నేతాజీపై వూహాగానాలు ఆపేరా?

నేతాజీపై వూహాగానాలు ఆపేరా?
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతికి సంబంధించి కొంతమంది పనిగట్టుకుని వ్యాపింపచేస్తున్న వదంతుల నిజస్వరూపమేమిటో ఇప్పుడు ఆయన ఫైళ్లపై పనిచేస్తున్న ఒక బ్రిటిష్ వెబ్‌సైట్ వెల్లడించింది. 1945 ఆగష్టు18న తైపేలో జరిగిన విమానప్రమాదంలో నేతాజీ మరణించాడనడానికి ఆధారాలు లేవనే వాదన నిజం కాదని ఈ తాజాసమాచారంతో తేలిపోతున్నది. విమానం వియత్నాంలోని ఒక స్థావరం నుంచి బయిలుదేరిన కొద్దిసేపటికే రన్‌వేనుంచి వందమీటర్ల దూరంలో ప్రమాదానికి గురి కావడం మంటలు రేగడం చూశామని అప్పటి ఇంజనీర్, జపాన్ సైనికాధికారులు సాక్ష్యాలు ఇచ్చారు. నేతాజీ విమానం పెట్రోలు ట్యాంకరుకు దగ్గరగా కూచుని వున్నందువల్ల త్వరగా ఆయన దేహంకాలిపోయిందని వారు అభిప్రాయపడ్డారు. ఆయన వళ్లు కాలిపోతుంటే సహాయకులు కోటు తొలగించడం తాను చూశానని షిరో నొనోగోకి అనే కమాండర్ చెప్పారు. ఇలాగే కోనో, నకుమారలతో పాటు ఐఎన్‌ఎ కర్నల్ రహమాన్ కూడా తమ తమ సాక్ష్యాలు నమోదు చేశారు. అయితే ప్రమాదం జరిగిన 11 ఏళ్ల తర్వాత వారు చెప్పిన విషయాలలో కొన్ని తేడాలు వున్నా అది సహజమేనని కూడా నిపుణులు భావించారు. చివరి క్షణం వరకూ తాను దేశం కోసం పోరాడానని భారతీయులకు చెప్పవలసిందిగా ఆయన హిందీలో చివరి మాటలు చెప్పినట్టు కూడా వారు ధృవీకరించారు. ఒకటికి రెండుకమీషన్లు విచారణ జరిపిన తర్వాతనే ఆయన మరణించారని నిర్ధారణకు వచ్చారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తన ఆహ్వానంపై విందుకు వచ్చిన నేతాజీ కుటుంబసభ్యులకు ఆయనకు సంబంధించిన ఫైళ్లు తొలివిడతగా అందజేశారు. 1991-1995 మధ్య భారత రష్యాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు అందులో వున్నాయి. ఆయన రష్యాకు రాలేదని ఆ దేశం తరపున రాసిన సమాచారం వుంది. చైనా కూడా ఈ మేరకు గతంలోనే వివరణ ఇచ్చింది. నేతాజీ మరణించలేదనే కథనం ఒకటైతే ఆయన చైనా రష్యాలలో చంపివేయబడినట్టు కమ్యూనిస్టు వ్యతిరేకులైన వారు వ్యాపింపచేసినవి కట్టుకథలేనని కూడా ఈ ఫైళ్లు తేల్చివేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు గతంలో చెప్పుకున్నాము గనక లోతుల్లోకి వెళ్లనవసరం లేదు. నేతాజీ మృతిని సృతిని అగౌరవ పరిచే ఈ నిరాధార చర్చకు తెరదింపితే మంచిది. అయితే ఆయన కుటుంబ సభ్యులపై నిఘా వేయడం నిస్పందేహంగా ఖండనార్హమే. భవిష్యత్తులో మరెవరిపైనా అలాటి నిఘాలు జరక్కుండా కట్టుదిట్టాలు తీసుకోవాల్సిందే. మరోవైపున తాము రాజకీయ కారణాలతో ప్రారంభించిన ఈ చర్చపై అధికారికంగా వివరణ ఇచ్చిముగించాల్సింది కూడా ప్రభుత్వమే. కాని పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు రానున్న దృష్ట్యా రాజకీయ పార్టీలు నేతాజీ చర్చ అప్పుడప్పుడే ఆపకపోవచ్చు.