కామెడీనే బంగారం
ఆలస్యంగా నిన్న రాత్రి బాబు బంగారం సినిమా చూశాను. (చాలా సార్లు అంగీకరించినట్టు సినిమాల విషయంలోనూ కమర్షియల్ చట్రాన్ని మించినదేమీ అంతగా ఆశించను.) వెంకీ సినిమాల్లో వీలైనంత హాస్యం ఆస్వాదించవచ్చని ఆశ. కొన్నిసార్లు బోలెడంత సెంటిమెంటు కూడా వున్నా నవ్వులకు గ్యారంటీ వుంటుంది. అయితే బాబు బంగారం చూస్తే కామెడీ పూర్తిగా వండి వార్చేశారనిపిస్తుంది. ఏదో క్రైమ్ డిటెక్షన్ వున్నా అది కేవలం కథ కోసమే. నూటికి నూటయాభై శాతం హాస్యం నింపేశారు. వెంకీ కూడా నువ్వునాకు నచ్చావ్, నమో వెంకటేశ తరహాలో పాత ఫక్కీలో దిగిపోయి అలరింపచేశాడు. వెన్నెల కిశోర్, పృథ్వి, వంటి వారి పెర్మామెన్స్ చూస్తే మన ఎంత టాలెంట్ దాగుందో అర్థమవుతుంది. పోసాని కృష్ణమురళి సరేసరి. ఆఖరుకు చమక్ చంద్రను కూడా వదులుకోకుండా చోటు కల్పించారు. సీరియస్ హీరోయిన్‌గా నయన తార, రౌడీ విలన్ సంపత్ లను, మినహాయిస్తే మిగిలినవన్నీ హాస్యం అందిస్తాయి. ఏది ఏమైనా ప్రేక్షకులు నవ్వులే కోరుతున్నారని అందుకోసం ఏంచేసినా పర్వాలేదని మన దర్శక నిర్మాతలు నిర్థారణకు వచ్చేశారు. ఈ క్రమంలో హీరోలు కూడా కామెడియన్ల స్థానాన్ని ఆక్రమించేస్తున్నారు. అయితే అది రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ తరహాలో కాదు. పవన్ కళ్యాణ్ మార్క్ ఆషామాషీ వేసాలేసేస్తున్నారు. చెప్పాటంటే వెంకీ ఆ విషయంఓ పవన్ కన్నా సీనియరే. ఆయన ఘర్షణను పవన్ గబ్బర్‌సింగ్‌ను కలిపి నవ్వుల్లో ముంచితే బాబు బంగారం అవుతుందేమో. ఐలం సాంగ్ పడిపోతుందని ఒకింత చికాకు కలిగించే తరుణంలో కూడా బాబు బంగారం అన్న గ్రూపు సాంగ్ తో నడిపించడం రిలీఫే. ఎవరో అన్నట్టు నాగార్జున వూపిరి, నిరంతర సింహ బాలయ్య చిత్రాలు, ఇప్పుడు వెంకీ బంగారం చిత్రాలు చూస్తుంటే సీనియర్లు పునరాగమనం విజయవంతంగానే చేసినట్టు అర్థమవుతుంది. ఇక మెగాస్టార్ 150 కూడా అయిపోతే తెలుగు సినిమా చరిత్రలో ఒక క్రమం పూర్తవుతుంది. మామూలుగానే మాస్ ఎంటర్‌టైనర్‌గా జాగ్రత్తలు తీసుకునే మెగాస్టార్ లేనిపోని సాహసాలు ఎలాగూ చేయరనేది ఖాయం. నానీ శర్వానంద్ వంటి వారు కూడా కామెడీ బాట పట్టారు గనక ఇక అంతా హాస్యమయమే . ఇట్స్ కన్ఫర్మ్.
ఇంతకూ ఈ సీనియర్లు సూపర్ సీనియర్లు ఎందుకు పున: ప్రవేశం చేస్తున్నారంటే దానికీ ఓ లెక్కుంది. అదేంటే రేపు చూద్దాం.
