నిజాంపై కెసిఆర్‌తో సంవాదం

nehru11 నిజాంను గద్దె దించడమే తప్పన్నట్టు మజ్లిస్‌ చేసే వాదన కూడా చాలా పొరబాటు.కమ్యూనిస్టులు దేశభక్తులు అన్ని సంస్థానాలలోనూ పోరాడారు తప్ప నిజాంపేనే కాదు, చల్లపల్లి మందసా వంటి చోట్ల జమీందారీ వ్యతిరేక పోరాటాలు చరిత్రలో నిలిచివున్నాయి.మునగాల పరగణాలోనూ ముందే పోరాటం జరిగింది. నిజాం ప్రజాస్వామ్య విలువలను కాలరాసి ప్రజలను వెట్టిచాకిరీకి గురి చేశాడు గనకే వ్యతిరేకించి పోరాడాల్సి వచ్చింది. ఇప్పటికీ ముస్లిం జన బాహుళ్యం దారుణ దారిద్య్రంలో జీవిస్తుండడంలోనే ఈ సత్యం వెల్లడవుతుంది. తెలంగాణా సాయుధ పోరాటంలో ఎందరో ముస్లిం నేతలు కీలక పాత్ర వహించారనేది బిజెప,ి మజ్లిస్‌ కూడా కాదనలేని వాస్తవం. నిజాంను నీ గోరి కడ్డం కొడకో అని హెచ్చరించింది నాటి తెలంగాణా పోరాట వీరులైతే నీ గోరికాడికొచ్చి నేను మొక్త కొడకో అన్నట్టు మాట్లాడేది కెసిఆర్‌. ఆయన తరచూ నిజాంను కాటన్‌ దొరతో పోల్చి ఏదో చెబుతుంటారు. ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన కాటన్‌ స్పష్టంగా పరాయి పాలకుల ఉద్యోగి. ఆయన తానొగా ఎవరినీ వెట్టిచాకిరీలో పీడించిన దాఖలాలు లేవు. ప్రజలు కాటన్‌ను పూజిస్తారే గాని విక్టోరియా రాణిని కాదు. అలాగే కావాలంటే నిజాం కాలం నాటి గొప్ప ఇంజనీరు అలీ నవాజ్‌ జంగ్‌ బహుదూర్‌ను పూజిస్తే వేరు. దీనిపై ఉద్యమ కాలంలోనే నాకూ కెసిఆర్‌కు చాలా వాదన జరిగింది. ఇప్పటికి ఆయన దాన్ని ప్రస్తావిస్తుంటారు. కాని నేను వెనక్కు తగ్గినట్టు చెబుతుంటారు. గాని అది నిజం కాదు. నాడు చర్చలో వున్న ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ జోక్యం కారణంగా వివాదం ముగించాము. నిజాం మైనస్‌లే ఎక్కువ అని ఆయన ఒప్పుకున్నారు.పోనీ నిజాం విమర్శించడానికి లేనంత గొప్పవాడేనని ఒప్పుకుంటే అంత గొప్పవాణ్ని పడగొట్టడం ‘విమోచనం’ ఎలా అవుతుంది? టిఆర్‌ఎస్‌ అధినేత ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిజాం వ్యతిరేక పోరాట వారసత్వాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే తెలంగాణా చరిత్ర సంసృతి అంటే మౌలికంగా భూస్వామ్య వ్యతిరేక పోరాటమే. నాటి భూస్వామ్య దొరల వారసులైనా కార్పొరేట్‌ కామందులైనా ఆ పోరాట పటిమను ఆహ్వానించలేరు. టిఆర్‌ఎస్‌కు మజ్లిస్‌తో స్నేహం మైనార్టి కోణం కన్నా భూస్వామ్య వ్యతిరేక చైతన్యం ముందుకు రావడం ఇష్టంలేని పని. పైగా తెలంగాణ అంటే తనే గుర్తుకురావాలి తప్ప కమ్యూనిస్టులను తల్చుకోకూడదు. కనుకనే నాడూ నేడూ .సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలనే కోర్కెను కూడా పెడచెవిని పెడుతున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *