ఉత్తమ్‌ సవాల్‌ స్వీకరించారా?

KCR-at-Begumpet-Airport

నిన్న ఈ సైట్‌లో చెప్పుకున్నట్టు టిఆర్‌ఎస్‌ పార్టీ మహారాష్ట్రతో ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో ప్రచారానికి వాడుకోగలిగింది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆలసిపోయినట్టు కనిపిస్తున్నా ఆవేశం ఆగ్రహం తగ్గకుండా మాట్లాడారు. వృథాగా పోతున్న గోదావరి జలాల వినియోగమే తెలుగు రాష్ట్రాల నీటిపారుదల సమస్యలకు పరిష్కారమని పుచ్చలపల్లి సుందరయ్య వంటి దూరదృష్టి గల నేతలు ఎప్పుటినుంచో చెబుతూ వచ్చారు. ఇచ్చంపల్లి గురించి ఆయన వివరంగా చెప్పడం నేను చాలాసార్లు విన్నాను. ఒక పంటనకు నీరు, తాగునీరు తర్వాతనే రెండవ పంటనీరు గురించి ఆలోచించాలని ఆయన అంటుండేవారు.
అదలావుంచితే – మేడిగడ్డ ఎత్తును 152 నుంచి 148కి తగ్గించుకోవడం కెసిఆర్‌ దృఢ నిర్ణయం. దీనిపై తీవ్ర విమర్శలే వున్నాయి. ప్రాజెక్టు నడకను ఫలితలను బట్లి వాటిపై నిర్ణయానికి రాగలం. అయితే ఈ సమయంలో కాంగ్రెస్‌పైచేసిన తీవ్ర విమర్శలే ఆసక్తికరమైనవి. తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్‌ అని ఆరోపించారు. అత్యధిక కాలం పాలించింది వారే గనక విమర్శలకూ వారే పాత్రులవుతారు. తెలుగుదేశం ప్రాజెక్టులను పట్టించుకోని మాటా నిజమే. అయితే కాంగ్రెస్‌లో విలీనానికి కూడా టిఆర్‌ఎస్‌ సిద్ధమైపోవడం తెలిసిన చరిత్రే.విభజన బిల్లు చర్చకు వచ్చే తరుణంలో కూడా కెసిఆర్‌ సమావేశం జరిపి మనం కలిసిపోవడానికి తయారుగా వుండాలని చెప్పిన సంగతి చాలా మంది టిఆర్‌ఎస్‌ ముఖ్యులే చెబుతుంటారు. ముఖ్యమంత్రిగా ముందస్తు ప్రకటన చేయడం దగ్గర పేచీ వచ్చింది తప్ప నాశనం చేసిందంటున్న కాంగ్రెస్‌ను దూరం పెట్టాలనే ఆలోచన ఆయనకు అప్పటికి లేదు. ఇప్పుడు వూరికే తిట్టిపోసినా ఆ వాస్తవం మారదు.
అయితే ఈ ప్రసంగంలో కెల్లా ప్రధానమైంది కాంగ్రెస్‌ రాష్ట్ర అద్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌కు ఆయన విసిరిన సవాలే. 152 అడుగులపై అవగాహన కుదిరినట్టు ఆధారం తీసుకొస్తే ఎయిర్‌పోర్టు నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా ఇచ్చేస్తానన్న సవాలును కాంగ్రెస్‌ స్వీకరించలేదంటే వారి వాదనలో పస లేదనుకోవాలి. లేకపోయినా వారు రాజకీయ సన్యాసం చేస్తారని ఎవరూ అనుకోరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *