మోడీ స్వరాష్ట్రంలోనే ప్రతికూలత- ఆనందిబెన్‌కు స్వస్తి

MODI-ANANDIBEN_2721222g

గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ రాజీనామాకు 75 ఏళ్ల వయోపరిమితి సాకు మాత్రమేనని అందరికీ తెలుసు. దేశాన్ని ఏలేందుకుకి మోడీకి అవకాశమిచ్చిన స్వంత గడ్డ గుజరాత్‌లోనే రాజకీయ పరిస్తితులు బిజెపికి అడ్డం తిరగడం ఒక వాస్తవం. ఇటీవలి కాలంలో 14శాతంగా వున్న పటేళ్ల ఆందోళన అట్టుడికించింది. ఆ తర్వాత ఉన్‌ ప్రాంతంలో దళితులపై గోరక్షణ ముసుగులో దారుణ దౌర్జన్యానికి పాల్పడిన ఘటన మరింత తీవ్ర నిరసన ప్రజ్వలింపచేసింది. 2015 స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో బిజెపి ఓటింగు 50 శాతం నుంచి 43.97శాతాని పడిపోయింది. చాలా ప్రాంతాలు కాంగ్రెస్‌ గెలవగలిగింది. ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ కుమారుడు శ్వేతాంక్‌, కుమార్తె అనర్‌లపై ఆరోపణలు దుమారం రేపితే ప్రధాని మోడీ స్వయంగా పిలిపించి మందలించారు. సీనియర్‌ నాయకుడు ఓమ్‌జీ మాథుర్‌కు పరిస్థితిని పరిశీలించి నివేదిక రూపొందించే బాధ్యత అప్పగించారు. ఆనంది నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో గెలవలేమని మాథుర్‌ నివేదికనిచ్చారు. అంతేగాక పార్టీ అద్యక్షుడు అమిత్‌షాతో ఆనందికి సత్సంబంధాలు లేకపోవడం, ఆయన రూపాని అనే మంత్రిపట్ల ఆసక్తి చూపడం పరిస్థితిని మరింత జటిలంచేసింది. ఇన్ని కారణాల నేపథ్యంలో ఆమె 75 ఏళ్ల సంప్రదాయాన్ని కారణంగా చూపుతూ రాజీనామా చేస్తానని అధిష్టానానికి ప్రతిపాదించారు.దీన్ని పార్లమెంటరీ బోర్డు ముందుంచుతానని అమిత్‌షా చెప్పారు. తర్వాత గవర్నర్‌ ఓం ప్రకాశ్‌ కోలికి రాజీనామా పత్రం సమర్పించారు. మంత్రి నితిన్‌ పటేల్‌ ఈ పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నట్టుచెబుతున్నారు. ఒక విధంగా ముఠా తగాదాలకు కూడా ఇది దారితీయొచ్చు. ఏమైనా యుపిలో ఎలాగైనా మొన్నటి లోక్‌సభ ఫలితాలు నిలబెట్టుకోవాలని బిజెపి పెనుగులాడుతుంటే మోడీ స్వంత రాష్ట్రంలోనే ప్రతికూలత ఎదురుకావడం ముఖ్యమంత్రిని తామే తప్పించవలసి రావడం తీవ్ర పరిణామమే. దీని ప్రభావం ఇతర చోట్ల ఎలా వుంటుందోనని బిజెపి ఆరెస్సెస్‌లు మదింపు వేస్తున్నాయి. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం అన్వేషణ త్వరలోనేముగియవచ్చు. గాని రాజకీయంగా ఈ స్వల్ప కాలంలో నిలదొక్కుకోవడం అనే ప్రశ్న మాత్రం వుండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *