త్రిముఖ కుట్రలపై త్రిపుర పోరాటం

07-08-15-agartala-tripura-assembly-2_0
నిరంతర అశాంతితో రాజకీయ అస్థిరతతో అతలాకుతలమవుతున్న ఈశాన్య భారతంలో ఒకేఒక సుస్థిరద్వీపంగా ప్రత్యామ్నాయ దీపంగా వెలుగొందుతున్న రాష్ట్రం త్రిపుర. అక్కడ విజయపరంపరలో పురోగమిస్తున్నది వామపక్ష ప్రభుత్వం కాగా దేశానికే ఆదర్శమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న నేత మాణిక్‌ సర్కార్‌. ఆ ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని బలోపేతం చేసి సున్నితమైన ఈశాన్య సరిహద్దులో శాంతిసామరస్యాలకు దోహదం చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. నిజానికి నరేంద్రమోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన కొత్తలోనైతే మీ ఒక్కరాష్ట్రమే ఎలా శాంతియుతంగా వుండగలుగుతున్నదని మాణిక్‌ సర్కార్‌ను వాకబుచేశారు కూడా! కాని ఈ రెండేళ్లలోనూ కేంద్రంలోని బిజెపి, దాని ప్రత్యక్ష పరోక్ష రాజకీయ నేస్తాలు త్రిపురను ఎలాగైనా సిపిఎం వామపక్షాల పట్టునుంచి తప్పించాలని విఫలయత్నాలు చేస్తూనే వున్నారు. రకరకాల విచ్చిన్న శక్తులకు పాలుపోసి పెంచుతున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ మరోసారి విజయం సాధించిన తర్వాత ఈ తరహా కుట్రలు కుత్సితాలు మరింత తీవ్రమవుతున్నాయి ఈ విచ్చిన్నకర ప్రయత్నాలు రాజకీయ కుట్రలూ రెండు స్థాయిల్లో జరగడం విశేషం. మొదటిది సంప్రదాయికంగా ఈశాన్య భారతంలో సమస్యగా వున్న గిరిజన గిరిజనేతర ఐక్యతకు చిచ్చు పెట్టడం. రెండు బిజెపి వెనకవుండి తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఎగదోసి వామపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీయడం.
విధ్వంసానికి వత్తాసు
గత నెలలో రాజధాని అగర్తలా నగరంలో త్రిప్రీలాండ్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై ఆందోళన పేరిట జరిగిన అచాచకం ఇందుకో నిదర్శనం. ఇండిజీనియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర( ఐపిఎఫ్‌టి- దేశీయ గిరిజన సంఘటన) గిరిజనులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చాలా కాలంగా రభస చేస్తున్నా పెద్ద ఆదరణ లేదు. ఇటీవల జరిగిన త్రిపుర గిరిజన కౌన్సిల్‌ ఉప ఎన్నికల్లో కూడా సిపిఐ(ఎం)ఘన విజయం సాధించింది. బిజెపి కాంగ్రెస్‌ తృణమూల్‌ కొన్ని గిరిజన సంస్థలు కలసి చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. అయినా సరే ఏదో విధంగా అక్కడ ప్రశాంతను భగం చేయాలనే దురుద్దేశంతో ఐపిఎప్‌టిని ముందు పెట్టుకుని విధ్వంసానికి పెద్ద పథకం పన్నాయి. హింసా దౌర్జన్యాలకు పాల్పడ్డాయి. అయితే ప్రభుత్వాధికారంతో పాటు ప్రజా బలానికి లోటు లేని వామపక్ష సంఘటన ప్రజలను సమీకరించి ఈ శక్తులకుతగు బుద్ధి చెప్పింది. సకాలంలో సమర్థంగా జొక్యం చేసుకున్న కారణంగా ఎలాటి తీవ్రమైన ఘటనలు లేకుండా పరిస్థితి అదుపులోకి వచ్చింది. వాస్తవానికి 1980లో నృపేన్‌చక్రవర్తి నాయకత్వంలో రెండవసారి వామపక్ష సంఘటన అధికారం చేపట్టినప్పుడే త్రిపుర ఉపజాతి సమితి,ఆమ్రబెంగాలి అనే దురభిమాన సంస్థ, హింసాత్మక శక్తి ఆనంద్‌మార్గ్‌ దారుణకల్లోలం సృష్టించాయి. భారీ ప్రాణ ధన నష్టం జరిగింది. అప్పటినుంచి వామపక్ష ప్రభుత్వం మరింత అప్రమత్తతతో గిరిజన గిరిజనేతర ఐక్యతను కాపాడుకుంటూ వస్తున్నది.కేంద్రంపై ఒత్తిడి తెచ్చి గిరిజన స్వయం పాలక మంtripura-chief-minister-manik-sarkar-and-delhi-347743డళ్లను దేశంలోనే ఆదర్శంగా ఏర్పాటు చేసింది.ఈశాన్య భారతంలో త్రిపుర ఒక భిన్నమైన ఉదాహరణగా నిలవడానికి ఇదే కారణం. సరిగ్గా ఈ ప్రశాంతతనే భగం చేయడానికి సిద్ధం కావడం ప్రధాన పాలకపార్టీల దివాళాకోరు తనానికి బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. ఏమైనా ప్రజల అప్రమత్తత కారణంగానే ఆ కుట్ర విఫలమైంది. కాని టిఎంసి బిజెపిలు ఈ ప్రత్యేక రాష్ట్ర కోర్కెను లోలోపల బలపరుస్తూనే వుండటం ఆందోళనకరం. నిజానికి ఈ విచ్చిన్న సంస్తలు అప్పుడప్పుడూ స్వతంత్ర త్రిపుర అనే ప్రమాదకర నినాదం ఇస్తున్నా ఈ పార్టీలకు పట్టడం లేదు. ప్రత్యేక రాష్ఠ్ర కోర్కెను గట్టిగా ఖండించకపోగా ఇటీవలి ఉప ఎన్నికలలో తాము పోటీచేయకుండా ఐపిఎప్‌టికి ఇవి మద్దతు ప్రకటించాయి. 2018లో జరగవలసిన శాసనసభ ఎన్నికల్లో సిపిఎంను ఓడించాలన్నదే వాటి లక్ష్యంగా వుంది.
ఫిరాయింపుల ప్రహసనం
బెంగాల్‌లో రెండవసారి విజయం సాధించడం టిఎంసి పార్టీకి అధినేత మమతా బెనర్జీకి విస్తరణ దాహం పెంచింది. గతంలోనూ త్రిపురలో పాగా వేయడానికి విఫలయత్నాలు చేసిన ఆ పార్టీ ఇప్పుడు అడుగుజారిన కాంగ్రెస్‌ నుంచి ఫిరాయింపులతో తన ఉనికిని పెంచుకోవాలని పాచికలు వేసింది.మొత్తం 60 మంది సభ్యులున్న త్రిపుర శాసనసభలో కాంగ్రెస్‌కు 10 మంది సభ్యులుండగా వారిలో ఆరుగురిని తమవైపునకు తిప్పుకోగలిగింది. బెంగాల్‌ ఎన్నికలలో సిపిఎంతో పొత్తుకు వ్యతిరేకంగా తాము టిఎంసిలోకి వెళ్తున్నట్టు వారు పైకి చెప్పినా వాస్తవంలో అది అనేక ప్రలోభాల పలితం.ఈ తరహా లావాదేవీలకు పెట్టింది పేరైన టిఎంసి నేత ముకుల్‌రారు, ఈ కొనుగోళ్ల క్రీడకు ఆధ్వర్యం వహించారు. పదిమందిలో కనీసం ఏడుగురు గనక ఫిరాయించి వుంటే అనర్హత వేటు ప్రసక్తిలేకుండా పోయేది.కాని ఆరుగురినే రాబట్టగలిగారు. ఈలోగా జితేంద్ర సర్కార్‌ అనే కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ తన మాతృసంస్థ అయిన సిపిెఎం వైపునకు తిరిగి వెళ్తానని ప్రకటించడంతో వారి ఆశలు నెరవేరలేదు. 2008 వరకూ సిపిఎంతో వున్న జితేంద్ర ఫిరాయించాలంటూ తనపై వస్తున్న ఒత్తిళ్లను భరించలేక తిరిగి వామపక్ష సంఘటన వైపు వెళ్లడం మంచిదని నిర్ణయానికి వచ్చారు. అంతేగాక కాంగ్రెస్‌లో తన చేదు అనుభవాలను సోదాహరణంగా వెల్లడిస్తూ దానికి అధికారం తప్ప ప్రజాశ్రేయస్సు పట్టదని ఎంగగట్టారు.తను గతంలో చేసిన తప్పిదాలు ఒప్పుకుంటూ మళ్లీ సభ్యత్వం కల్పించాల్సిందిగా సిపిఎంకు లేఖ రాశారు. జితేంద్ర పరివర్తన కారణంగా కాంగ్రెస్‌ సభ్యుల గోడ దూకుడు ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాకుండా పోయింది. ఏమంటే మిగిలిన సంఖ్య తొమ్మిదే అయినప్పుడు వారిలో ఆరుగురు మారడం మూడింట రెండువంతులు అవుతుంది. కాంగ్రెస్‌ నాయకులు పదేపదే ఈ విషయమై త్రిపుర శాసనసభ స్పీకర్‌ రవీంద్ర చంద్రదేవ్‌ దృష్టికి తెచ్చినా ఆయన చివరకు వారికి ఫిరాయింపుల చట్టం వర్తించదనే నిర్ణయించాల్సి వచ్చింది. ఆరుగురిని ప్రత్యేక బృందంగా గుర్తించేందుకు ఆయన అంగీకరించారు. అయితే తమనే ప్రధాన ప్రతిపక్షంగా చూడాలన్న వారి వాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏది ఏమైనా ఈ పరిణామం తర్వాత త్రిపురలో అసలే అంతంత మాత్రంగావున్న ప్రతిపక్ష శిబిరం మరింత చిన్నాభిన్నమైంది. అయితే పక్కనే అధికారంలో వున్న టిఎంసి, కేంద్రంలోని బిజెపి మాత్రం తమ రాజకీయ వ్యూహాలు కొనసాగిస్తున్నాయి.
బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత ఆగష్టు 19న అగర్తలాలో ఎంతో ఆర్భాటంగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తే జనం హాజరు చాలా పలచనగా వుండటం ఇరకాటంగా మారింది. వారు ప్రకటించిన దానిలో నాలుగో వంతు కూడా రాకపోవడం పరువుతక్కువైంది. తాను త్రిపురను కూడా సిపిఎం పాలననుంచి విముక్తి చేస్తానంటూ సాగిస్తున్న హడావుడికి ఇది శృంగభంగంగా పరిణమించింది. వామపక్ష పాలనలో త్రిపుర వెనకబడినట్టు తన ప్రభుత్వం అద్భుతంగా పథకాలు అమలు చేస్తున్నట్టు ఆమె విమర్శించడంపై ప్రభుత్వం సవివరమైన ఖండన విడుదల చేసింది. అయినా టిఎంసి రాజకీయ కుత్సితాలు సాగిస్తూనే వున్నట్టు అనేక కథనాలు వస్తున్నాయి.
ఆరెస్సెస్‌ రంగ ప్రవేశం
ఇక బిజెపి గాని,కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్రానికి సంబంధించిన కనీస కోర్కెలు కూడా నెరవేర్చకపోగా నిరాధారమైన ఆరోపణలతో దాడి చేస్తున్నది. 1964 తర్వాత తొలిసారి త్రిపురలో ఒక రైల్వేలైను(అగర్తాలా- న్యూ ఢిల్లీ) నిర్మాణానికి ప్రారంభం చేయడంపై చాలా ప్రచారం చేసుకున్నారు. కాని దీనికోసం గత యాభై ఏళ్లుగా వామపక్షాలు అగ్రనేతలతో సహా ఆందోళన చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. పైగా బంగ్లాదేశ్‌తో సంబంధాలు పెంచుకోవడం కూడా ఈ రైల్వేలైనులో ఒక వ్యూహాత్మక లక్ష్యం. కాశ్మీర్‌లోనూ ఇతర కొన్ని ఈశాన్య రాష్ట్రాలలోనూ పరిస్తితిని ప్రశాంతపర్చలేక చేతులెత్తేస్తున్న బిజెపి ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగతున్న త్రిపురను కేవలం వామపక్షాలపై కక్షతో వివక్షతో కల్లోలపర్చడానికి చేయూత నిస్తున్నది.వారి మాతృసంస్థ ఆరెస్సెస్‌ ప్రత్యేకంగా కొందరిని ఈ రాష్ట్రానికి కేటాయించి పంపించింది.తమకు అలవాటైన సైనిక విద్యల శిక్షణ నిస్తూ వారు స్థానికంగా వున్న మతసామరస్య వాతావరణం దెబ్బతినడానికి ఉద్రిక్తత పెరగడానికి కారకులవుతున్నారు. మొదట్లోనే చెప్పుకున్నట్టు ప్రత్యేక రాష్ట్రం స్వతంత్ర త్రిపుర వంటి నినాదాలకు కూడా మద్దతునిస్తూ మంట పెట్టేందుకు కారకులవుతున్నారు. చివరగా చెప్పాలంటే ఇటీవల విజయవాడ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ను టిఎంసి వ్యూహాలపై ప్రశ్నించినపుడు వారి పథకాలు పారేవి కావని వారి బలం చాలా పరిమితమని స్పష్టం చేశారు. అయితే తాము అలసత్వానికి లోనుగాకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని కూడా వివరించారు.
నవ తెలంగాణ, సెప్టెంబరు 8,2016

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *