‘మహా’ రచయిత్రికి జోహార్లు
మహా శ్వేతాదేవి మన కాలపు మహోన్నత రచయిత్రి. అట్టడుగు వర్గాల అందులోనూ ఆదివాసుల వాస్తవ స్థితిగతులను కళ్లకు కట్టిన కలం ఆమెది. రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్‌బాబు వంటి బెంగాలీ రచయితలు ఆర్కె నారాయణ్ వంటి భారతీయాంగ్ల రచయితలు దేశమంతటికీ తెలుసు. కానీ వారి రచనల్లో ప్రధానంగా మధ్యతరగతి, బుద్ధిజీవులు,ఉన్నతవర్గాలు కనిపిస్తే మహాశ్వేతా అంతకంతకు సమాజపు అట్టడుగు పొరల్లోకి చూపు సారించారు. మౌలికంగా మార్క్సిజం,కమ్యూనిస్టు ఉద్యమం ఆమెకు తొలి ప్రేరణ ఇచ్చాయి. తండ్రి మానిష్ ఘటక్ కవి, బాబాయి ప్రసిద్ధ దర్శకుడు రుత్విక్ ఘటక్ కూడా ప్రజా నాట్యమండలి (ఇప్టా)తో సన్నిహిత సంబంధం కలిగినవారే. భర్త బిజువన్ భట్టాచార్య నాటక రచయిత కాక ఇప్టా కార్యకర్త. ఇలాంటి వాతావరణంలో మహాశ్వేతా మలచబడడంలో ఆశ్చర్యం లేదు. ఆదివాసుల మౌఖిక కథనాలకు నమ్మకాలకు కూడా నవలా రూపం ఇవ్వడం ఆమెకే చెల్లింది. ఎవరిదీ అడవి, బషాయితుడు, రాకాసికోర వంటి ఆమె నవలలు తెలుగులోనూ హెచ్‌బిటి ప్రచురించింది. శరత్ తర్వాత తెలుగు ప్రజలకు సుపరిచతమైన బెంగాలీ రచయిత్రి ఆమే. ఆ నవలల్లోని దుర్భర వాస్తవికత, భయానక పీడన మామూలు ఊహలకు అందని స్థాయిలో ఉంటాయి. ఈ రచనల కోసం మహాశ్వేతా నాగరిక బెంగాలీ భాషను అడవిబిడ్డల మాటలను మేలావించి ఒక ప్రత్యేక శైలీని సృష్టించారని చెప్పాలి. గిరిజనుల్లో తమ వీరుల గురించి పాతుకుపోయిన నమ్మకాలు లాంటివి కూడా ఆమె కథనంలో ఇమిడిపోయాయి. స్వయంగా రచయిత అయిన తన కుమారుడు నౌరన్ భట్టాచార్యతో విభేదాలు పరిష్కారం కాకుండానే అతను మరణించటం ఆమెకు తీరని బాధ మిగిల్చిందని చెబుతారు. ఆమె కథలు సినిమాలుగా కూడా వచ్చాయి. అనేక పురస్కారాలు జ్ఞానపీఠం కూడా లభించాయి.
మహాశ్వేతా దేవి పశ్చిమబెంగాల్ వామపక్ష ప్రభుత్వం భూ సంస్కరణలను మనస్ఫూర్తిగా హర్షించారు. అయితే అవి ప్రభుత్వ విధానాల వల్ల కాక అప్పటి సీనియర్ మంత్రి వినరు చౌదరి కృషి వల్ల జరిగాయని భావించేవారు. బెంగాల్లో భూమి, రెవెన్యూ శాఖ అద్భుతంగా పనిచేసిందని అప్పట్లో ఆమె మెచ్చుకున్నారు. నందిగ్రాం, సింగూరు ఘటనల తర్వాత వామపక్ష ప్రభుత్వంతో విభేదించారు. పరిశ్రమలు రావాలి కానీ అందుకు బీడు భూమిని ఉపయోగించాలని సూచించే వారు. మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తను చెప్పేది ఆలకిస్తాడని కూడా ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తామంతా సిపిఐ(ఎం) ప్రభుత్వాన్ని ఆహ్వానించామని తర్వాత కాలంలో నిరాశకు గురయ్యామని 2011లో ఇచ్చిన ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అప్పటి ఎన్నికల్లో ఆమె మమతా బెనర్జీ ఇచ్చిన పరివర్తన నినాదాన్ని గట్టిగా బలపరుస్తూ వామపక్షాలకు వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొన్నారు. మమతా బెనర్జీ కూడా అనుకున్న ప్రకారం పనిచేయడం లేదని ప్రశ్నించినప్పుడు అంతా ఒక్క రాత్రిలో జరిగిపోదని వ్యాఖ్యానించే వారు. చివరి దశలో మరింత తీవ్రంగానే విమర్శనా స్వరం వినిపించారు. దళితులు, నిరుపేదలు, వలస కార్మికులు, వ్యభిచార వృత్తిలోని మహిళలు,యువత వంటి వారి హక్కుల కోసం నిలబడడం ఆమెకు గొప్ప స్థానం కల్పించింది. తాను ప్రజల కోసమే రాస్తానని ఆమె ప్రకటించుకున్నారు. అనారోగ్యంతో వెంటిలేటర్‌పై పోరాడుతూ చిట్టచివరకు కోల్‌కత్తాలో కన్నుమూశారు. పార్లమెంట్ ఉభయసభల వాయిదాతో సహా దేశంలోని అనేక ప్రభుత్వాలు, పార్టీల నేతలు, సాహిత్యాభిమానులు ఆమెకు అక్షర నివాళులు అర్పించడం సముచితంగా ఉంది.
