కులం భాష నాది కాదు!

clarification111

ప్రత్యేక హౌదా ఇవ్వకపోయినా ప్యాకేజీ సాధించడంలో వెంకయ్య నాయుడు నిర్వహించిన పాత్ర చాలా చాలా గొప్పదనీ, ఆయన తప్ప అన్యథా శరణం నాస్తి అని ఆర్కే రాసిన కొత్తపలుకును విమర్శిస్తూ నేను ‘ ప్రత్యేక వంచనకు కొత్త పలుకుల వంత’ అని ప్రజాశక్తిలో వ్యాసం రాశాను. దాన్ని తెలకపల్లిరవి.కామ్‌ వెబ్‌సైట్‌లోనూ,తెలకపల్లి రవి వ్యూస్‌ ఫేస్‌బుక్‌లోనూ పోస్టు చేసేప్పుడు సులభంగా అర్థం కావడం కోసం ఆర్కే కొత్తపలుకుల వంత అని జోడించాను. దీన్ని ప్రైమ్‌పోస్టులో ఆ శీర్షికతోనే రీ పోస్టు చేశారు. తర్వాత మిత్రుడు కొమ్మినేని శ్రీనివాసరావు తన కొమ్మినేనిఇన్‌పోలో ‘ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను ఉతికేసిన తెలకపల్లి’ అన్న శీర్షికతో రెండు ముక్కలు ముందుమాట రాసి నా మ్యాటర్‌ రీ పోస్టు చేశారు. దరువు.కామ్‌వారు దీన్ని ఎబిఎన్‌ రాధాకృష్ణ, టివి9 రవి ప్రకాశ్‌ల బాబు భజనను ఉతికి పారేసిన తెలకపల్లి అంటూ మరో శీర్షికతో ఇచ్చారు. పచ్చ చౌదరీలకు పంచ్‌ అని కూడా కింద లైను జోడించారు. నా వ్యాసానికి విస్త్రత ప్రచారం రావడం సంతోషమే గాని ఈ రెండో శీర్షిక తర్వాత కొందరు సామాజిక కోణంలో స్పందించడం మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనూ కూడా రాజకీయ ఆర్థిక వ్యవహారాల్లో కులం పాత్ర బలంగా పనిచేస్తుందనేది నిజమే. పెత్తనాలూ ఆధిపత్యాలు కూడా నిజమే. కాని నా వరకు నేను అదొక్కటే ప్రధానమని భావించను. ఎవరినీ కులం పేరుతో కులాన్ని బట్టి విమర్శించను. కులం కన్నా రాజకీయ ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన పాత్ర వహిస్తాయని గుర్తుంచుకోవాలి. లేకుంటే ఎన్టీఆర్‌పై నాదెండ్ల భాస్కరరావు కుట్ర, చంద్రబాబు నాయుడు తిరుగుబాటు,ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో ములాయం కుటుంబంలో చిచ్చు, చిరంజీవి పవన్‌ కళ్యాణ్‌ల విభిన్న రాజకీయ పోకడల వంటివి అర్థం చేసుకోలేము. అలాగే మర్రిచెన్నారెడ్డి,విజయభాస్కర రెడ్డి, జనార్థనరెడ్డి,వైఎస్‌ రాజశేఖర రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, జగన్మోహన రెడ్డి, ఇన్ని దశల రాజకీయాలూ వుండేవి కావు. తెలంగాణలోనూ ఈ వాస్తవం వచ్చే ఎన్నికల నాటికి అర్థమవుతుంది. కనుక మిత్రులకు కార్యకర్తలకూ కూడా నా సలహా సూచన కూడా- కేవలం కులాన్ని బట్టే అన్నీ జరిగిపోతాయని భావించవద్దని. ఈ నా స్టోరీ విషయంలోనూ కులం భాష నాది కాదని స్పష్టం చేయదలచాను. కొంతమంది నా వ్యాసాన్ని షేర్‌ చేసుకుంటున్న వారు కూడా ఈ విషయం గమనంలో వుంచుకోవాలని మనవి.ఇది సంజాయిషీ కాదు- స్పష్టత మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *