి నిరంతర రభసలూ వాయిదాలతో సగం పదవీ కాలం ముగిసిపోయింది. రాజధాని నిర్మాణం, భూ సేకరణలు, ప్రత్యేక హౌదా తిరస్కరణ, అవినీతి ఆరోపణలు, అంతర్గత సమస్యలు అధికార పార్టీని అనుక్షణం వెన్నాడుతున్నాయి. అయినా సరే అత్యంత బలమైందిగా చెప్పుకునే ఏకైక ప్రతిపక్షం వీటిపై నిరంతరాయంగా ఉద్యమాలు చేసింది గాని ఉపశమనం రాబట్టింది గాని లేదు. తమిళనాడులో ఉభయ డిఎంకెలకు నకలుగా టీడీపీ వైసీపీ వైరం నడుస్తున్నదే గాని నిర్మాణాత్మక నిరంతర కదలికలు లేవు. సాక్షిలో వెలికి తీసే అంశాలు కూడా సమగ్ర కార్యాచరణకు నడిపించింది లేదు. అప్పుడప్పుడు అలజడి, ఉద్రిక్తత,వాదోపవాదాలు తర్వాత మళ్లీ మామూలే. ప్రతిపక్ష నేత జగన్ మాత్రం కొన్ని అంశాలపై జిల్లాలకు వెళ్లి రకరకాల ప్రసంగాలూ ముఖాముఖి వంటివి నడిపిస్తారు. నిరాహారదీక్షలు చేస్తారు. అంతేగాని సగం ఎన్నికల సమయం అయిపోయినా ఇంతవరకూ వైసీపీని పటిష్టమైన రాజకీయ శక్తిగా యంత్రాంగాన్ని పెంచుకునే ప్రయత్నం పెద్దగా ముందుకు నడిచింది లేదు. సమర్థులూ నమ్మకస్తులూ అయిన నాయకులు సీనియర్ల సేవలను సక్రమంగా వాడుకుంటున్నదీ లేదు. ఆఖరుకు కుటుంబంలో తను జైలులో వున్నప్పుడు ముందుండి పార్టీని బతికించిన మాతృమూర్తి, సహౌదరి కూడా ఇప్పుడు నామకార్థమై పోయినట్టే. శాసనసభలో స్పీకర్‌ను చుట్టుముట్టడం వంటి చర్యలలో చూపించే ఉత్సాహం నిబంధనలను ఉపయోగించుకుని ఇరుకున పెట్టడంలో లేదు. ఇదంతా వైసీపీ నాయకులలో ఎవరిని కలిసినా అంగీకరించే కఠోర సత్యం.
మేము ఎంత చేసినా అనుకూల మీడియా వేయడం లేదని వారంటారు గాని వారికే ఒక బలమైన మీడియా, సమస్యలపై ఎప్పుడూ ప్రచారమిచ్చే ప్రగతిశీల మీడియా, టి మీడియా ఇన్ని వున్నాయి కదా.కనుక తాము గొప్పగా చేస్తుంటే మీడియా తొక్కిపడుతుందనే వాదన నిలిచేది కాదు. వామపక్షాలు కాంగ్రెస్ ఏవో ఆందోళనా రూపాలు ప్రచార కార్యక్రమాలు చేయడం కనిపిస్తూనే వుంది. సిపిఎం కార్యదర్శి మధుపై దౌర్జన్యం వంటివి తగినంత రాకపోయినా ఎంతోకొంత తెలుస్తూనే వుంది. కనుక వైసీపీ పెద్ద ఎత్తును ఉద్యమాలు చేసినా ప్రచారం లేకపోవడం సమస్య అన్నది పూర్తిగా నిజం కాదు. వారి పద్ధతిలోనే లోపం వుంది.ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు గనక ఎందుకు శ్రమ పడాలనేది వారిలో చాలా మంది అనేమాట.అధినేత ఆలోచన కూడా కావచ్చు.
తమాషా ఏమంటే ఇదే వైసీపీ నేతలు ప్రత్యేకంగా ఏ ఉద్యమాలు చేయకపోయినా పెద్ద కదలిక లేకపోయినా పరిస్థితి తమకు అనుకూలంగా మారిపోతుందని గొప్ప నమ్మకంతో వుంటారు.చంద్రబాబుపై పెరిగే అసంతృప్తి మాకే కదా మేలు చేస్తుంది..గెలిపిస్తుంది అని చెప్పబోతారు. ఇటీవల తాము ఇంటింటి ప్రచారం చేసినప్పుడు తెలుగుదేశం అనుకూల తరగతులు కూడా ఆదరించి ఆలకించడం ఇందుకు ఉదాహరణ అని వైసీపీలో ఒక మాజీ మంత్రి చెప్పారు. అయితే కావచ్చు గాని అధికార పక్షంపై అసంతృప్తి దానికదే ప్రతిపక్షాన్ని గెలిపించాలని లేదు. ప్రభుత్వానికి కొన్నిబాధ్యతలు వున్నట్టే ప్రతిపక్షానికీ వుంటాయి. ప్రభుత్వం గనక వారి పట్ల వ్యతిరేకతతో అడ్డు పడితే అప్పుడు మరింత పట్టుదలగా ప్రజల్లోకి వెళ్లవలసి వుంటుంది. అంతేతప్ప ప్రభుత్వవైఖరి కారణంగా మేము ఇంతకంటే చేయలేకపోతున్నామనడం సరికాదు. రెండవ దగ్గరి స్థానం మనదే గనక ఎటూ వచ్చేస్తామని వైసీపీ నేతలు ముఖ్యంగా అధినేత చేస్తున్న ఆలోచన ఆచరణలో పూర్తిగా నిలిచేది కాదు. పైగా చాలా కాలం పాటు ఇది ఇలాగే నిలబడాలనీ లేదు. ప్రజల కోసం పనిచేసి సమీకరించి ప్రభుత్వ విధానాలలో తప్పొప్పులకు ప్రత్యామ్నాయాలు సూచించి సాధించేవరకూ పోరాడటం ప్రతిపక్షం బాధ్యత. ఈ విషయంలో మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డిని చెప్పుకోవలసిందే.కాంగ్రెస్ ఎప్పుడో మర్చిపోయిన ఉద్యమాలలో మళ్లీ ప్రవేశించిన వ్యక్తి ఆయన. తమ పార్టీ అధికారంలో వున్నప్పుడు కూడా అసమ్మతివాదిగా వుంటూనే సమస్యలను గుర్తించి లేఖలు రాస్తుండేవారు. ప్రతిపక్ష నేతగా ప్రజా ప్రస్థానం సరే సరి. ఆయన అధికారంలోకి వచ్చాక ఆరోపణలూ నిర్బంధాలూ వేరే కథ. ఆ మాటకొస్తే చంద్రబాబు కూడా రెండు ఓటములు, విభజన గజిబిజి మధ్య పార్టీని బతికించుకోవడానికి చాలా యాత్రలే చేశారు కదా.విభజన జరిగిపోతున్నా ఎపిపై దృష్టితో నిరాహారదీక్షలు వంటివి చేపట్టారు కదా. అవన్నీ లేకపోతే తెలుగుదేశం ఈ మాత్రమైనా వుండేదా?
కాబట్టి వైసీపీ నేతలు తెలుగుదేశం కథ ముగిసిపోయిందని వారికి వారే నిర్ధారించుకుని అది తమకు ప్లస్ అవుతుందని ఆటోమాటిగ్గా అధికారంలోకి వచ్చేస్తామని పోర్టుఫోలియోలు చూపిస్తుంటే అది అత్యుత్సాహం లేదా అత్యాశ అవుతుంది తప్ప ఆచరణలో అక్కరకు రాదు. పైగా ఎంత కాదనుకున్నా కేసులు విచారణలు హాజర్లు వుండనే వున్నాయి. సిబిఐ వాటి విషయంలో ఏం చేస్తుందో తెలియదు. అవన్నీ ఎలా వున్నా రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో కలసి వారి సమస్యలపై సజీవమైన ఉద్యమాలు చేసి సహాయక చర్యలు సాధిస్తేనే ప్రజాదరణ గౌరవం వుంటాయి. ఎన్నికలంటే వచ్చినప్పుడు వస్తాయి, అప్పటి పరిస్థితులను బట్టి అప్పుడు తీర్పులు వుంటాయి.ఇప్పటికైతే వైసీపీ మరింత యాక్టివ్ మోడ్‌లోకి రాకుండా వూరికే అనుకూల అంచనాలలో మునిగిపోతే చాలదు.
prathi paksham variki avineethi meeda dyasa ani palaka paksham nayakudu annappudu kooda, ADELA SAADHAM MEERUKADA ADIKAARAMLO VUNDI ANI – khandinchaleni paristithi vundi. PRATHI PAKSHANIKI meeru enni manchi maatalu cheppina, vrasina kooda varilo marpu raadu. prajala gurinchi pattinchukovadaniki vaariki aastakthi ledu (palaka paksham & PRATHI PAKSHAM) EDI MANA DOURBHAGYAM.