రోహిత్ దే తప్పు- దాద్రి నిందితుడిది గొప్ప

ఏ పేరు పెట్టుకున్నా ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న వారి మౌలిక సిద్ధాంతం ఆరెస్సెస్ సంఘ పరివార్ భావజాలమే. మోడీ తనదైన రాజకీయ మెలికలతో దాన్ని అమలు చేసినా సారాంశం మారదు కదా! ఈ రోజున రెండు ఘటనలు ఈ ప్రభుత్వం దాన్ని ఆడించే పరివార్ నిజ స్వరూపాన్ని మరోసారి బహిర్గంచేశాయి.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం దాద్రిలోని బిషారా గ్రామంలో గోమాంసం కలిగివున్నారనే ఆరోపణతో ముస్లింకుటుంబంపై దాడి చేసి అఖ్లక్ ఖాన్‌ను అక్కడికక్కడే హతం చేసిన ఘటన తీవ్ర సంచలనంకలిగించింది. తర్వాత అలాటి దాడులు దేశమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో స్తానిక బిజెపి నాయకుడి కుటుంబ సభ్యులతో సహా 18మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. వారిలో ఒకరైన రవిశిశోదియా చికెన్‌గున్యాతో బుధవారం మరణించారు. పోలీసుల అదుపులో వుండగా మరణించాడు గనక ప్రభుత్వం పదిలక్షల పరిహారం ప్రకటించింది. కాని విహెచ్పి తదితర హిందూత్వ సంస్థలు మాత్రం దీన్ని పెద్ద సమస్యగా మార్చి అతని మరణానికి కోటిరూపాయలు పరిహారమివ్వాలని ఒకరికి ఉద్యోగం మంజూరు చేయాలని ఆందోళన చేపట్టాయి. పైగా ఆ నిందితుడి మృతదేహానికి జాతీయ పతాకం కప్పి దేశభక్తుడుగా వూరేగిస్తున్నాయి.గతంలో ముజఫర్‌పూర్ ఘటనలో నిందితురాలుగా అజ్ఞాతవాసం గడుపుతున్నసాధ్వీ ప్రాచీ తదితరులు విస్తారంగా పర్యటిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నట్టు సమాచారం. అసలు మృతుల కుటుంబాన్ని వదిలేసి హత్యకేసు నిందితుడికి సహాయపడాలని ఆందోళన చేయడం ఎంత విడ్డూరం?రానున్నఎన్నికలలో హిందూత్వ ప్రచారానికి ఈ ఘటనను వాడుకోవాలని వారు వ్యూహ రచన చేస్తున్నారట.
తప్పంతా రోహిత్‌దే! వారు ఉత్తములు!
మరోవైపున హెచ్‌సియు స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య తదనంతర ఉద్రిక్తతలపై దర్యాప్తు
కు నియమించబడిన రూపాని కమిషన్ నివేదిక కూడా ఇప్పుడే బహిర్గతం చేవారు.బండారు దత్తాత్రేయ, సృతి ఇరానీలతో సహా బిజెపి మంత్రులు ప్రజా ప్రతినిధులకు గాని, యూనివర్సిటీ ఉన్నతాధికారులకు గాని ఈ ఘటనతో సంబంధం లేదని కమిషన్ తేల్చిందట. రోహిత్ కేవలం వ్యక్తిగత నైరాశ్యంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప సామాజిక కారణాలు లేవన్నట్టు నిర్ధారించింది. అయితే ఇలాటివి పునరావృతం కారాడంటూ ఏవో కొన్ని పరిమితమైన సూచనలు చేసింది.
అంతకన్నా వింత ఏమంటే రోహిత్ దళితుడు కాదని చెప్పడం. ఈ విషయంపై విచారణ తన పరిధిలోది కాదంటూనే అతను దళితుడని చెప్పడానికి ఆధారాలు లేవని వ్యాఖ్యానించింది. తల్లి రాధిక కూడా కొడుకును సమర్థించడానికే అలా అంటుండవచ్చని ఆరోపించింది. అయితే ఈ నిర్థారణకు రావడానికి కేవలం తర్కంపైనే కమిషన్ ఆధారపడింది.రాధికను చిన్నప్పుడు పెంచుకున్న వారు ఆమె తలిదండ్రుల పేర్లు చెప్పివుండే అవకాశం లేదని కనుక ఆమెకు తెలియదని విశ్లేషణ చేసింది.స్వయంగా రాధిక చెప్పిన దాన్ని తోసిపుచ్చి తన స్వంత విశ్లేషణ చేయడం విశేషమే. ప్రభుత్వం నివేదికలో అనుకూల భాగాలను విడుదల చేసినట్టు కనిపిస్తుంది. ఇటీవల హెచ్‌సియు జెఎన్‌యు యూనియన్ల ఎన్నికల ఫలితాల అనంతరం కావాలని రాజకీయ కారనాలతో ఈ ఎంపిక చేసిన భాగాలు విడుదల చేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి.