విశాఖ ఈవెంట్లతోనే రిజల్ట్సు?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో వరుసగా ఈవెంట్లు ఏర్పాటు చేయిస్తున్నారు. 2016 జనవరిలో సిఐఐ సమావేశం జరిగింది.ఫిబ్రవరిలో అంతర్జాతీయ నౌకా విన్యాసాలు, గత నెలలో సముద్ర ఆహార ఉత్పత్తుల సమ్మేళనం, తాజాగా పట్టణీకరణ, డిజిటలైజేషన్ సదస్సు వంటివి జరిగాయి. వీటికి జివిఎంసి, వుడా భారీగా ఖర్చులు భరిస్తున్నాయి.ఇదేగాక ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అనేకం ఇక్కడ జరిపిస్తూ విశాఖను ఈవెంట్ల నగరంగా మారుస్తామని ప్రకటిస్తున్నారు. విశాఖపట్టణం వంటి నగరం దేశంలోనే లేదని ముఖ్యమంత్రి ఈ వారం వ్యాఖ్యానించారు. నిజానికి . ముఖ్యమంత్రి దాదాపు నెలకుో మూెడు నాలుగు సార్లు విశాఖ సందర్శిస్తున్నారు. విభజన తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరంగానే గాక పారిశ్రామిక ఫైనాన్స్ రంగాల్లో విశాఖను ఎక్కువగా అభివృద్ధి చేయొచ్చనే భావన ప్రభుత్వానికి వుంది. గతంలో హైదరాబాద్, విశాఖ ఈ రెండు చోట్ల ఎక్కువగా ప్రభుత్వ సంస్థలను స్థాపించడమే ఇందుకు కారణం. బ్రిటిష్ వారి కాలం నుంచి ప్రాధాన్యత పొందడమే గాక తూర్పు తీరంలో కీలక స్థానమాక్రమించిన విశాఖకు వ్యూహాత్మకంగానూ అంతర్జాతీయ గుర్తింపు కూడా వుంటుంది. వ్యాపార పెట్టుబడులపై నిరంతరం ఆలోచించే ముఖ్యమంత్రిని ఈ కోణంలో విశాఖ పట్టణం ఆకట్టుకోవడం పెద్ద ఆశ్చర్యం కాదు.
అయితే ఈ అన్నిటికన్నా గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఇందుకు ముఖ్య కారణంగా స్థానికులు అనుకుంటున్నారు. 2012 ఫిబ్రవరినుంచి కార్పొరేషన్ ఉనికిలో లేదు. ప్రభుత్వాలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలోనే నడిపిస్తున్నాయి. ఇటీవలనే హైకోర్టు దీన్ని తప్పు పట్టింది కూడా.త్వరలోనే ఇక్కడ ఎన్నికలు జరపడం తప్పనిసరి గనకే ఆ కోణంలో ముఖ్యమంత్రి సంరర్శనలు పెంచారు. బిజెపిని కూడా కలుపుకోవలసి వుంటుందని టిడి
పి భావిస్తున్నది. స్థానిక ఎంపిగా కంభంపాటి హరిబాబు వుండటం గతంలో బిజెపి తొలి కార్పొరేషన్‌ను గెలవడం వల్ల వారిని కూడా కలుపుకోవడం మంచిదని భావిస్తున్నారు. . ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభావం కొంత గణనీయంగానే వుంటుంది గనకా, స్థానికంగా వామపక్ష కార్మిక ఉద్యమాల ప్రభావం చూపుతాయి గనక వంటరిగా వెళ్లడం కన్నా కలసి పోరాటం మంచిదనుకుంటున్నారు. ఏది ఏమైనా ముందు ఓటర్లను మంచి చేసుకోవాలసిందే కదా!
ఈ పర్యటనలు ఎన్ని చేసినా ఐటి రంగంలో పెట్టుబడులు, రైల్వేజోన్ వంటివి రాకపోవడం, ఉపాధి అవకాశాలు పెరక్కపోవడం యువతలో అసంతృప్తికి కారణమవుతున్నది. మరోవైపున భూములు రేట్టు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు ఇంటి గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోతున్నది. 100 గజాల ప్లాట్ల క్రమబద్దీకరణ పథకంలో అధికార పార్టీ మనుషులు వేలకు వేలు వసూలు చేస్తున్నారని సామాన్యులు ఫిర్యాదు చేస్తున్నారు.ఇవన్నీ మాట్లాడకుండా కేవలం ఈవెంట్లతో సరిపెడితే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నవినిపిస్తున్నది. హుద్‌హుద్ తుపాను వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడే మకాం వేసి ఆదుకున్నారనేది వున్నా అప్పుడు ప్రకటించిన పరిహారం ఇళ్లకు గాని పడవలకు గాని ఇంతవరకూ అందింది లేదు. అవన్నీ పరిష్కరించకుండా వూరికే ఈవెంట్ల మేనేజిమెంటు చేస్తే రిజల్టు అంతగా వుందదని తెలుగుదేశం వారే అంటున్నారు..
