వెలమ వర్సెస్‌.. కాపు మైనస్‌… టిడిపి టిఆర్‌ఎస్‌లలో మారుతున్న అంచనాలు?

trs, tdp

మామూలుగా కులాల భాషలో మాట్లాడ్డం నాకు ఇష్టం వుండదు గాని ఈ మధ్య తరచూ ఆ తరహా చర్చలే ముందుకొస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాజకీయాల భవిష్యత్తు గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ రెండు కులాల చుట్టూ చర్చ తిరుగుతున్నది. అయితే వాటి గురించిన స్పందనలు వేర్వేరుగా వుంటాయి. అప్రతిహతంగా వున్నామని చెప్పుకుంటున్న రెండు పాలక పార్టీలైన టిఆర్‌ఎస్‌,టిడిపిలలో అంతర్గతంగా మారుతున్న అంచనాలకు అవి అద్దం పడుతున్నాయి. ఇవి అక్షరాలా ఆయా పార్టీల నేతల భావాలేగనక తెలుసుకోవడం ఆసక్తికరంగా వుంటుంది.
ముందుగా ఎపి విషయమే తీసుకుంటే వైసీపీ నుంచి చాలా మంది ఎంఎల్‌ఎలు టిడిపిలోకి దూకిన తర్వాత ఆ పార్టీని కొంత నిరుత్సాహం ఆవరించింది. జగన్‌ కూడా మామూలు కంటే ఎక్కువగా సమీక్షలు చర్చలు నిర్వహించారు. మొత్తంపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీని దెబ్బతీయగలిగారనే తెలుగుదేశం నేతలు అంచనాకొచ్చారు. దీన్ని గురించి అడిగినపుప్పడు వైసీపీ నేతలు సహజంగానే అదేం లేదని కొట్టిపారేశారు. వారికిష్టమైన కులాల లెక్కలు చెప్పి కాపులు ఇంత జరిగిన తర్వాత తెలుగుదేశం వైపు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. పైగా జగన్‌ క్రమేణా వేగం పెంచాలనుకుంటున్నారని కొంత వరకూ సలహాలు స్వీకరిస్తున్నారని కూడా ఆ నాయకుడు అన్నారు. తర్వాత చూస్తుంటే టిడిపిలోనూ అభిప్రాయం మారుతున్నట్టు కనిపిస్తుంది. సామాజిక సమీకరణాలు బిగుసుకుపోయిన ఎపిలో వైసీపీ బలంలో వచ్చిన పెద్ద తగ్గుదల ఏమీ లేదని కొందరు టిడిపి నేతలు కూడా అంగీకరించారు. ఇప్పటికి వైసీపీనే పెద్ద ప్రత్యామ్నాయంగా వుందని అన్నారు. తమకు వ్యతిరేకంగా వారికి ఓటు వేసిన వారెవరూ మళ్లీ ఇటు తిరిగింది లేదని వివరించారు. అయితే కాపుల విషయంలోనూ ఎన్ని చర్యలు తీసుకున్నా గతంలో వ్యతిరేకంగా వున్న వారంతా ఇప్పుడు కూడా అలాగే వున్నారని అభిప్రాయపడ్డారు. వారిలో ఇంకా ఏమైనా మార్పు వస్తుందేమో ముందు ముందు చూడాలన్నారు. వెనువెంటనే కాకపోయినా భవిష్యత్తులో జగన్‌కు ఒక అవకాశం వస్తుందని ఆ టిడిపి ప్రతినిధి జోస్యం చెప్పారు. ప్రత్యేక హాదా నిరాకరణ, ప్యాకేజీ కూడా అంతంత మాత్రంగా వుండటం, తునిలో అమాయకులపై కేసులు పెట్టడం వంటివన్నీ టిడిపిపై వ్యతిరేకత పెంచాయనే భావం వుంది. దాన్ని న్యూట్రలైజ్‌ చేసుకోవడమే పెద్ద సవాలు కాగా కొత్త వారిని తిప్పుకోవడం ఇంకా కష్టమని అంటున్నారు. బహుశా ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్ది జగన్‌ మరింతగా జనంలోకి వెళ్లి మద్దతు పెంచుకుంటారని ఆయన అనుయాయులు భావిస్తున్నారు. ఆ లోగా మనం జాగ్రత్త పడాలని టిడిపి నేతలు చంద్రబాబుకు సూచిస్తున్నారు.
ఇక తెలంగాణకు వస్తే నిన్నమొన్నటి వరకూ టిఆర్‌ఎస్‌ మళ్లీ గెలవడం ఖాయమన్న మాట వినిపిస్తుండేది. ముఖ్యమంత్రి కెసిఆర్‌ తెలుగుదేశంను కలిపేసుకుని కాంగ్రెస్‌ను దెబ్బతీశారని గొప్పగా చెప్పేవారు. వరంగల,జిహెచ్‌ఎంసి, ్‌ ఎన్నికల తర్వాత ఇక ఎదురులేదనే భావన ఏర్పడింది. అయితే ఇప్పుడిప్పుడే ఈ ధోరణి కొంత మారుతున్నది. జగన్‌ బలం తగ్గలేదని టిడిపి ప్రతినిధి ఒకరు అన్న మాటలు నిన్న చూశాం. అదే కోవలో టిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధి ఒకరు మాట్లాడారు. మరోసారి తాము అధికారంలోకి రాకపోవచ్చన్న సందేహం వ్యక్తం చేశారు. అంత పోరాటం చేస్తేనే అత్తెసరు మెజార్టితో గెలిచిన ఇటీవల వరసుగా వస్తున్న సమస్యల మధ్య మళ్లీ గెలవడం అంత సులభం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి కెసిఆర్‌ ఘనత గురించి చాలా ప్రచారం జరుగుతున్నా ఆయన ఎవరినీ కలవకపోవడం, సంతానానికే అన్నిటా పెద్దపీట వేయడం చాలామంది టిఆర్‌ఎస్‌ నేతలకు మింగుడుపడటం లేదు. వారసత్వం అన్నిచోట్లా వున్నదే గాని మంత్రి హరీష్‌ రావుతో సహా మిగిలిన వారిని పూర్తిగా పట్టించుకోకపోవడంపై ఈ నాయకులు చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉన్నంతలో డబ్బులున్నవారికి డబ్బులు తేగలిగిన వారికి మాత్రమే ప్రాధాన్యత లభిస్తున్నదని వీరంటున్నారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌ గనక సకాలంలో సమర్థంగా వ్యవహరించి వుంటే పరిస్థితి ఇంత ఏకపక్షంగా వుండేది కాదన్నది వారి అంచనా. జిల్లాల పునర్విభజన, ప్రాజెక్టుల వివాదం వంటివి కూడా వాడుకోలేని దుస్థితిలో కాంగ్రెస్‌ పడిపోయిందని వారి విమర్శ. అయితే ప్రజల్లో మాత్రం అసంతృప్తి పెరుగుతున్నదని, కింద క్షేత్రస్థాయిలో వెళ్లినప్పుడు నేతలకు అది అనుభవంలోకి వస్తున్నదని ప్రముఖ వ్యక్తులే చెబుతున్నారు. అన్నిటికన్నా వెలమలకే ప్రాధన్యత లభిస్తున్నదని ఆ పార్టీలో ఇతర నేతలు అంటున్నారు. టిడిపి ఓటుకు నోటుతో దారుణంగా దెబ్బతిన్నా వెలమ వర్సెస్‌ రెడ్డి కోణంలో రాజకీయాలు మలచబడే అవకాశాలు చాలా ఎక్కువగా వుంటాయని ఒక టిఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత చెప్పారు. తమకు సంబంధించిన ఒకేఒక్క మంత్రికి తప్ప మిగిలిన వారెవరికీ విలువ ఇవ్వడం లేదని, ప్రజల దృష్టిలో ఆ మంత్రికి పెద్దగా గౌరవం లేదని వివరించారు.
మొత్తంపైన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కమ్‌ సామాజిక వైరుధ్యాలు తీవ్రమవుతున్న సంకేతాలు గోచరిస్తున్నాయి. ప్రజా సమస్యలు ఎలాగూ పేరుకుపోతున్నాయి గనక అసంతృప్తి పెరుగుతుంటుంది. ఎన్నికలు ఇంకా దూరంలో వున్నాయి గాని ఏకపక్ష వాతావరణం మారిపోతున్నదనేది స్పష్టం. గ్రహించకపోతే పాలక పక్షాలకే నష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *