ప్రత్యేక ధోకా
ఇది ఆంధ్రజ్యోతిలో నా గమనం శీర్షికన శుక్రవారం ( 9,9,2016) ప్రచురితమైన వ్యాసం. ఇందులో కొన్ని విషయాలు గతంలో చెప్పుకున్నా మిత్రుల కోసం దాన్ని తాజాపర్చి ఇక్కడ ఇస్తున్నా

మా వూళ్లో కొంతమంది కాకా/ రాయుళ్లున్నారు వాళ్లు బాకా/ బాగా పడతారు కాని అదంతా కా/వలసింది సాధించుకునే దాకా/ ఆపై ఇస్తారు ధోకా
ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హౌదా/ ప్యాకేజీపై అరుణ్‌జైట్లీ అండ్ కో అర్థరాత్రి కుతంత్రం చూస్తుంటే శ్రీశ్రీ సరదాగా రాసిన ‘ప్రపంచతంత్రం’ అనే ఈ చరణాలు గుర్తుకొచ్చాయి. ప్రత్యేకధోకా, ప్రత్యేక వంచన వంటి పేర్లతో ఈ ఏడాది కాలంలోనూ చాలా చర్చలు వ్యాసాలూ నడుస్తున్నవే.కాని కృష్ణా పుష్కరాలకు కాస్త అటూ ఇటుగా మొదలై చివరకో నిరర్థక తతంగంగా ముగిసిన ప్రత్యేక ప్రహసనం వాటన్నిటినీ మించిపోయింది. ఏమీలేని దానికి ఏమీ చేయని దానికి ఇంతోటి నాటకం దేశంలో ఇదే ప్రథమం కావచ్చు. ఒక విభజిత క్షుభిత రాష్ట్రం విషయంలో ఇంత బాధ్యతా రాహిత్యం వూహకందేది కాదు. ఎన్నికల వాగ్దానాలు, ఉల్లంఘనలూ వంటివి చూస్తుంటాం గాని ఒక చారిత్రిక సన్నివేశంలో పెద్దల సభ సాక్షిగా అందరికన్నాపెద్ద హౌదాలో వున్న ప్రధానమంత్రి ప్రధాన ప్రతిపక్షం అభ్యర్థనతో ఆమోదంతో ప్రకటించిన అధికార పూర్వక ప్రకటన ఇంత దుర్గతి పాలవడం సిగ్గుచేటు. .ప్లాప్ సినిమాకు పక్కా స్త్రీన్‌ప్లే అన్నట్టు దీనికి అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు,సుజనా చౌదరి వంటివారు కనిపించే భాగస్వాములు కాగా కనిపించని తలలు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ మట్టి నీళ్లతో సరిపెట్టడం, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్కాకేజీ మాత్రమే అడగడం జరిగినప్పుడే ఈ నాటకం తొలి అంకం పూర్తయిపోయింది.
ఈ కాలమంతటా కూడా బిజెపి నేతలు కలిసినప్పుడల్లా హౌదా ఇచ్చే ప్రసక్తి లేదని చెబుతూనే వున్నారు. కాని చంద్రబాబు ఆయన ప్రభుత్వం మాత్రం ఏదో ఒరిగిపడుతుందనే భ్రమను బతికిస్తూ వచ్చారు. నా వరకు నేను హౌదా కృష్ణార్పణం, ప్యాకేజీకి పిండి ప్రదానం అని రెండు వారాల కిందటే వ్యాసం రాశాను హౌదా అనేది సెంటిమెంటు కాదు, ఆయింటు మెంటు కాదు, కమిట్ మెంటు అని చెప్పాను. హౌదా వల్ల వచ్చేది ఎంత, ప్యాకేజీ వల్ల గిట్టేది ఎంత అని అసందర్భ వాదనలు ఎపికి ఎంత ఇచ్చారనే లెక్కలకన్నా ఇచ్చిన మాట ఎందుకు తప్పుతున్నారనేది పెద్ద సవాలుగా మారిందంటే అందుకు ప్రభుత్వాలే కారణం తప్ప ప్రజలో ప్రతిపక్షాలో కాదు. తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలు గాని ముఖ్యమైన పార్టీలు గాని వద్దన్నది లేదు. ప్రత్యేక హౌదా ఇప్పటికి ఇంకా రద్దు కాలేదు గనక ఎపికి ఇచ్చివుంటే దాదాపు నాలుగేల్లు కొనసాగేది. ఈశాన్య రాష్ట్రాలకూ కాశ్మీరుకూ వున్న హౌదాను రద్దు చేయొద్దని ఆ ముఖ్యమంత్రులు కోరడమే గాక కొందరు కోర్టుకు వెళ్లే ఆలోచనలు కూడా చేస్తున్నారు. కనుక ఇది ఇంకా ముగియని అధ్యాయమే.
ప్రత్యేక హౌదా రావడానికి మేమే కారణమని దాన్ని రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన టిడిపి బిజెపి దాన్ని వమ్ము చేయడం రాజకీయ విశ్వసనీయతకూ రాజ్యాంగ విలువలకు కూడా విఘాతం. ఇది చారిత్రికంగా రాష్ట్ర విభజన వద్దని భావించిన ఆంధ్రప్రదేశ్ భాగంలోని ప్రజల మానసిక గాయాలపై కారం రాయడమే. అది ఎవరికీ మంచిది కాదు. అరుణ్‌జైట్లీ విభజన చట్టం, ప్రధాని ప్రకటనల గురించి చెప్పవచ్చు గాని 14వ ఆర్థిక సంఘం, నీటి ఆయోగ్‌ల ప్రస్తావన ఎలా చేస్తారు? విభజన బిల్లు ఆమోదానికి ముందే 14వ ఆర్థిక సంఘం ఏర్పడింది! దానికి ఇచ్చిన ప్రస్తావనాంశాలలో హౌదా విషయమే లేదు. ప్రణాళికా సంఘం రద్దు నీటి ఆయోగ్ పూర్తిగా ఈ ప్రభుత్వ నిర్వాకాలు. దీనికి ప్రజలెందుకు మూల్యం చెల్లించాలి? సాధారణంగా ప్రభుత్వ వ్యవహారాలలో ఏదైనా వ్యవస్థను రద్దు చేస్తున్నప్పుడు దానివల్ల ప్రయోజనం పొందేవారికి ముందు భద్రత భరోసా కల్పించడం జరుగుతుంటుంది. లేకపోతే న్యాయస్థానాలు కూడా ఒప్పుకోవు. ప్రత్యేక హౌదా వల్ల పెద్దగా ఒరిగేది లేదనుకుంటే అప్పుడు వాటిని ఇర్చేస్తే సరిపోతుంది కదా! హౌదా కన్నా మిన్నగా ప్యాకేజీ ఇస్తామనడం ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానన్న చందమే.
అరుణ్‌జైట్లీ చెప్పిన ప్రకారమే ఇప్పటికి రాష్ట్రానికి అన్ని విభాగాల కింద ఇచ్చిన మొత్తం దాదాపు ఎనిమిది వేలకోట్ల మేరకు వుంటుంది. కనీసం మొదటి ఏడు రెవెన్యూ లోటును కూడా పూర్తిగా భర్తీ చేయలేదు. తాజా ప్రకటనలోనూ దేనీకీ క్వాంటిఫికేషన్(సంఖ్యా పరిమాణం) లేనేలేదు. వాస్తవానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటనలో ప్రత్యేక హౌదా ఒక అంశమే. మరో ఆరు విషయాలుదానిలో వున్నాయి.1. ప్రత్యేక హౌదా 2. రెండురాష్ట్రాలలోనూ పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు 3.ఒరిస్సాలో కోరాపుట్ బోలంగిర్ కల్హాంది(కెవికె) లోనూ, యుపి ఎంపిలకు చెందిన బుందేల్‌ఖండ్ లోనూ అమలు చేస్తున్న ప్రత్యేక ప్కాకేజీ తరహాను ఎపికి వర్తింపచేయడం 4.పోలవరం పునరావాసం 5. సిబ్బంది ఆర్థిక వనరుల కేటాయింపు 6.14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వరకూ ఆగకుండానే రెవెన్యూ లోటు భర్తీ. ఇవన్నీ చెప్పిన తర్వాత ముగింపులో మన్మోహన్ అన్న మాట మరింత ముఖ్యమైనది. ”ఈ చర్యల ద్వారా మేము కేవలం తెలంగాణ ఏర్పాటుకే గాక సీమాంధ్ర సౌభాగ్య సంక్షేమాలకు గట్టిగా కట్టుబడివున్నామని తెలియజేయదలచాము” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ తప్పొప్పులు బిజెపి టిడిపి విశిష్టతల గురించి దండకాలు చదివేబదులు ఈ మాటల స్పూర్తిని గుర్తించడం బాధ్యత గల నాయకుల కర్తవ్యం.
ప్రత్యేక హౌదా రాకపోవడానికి 14వ ఆర్థిక సంఘానికి ఏ మాత్రం సంబంధం లేదని నేను మొదటి నుంచి ఇంకా చెప్పాలంటే మొదటగా వాదించాను. నిన్న మీడియా గోష్టిలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ దాన్నుంచి తగు భాగాలు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ రోజు వెబ్‌సైట్‌లో 2.29, 2.30 పేరాలు పొందుపరుస్తూ ఈ కారణంగానే హౌదా ఇవ్వలేకపోతున్నట్టు వివరణ ఇచ్చారు.
అయితే ఈ పేరాల్లో ఎక్కడా హౌదాను తొలగించాలని గాని, తప్పని గాని లేదు. తమ నిధుల కేటాయింపు సమయంలో మాత్రం మామూలుగానే లెక్క వేసినట్టు మాత్రమే కమిషన్ తెల్పింది. ఆర్థిక వెసలు బాటులేని ఈశాన్య రాష్ట్రాలు కొండిపాంత రాష్ట్రాలకు అదనంగా సహాయం ఇచ్చేందుకు మామూలు పద్ధతినే పాటించానని చెప్పింది. అలాగే ఇతర అవసరాలున్న రాష్ట్రాలకు కూడా మామూలు పంపిణీ అయిన తర్వాత అదనంగా కేటాయించినట్టు చెప్పింది. అసలు మామూలుగానే నిధులు లెక్కకట్టేప్పుడు నార్మేటివ్ సాధారణ నిష్పత్తి తీసుకోవాలన్నది పద్దతి. అదనం తర్వాత కలుపుతారు. ఎప్పుడూ అనుసరించే ఈ సూత్రాన్ని ఏదో గొప్ప వినూత్న విషయంగా తమకు అవరోధంగా అరుణ్‌జైట్లీ వెంకయ్య నాయుడు వంటి సీనియర్లు చెప్పడం హాస్యాస్పదం. పైగా ఆ కారణంగానే హౌదా ఇవ్వలేకపోయామని ప్రత్యేకంగా చెప్పడం ఇంకా విడ్డూరం.
మన్మోహన్ ప్రకటనలోని కెబికె ప్యాకేజీ గురించి గాని, హౌదా కింద వచ్చే ప్రత్యేక రాయితీల గురించి గాని కూడావెబ్‌సైట్‌లో పేర్కొనలేదు. అంలే వాటిని కూడా మినహాయించారన్న మాట.
ప్రత్యేకహౌదాతో సమానమైన సహాయం అనడం బాగానే వుంటుంది గాని ఎలా లెక్క వేస్తారు? 40:60శాతం నిధుల పంపిణీని 90:10శాతంగా చూడటం ప్రతిసారీ సాధ్యమేనా? వ్యవసాయ ప్రధానమైన ఎపిలో పారిశ్రామికీకరణకై హౌదా కింద 100 శాతం ఎక్సయిజ్,100శాతం ఐటి, 30 శాతం పెట్లుబడి సబ్సిడీ,3 శాతం వడ్డీ సబ్సిడీ ఇవ్వాల్సి వుంటుంది. దీనికోసం ఏడాదికి 500 కోట్లు ఇస్తామంటే సరిపోతుందా? ఎవరికి ఇవ్వాల్సింది ఎవరికి ఇస్తున్నట్టు? ప్రోత్సహకాలు లేవని ఔత్సాహికులను వెనక్కునెట్టి బడా గుత్తాధిపతులకే పెద్ద పీట వేయదలచారా? నిరుద్యోగ యువత బాధావేదనలు నిర్లక్ష్యం చేస్తారా? నిర్లక్ష్యానికి గురవుతున్న రాయలసీమ, ఉత్తరాంధ్రల సంగతేమిటి? పోలవరం కేంద్రం బాధ్యత అంటూనే రాష్ట్రానికి అప్పగించడం బాధ్యత లేకుండా చేసుకోవడమా లేక రాజకీయ ఒత్తిళ్ల ఫలితమా? ్ట 13వ షెడ్యూలులో వున్న కీలకమైన సంస్థలను సమగ్రంగా వేగంగా స్థాపించడానికి చర్యలేవీ. రాజధాని నిధులపైనా నిర్మాణంపైనా అర్థవంతమైన సాయం సమన్వయం ఎక్కద వున్నాయి? గతంలో ప్రధాని హామీకే చట్టబద్దత లేదన్న వారు ఇప్పుడు ఫ్రధాని లేనప్పుడు హడావుడిగా అరకొరగా ఏదో ప్రకటన చేసి క్యాబినెట్ ఆమోదం కావాలని చెబితే దాన్ని తీవ్రంగా పట్టించుకోవలసిన అవసరం వుందా?అర్ధరాత్రి మీడియాను పిలిచి మరీ ఆహ్వానించాల్సినంత అపురూపమైన అంశాలు అందులో ఏమున్నాయి? హౌదాపై రాజీపడే ప్రసక్తిలేదనే వారు ఈ నిరాకరణను స్వాగతించడానికి హడావుడి ఎందుకు పడినట్టు? ఏదో విధంగా ఈ అధ్యాయాన్ని ముగించాలనే ఆదుర్దా కేంద్ర రాష్ట్రాలకు వుంది. చెప్పాలంటే ప్రభుత్వ నిధుల కన్నా ప్రైవేటు భాగస్వామ్యం విదేశీ సంస్థలతో కలసి వెళ్లడానికి ఎక్కువ ఉత్సాహం వుంది. అమరావతి అందుకు ప్రత్యక్ష సాక్ష్యం.
ఈ తాజా పోటుతో ఎపి ప్రజల అసంతృప్తి ఆగ్రహావేదనలు తారాస్థాయికి చేరడం తథ్యం. దానికి ప్రతిపక్షాలను ఆడిపోసుకుని ప్రయోజనం లేదు. హౌదా కోసం నిధుల కోసం మీ వెంట నడవడానికి సిద్ధంగా వున్నామని వైసీపీ కాంగ్రెస్ కమ్యూనిస్టుపార్టీలూ పదే పదే ప్రకటించినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు.ఏకోన్ముఖ స్వరం లేదు గనక కేంద్రమూ ఖాతరు చేయలేదు. ప్రభుత్వం రాజీపడినా ప్రజలూ ప్రతిపక్షాలూ దీనిపై ఉద్యమించడం అనివార్యం. ప్రభుత్వాలు వ్యక్తులపై పార్టీలపై కక్షను విముఖతను మనసులో పెట్టుకుని చారిత్రిక ఘట్టాల్లో తప్పు చేస్తే చెల్లించాల్సిన మూల్యం భారీగానే వుండొచ్చు. నిన్నటి తమ మిత్రుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడలో జరిపే సభలోనూ రేపు ప్రతిపక్షాల బంద్‌లోనూ ఎదురయ్యే నిరసన భవిష్యత్తుకు ఒక సంకేతం మాత్రమే.స్పందించడమా లేదా అన్నది ప్రభుత్వ విజ్ఞతపై ఆధారపడి వుంటుంది.
.