తెలుగు రాష్ట్రాల్లో ఏకపక్ష దశకు స్వస్తి!

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సమర్థులు గనక ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఉద్యమాలు నడిపినా పెద్ద ప్రభావం వుండదని కొత్తలో చాలామంది అనేవారు. అందులోనూ తెలంగాణలో కెసిఆర్ ఉద్యమ సారథి గనక, ప్రతిపక్ష సభ్యులను చాలామందిని చేర్చుకున్నారు గనక ఇక ఎదురు వుండబోదనే మాట వినిపించేంది. ఓటుకు నోటు తర్వాత చంద్రబాబు నాయుడు హఠాత్తుగా హైదరాబాదునుంచి దాదాపు మకాం ఎత్తివేయడంతో కెసిఆర్‌కు ఎదురువుండదనే ప్రచారం జరిగింది. వరసు ఎన్నికలు ప్రతిపక్షాలు దారుణంగా దెబ్బతినడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి. అయితే రాజకీయాల్లో అందులోనూ 24/7 సమాచార యుగంలో ఎవరి స్థానం స్థిరంగా వుంటుందని చెప్పడానికి లేదు. ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలు పూర్తిగా తమతోనే వున్నారని ఎప్పటికీ వుంటారని లెక్కలు వేసుకుంటే అంతకన్నా పొరబాటు వుండదు. దినదినం క్షణక్షణం మారే పరిణామాలు ప్రజలను ప్రభావితం చేస్తుంటాయి. వారు కూడా చాలా వేగంగా స్పందిస్తుంటారు. విభజనకు ముందువరకూ తెలంగాణలో ఉద్రిక్తత వేడి చాలా ఎక్కువగా వుండేవి. అప్పుడు ఆంధ్ర రాయలసీమ నాయకులు తమ వాదనలు కోర్కెలు సరిగ్గా వినిపించలేదని కూడా విమర్శలు వస్తుంటాయి. అయితే విభజన సమయంలోనే ఇవన్నీ ఒక రూపం తీసుకుని ఎపికి ప్రత్యేక హౌదా వాగ్దానం లభించింది. రెండేళ్లుగా అది వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుసాధించుకొస్తాడని ఆశిస్తున్న ప్రజలకు ఈ వారం రోజుల పరిణామాలు మల్లగుల్లాలు కళ్లు తెరిపించాయి. ఒక్కసారిగా రాజకీయాలు రాష్ట్ర పరిస్థితి వేడెక్కిపోయింది. మంగళవారం బంద్ అందుకో ఉదాహరణ మాత్రమే. చిరునామా గల్లంతైందనుకున్న కాంగ్రెస్ రంగంలో ప్రత్యక్షం కాగా పాలకపక్షం టిడిపి ఇరకాటంలో పడిపోయింది. ముందునుంచి పోరాడుతున్న వామపక్షాలు ప్రజా సంఘాలు విమర్శల పదును కదలిక పెంచగా వైసీపీ కూడా మరింత సూటిగా ముందుకు రావలసి వచ్చింది. ఇలా మొత్తానికి విభజన ముందరి కోర్కె సాధించుకోవడానికి ఎపి సమాయత్తం కావడం ఒక కీలక రాజకీయ మలుపు.ఎవరి బలం ఎంత అనేది ఒకటైతే ఘర్షణలు విమర్శలు పెరగడం తథ్యం. ప్రభుత్వం ఆత్మరక్షణ స్తితిలో పడటం నిజం. ప్రభుత్వం గజిబిజిలో పదిపోగా ప్రతిపక్షాలు క్రియాశీలం కావడం కనిపిస్తున్న దృశ్యం. నిజానికి ఈ వారంలో వివిధ ప్రాంతాల నుంచి నాకు వచ్చే ప్రేక్షకుల ఫోన్లు చాలా పెరిగాయి. పైగా వారు ఏవో చెప్పాలని ఆశపడుతున్నారు కూడా. స్తబ్తత వదలి సమరశీలత రావడం ఎపికి మంచి పరిణామమే. తెలంగాణలో కూడా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్రతిహత పాలనకు అనేక అపశ్రుతులు సంభవించాయి. మల్లన్నసాగర్‌తో మొదలై అనేక ప్రతికూల పరిణామాలు సర్కారుకు సవాలుగా మారిన మాట నిజం. తర్వాత వరుసగా కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వచ్చి సమర్థించుకోవలసిన స్థితిలో పడిపోయింది.వీటినుంచి తగు పాఠాలు నేర్చుకుని ప్రభుత్వాలు పొరబాట్లు సరిదిద్దుకంటే ఫర్వాలేదు.లేకుంటే అసంతృప్తి మరింత పెరుగడం అనివార్యమే. ఇంకెప్పుడూ రెండు రాష్ట్రాల రాజకీయాలు ఏకపక్షంగా వుండబోవు.