రాజధాని లీజుల్లో వందకోట్లు ‘గ్రీజు’
పారదర్శకత లేకపోవడంతో రాజధాని అమరావతి పరిసరాల్లో కార్యాలయాల కోసం అద్దె భవనాల ఏర్పాటు మరో ప్రహసనంగా మారుతున్నది. ఈ తతంగంలో వంద కోట్ల రూపాయలు అద్దెలకే అర్పించాల్సి వస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. అద్దె అవసరం లేకుండా అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నా ప్రయివేటు బిల్డర్ల జేబులు నింపేందుకు అడుగులు పడుతున్నాయా? సర్కారీ భవనాల లభ్యతపై అధికారులు సమర్పించిన ప్రతిపాదనలు బుట్టదాఖలు అయ్యాయా? ఈ ప్రశ్నలు అనివార్యంగా ముందుకు వస్తున్నాయి. అసలు నాగార్జున యూనివర్శిటీలోనే విస్తారమైన స్థలం అందుబాటులో ఉందనేది అందరికీ తెలిసిన విషయం.
ఇందుకు సంబంధించిన వివరమైన పతాక శీర్షిక సోమవారం ప్రజాశక్తి ప్రచురించింది. ఆ కథనం ప్రకారం అమరావతి ప్రాంతానికి కార్యాలయ తరలింపుపై ఏర్పాటైన ఉన్నత స్థాయి అధికారుల కమిటీ సుమారు 50-55 లక్షల చదరపు అడుగుల స్పేస్ కావాలని అంచనా వేసింది. సచివాలయం, 33 ప్రభుత్వ విభాగాలు, 70 డైరెక్టరేట్లు, కమిషరేట్లు (హెచ్‌వోడి), ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్ల హెడ్‌క్వార్టర్స్‌ను ఏర్పాటు చేయాలి. కాగా గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో సెక్రటేరియట్ విభాగాలకు నాలుగు లక్షల చదరపు అడుగుల స్పేస్ అందుబాటులోకొస్తుందని తేల్చారు. హెచ్‌వోడిలు, ఇతర ఆఫీసుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సర్కారీ భవనాల్లో ఆరు లక్షల చదరపు అడుగుల స్పేస్ అందుబాటులో ఉందని కలెక్టర్లు ఇచ్చిన సమాచారానికి అనుగుణంగా నిర్ధారించారు. ఇంకా నికరంగా 40 లక్షల చదరపు అడుగుల స్పేస్ కావాలని అంచనా వేశారు. తొలుత వెలగపూడిలోనే హెచ్ఓడిల కోసం అదనపు అంతస్థులు నిర్మిస్తామన్న సర్కారు చివరి నిమిషంలో మాట మార్చి ప్రయివేటు భవనాలు అద్దెకు తీసుకొనైనా ఈనెల27లోపు అమరావతికి వచ్చి తీరాలని ఆదేశించిన దరిమిల మధ్య దళారులు ధనాశపరులూ రంగ ప్రవేశం చేశారు.
ఇచ్చిన నిబంధనల ప్రకారం ఒకేచోట కనీసం 20 వేల చదరపు అడుగులకు తక్కువ కాకుండా లీజుకు తీసుకోవాలి. లీజు సమయం మూడేళ్లు ఉండాలి. చదరపు అడుగుకు రూ.20లోపు అయితే హెచ్ఓడిలు నేరుగా తమ విచక్షణతో లీజుకు ఓకే చేసుకోవచ్చు. రూ.20-30 అయితే రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ ఓకే చేయాలి. రూ. 30 పైన అసలు చెల్లించకూడదు. అయితే ఉన్నఫళాన 40లక్షల చదరపు అడుగుల స్పేస్ చూసుకోవాలని ఆదేశాలు రావడంతో కృత్రిమమైన కొరత ఏర్పడింది. ఆ ప్రాంతంలో చదరపు అడుగు రూ.10-15 ఉన్నా రూ.29 వరకు తీసుకెళ్తున్నారని ఆరోపణల సారాంశం. సగటున ఒక చదరపు అడుగుకు నెలకు అద్దె రూ.25 వరకు నిర్ణయిస్తారని అధికారులే చెబుతున్నారట.
ఉద్యోగుల తరలింపు కార్యాలయాల ఏర్పాటు ఒక సమస్యగా నడుస్తుంటే మరోవైపున ఈ భారీ ఆర్థిక భారం ఇంకో బెడదగా మారుతున్నది. అసలు భారీ వర్షాలు పడితే తాత్కాలిక సచివాలయ నిర్మాణం కూడా ప్రభావితం అవుతుందనే ఆందోళనలు కూడా లేకపోలేదు. అక్కడ బురద పెరిగితే ఏమవుతుందని సందేహాలు వుంటే అధికారులు మాత్రం ఇసుక నేల గనక ఆ ప్రమాదం లేదంటున్నారు. ఈ అంచనా కూడా ఆచరణలో చూడవలసిందే. చాలా స్పష్టత వుందనుకుంటూనే అస్పష్టతలో వుండి హడావుడి పెంచిన ఫలితాలే ఇవన్నీ
