స్త్రీలను గౌరవించడం… ??
స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. ఆర్టిసి బస్సులో ఈ మాటలు చదవని అక్షరాస్యులెవరూ వుండరు.ఇంతకూ మన సంప్రదాయం స్త్రీలను గౌరవించేదేనా? ఈ ప్రశ్నకు జవాబు తెలియాలంటే ఎంతో దూరం వెళ్లనక్కర లేదు. మొదట చెప్పుకున్న వాక్యం తర్వాతి మాటలు చూస్తే చాలు- వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం! అని వుంటుంది. అంటే సీట్లలో కొన్ని మాత్రమే వారికి కేటాయించి వాటిలో వారిని కూచోనివ్వడం పెద్ద గౌరవించడమైనట్టు సంప్రదాయం అయినట్టు చెప్పుకోవడమన్నమాట. అక్కడికీ ప్రతి బస్సులోనూ ఆ సీట్లలో కూచోవడం గురించి తరచూ వివాదాలు నడుస్తూనే వుంటాయి. కొన్నిసార్లు కండక్టర్లు జోక్యం చేసుకుని లేపేస్తుంటారు. కాగా వెనక వున్న పురుష పుంగవులు ఇలా అన్నిట్లో పోటీ పడగలరా అని తమలో తాము మాట్లాడుకుని అపహాస్యం చేస్తుంటారు. బస్సు సీట్లకే ఇంత గొడవైతే చట్టసభల్లో సీట్ల సంగతి చెప్పేదేముంది?కనకనే దాదాపు వందకు పైగా రాజ్యాంగ సవరణలు అలవోకగా జరిగి పోయిన ఈ దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రం పదే పదే వెనక్కుపోతుంటుంది. ఈ బిల్లును నిరాకరించడంలో పురుషాధిక్య సమాజ పోకడలు స్పష్టమవుతాయి. ఇప్పటి వరకూ వచ్చిన అన్ని వర్గ సమాజాల్లోనూ మహిళలు వివక్షకే గురవుతున్నారు. అసలు స్త్రీనే మానవుడికి మొదటి బానిస అని ఎంగెల్సు అంటాడు. ఆ బానిసత్వం నుంచి ఆమె బయిట పడటం ఇప్పటికీ పూర్తి కాలేదు. రూపం మారినా సారంలో వివక్షతా పోలేదు. సమానత్వం సాధికారత ఇంకా ఎండమావులుగానే వున్నాయి.మహిళలు అభ్యున్నతి సాధించిన మేరకైనా వారి పోరాటాల వల్లనూ వారి విముక్తికి తోడ్పడే శక్తుల వల్లనూ సాధ్యమైంది తప్ప ఆధిపత్య వర్గాలెప్పుడూ ఐచ్చికంగా అందుకు సహకరించలేదు.
వాస్తవికత తెలియని వారు చాలా మంది ఇంకా మహిళల వెనకంజ,అసమానత వంటి మాటలకు విలువేమిటని ప్రశ్నిస్తుంటారు. ఇలా మాట్లాడ్డం ప్యాషన్ అని ఈసడిస్తుంటారు. కొంతమంది మహిళల విముక్తి అన్న భావనను సరైన అర్థంలో కాక పాక్షిక కోణంలో చిత్రించి గందరగోళ పడుతుంటారు. అలంకార ప్రాయమైన సమానత్వానికి అర్థ వంతమైనా ఆత్మ గౌరవంతో కూడిన సాధికారికతకూ తేడాను చూడలేకపోతుంటారు. అలాగే మహిళల విముక్తి కోసం నిజంగా పోరాడుతున్న వారెవరో తెలుసుకోలేక తికమక పడుతుంటారు.మొదట చెప్పుకున్నట్టు సంసృతి సంప్రదాయాల పేరుతో స్త్రీలను పరోక్షంగా తొక్కిపట్టే సనాతనత్వం చాలా మందిలో గూడుకట్టుకుని వుంటుంది. పైపై ప్రగతి శీలులు కొందరు స్త్రీల విషయంలో మిగిలిన వారికంటే దారుణంగా వ్యవహరిస్తుంటారు. కనక మహిళల పట్ల సమానతా భావన అన్నది కనీస ప్రజాస్వామిక మానవీయ లక్షణం అని గుర్తించగలిగితే ఇన్ని మల్లగుల్లాలకు ఆస్కారం వుండదు.
స్త్రీల విషయంలో విశాలంగా ఆలోచించగలిగిన వారికి సంకుచిత ధోరణులు ఎంత తీవ్రంగా వుంటాయో తెలియదు. అలాగే సంకుచిత వాతావరణంలో తాము చాలా విశాలంగా వుంటున్నామని గొప్పలుపోయే పురుషులకూ లోటుండదు. ఇక నిజంగా ఛాందసులు సంకుచితులైన వారికి స్త్రీల పట్ల సమాన ధర్మం పాటించాలన్న సృహే వుండదు. ఆ మాట అనడమే అపరాధంగా కనిపిస్తుంది. అట్టడుగు వర్గాల్లో మహిళలు పురుషులతో సమానంగా చాకిరీ చేయడమే గాక ఇంటి పని కూడా చేసి ఆ పైన తన్నులు తిట్లతో నెట్టుకొస్తుంటారు. పై తరగతిలో మహిళలు అలంకారప్రాయమైన స్వేచ్చ వున్నా అంతిమంగా పురుషాధిక్యత పంజరంలో చిక్కుకునే వుంటారు. ఇక మధ్యతరగతి మహిళలు అటూ ఇటూ గాక అల్లాడుతుంటారు. కేవలం పురుషులే గాక ఆ పురుషాధిక్యతనూ తత్ఫలితమైన అభద్రతనూ వంటపట్టించుకున్న మహిళలు కూడా అనేక సందర్బాల్లో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. దాన్ని సాకుగా చూపి స్త్రీలకు స్త్రీలే శత్రువులు వంటి వక్ర సిద్ధాంతాలు తీసుకొస్తుంటారు. పురుషాధిక్య సమాజం సృష్టించిన ఈ ‘శత్రుత్వం ఇద్దరు రాజుల తరఫున పోరాడే రెండు సైన్యాల మధ్య వుండేలాటిదే తప్ప స్వతస్సిద్ధమైనది కాదు.
సామాజిక సంసారిక బాధ్యతలు రెంటినీ నిర్వహించే సవ్యసాచుల వంటి స్త్రీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోవడం కేవలం అసమానతల ఫలితమే. మాతృస్వామికం నుంచి పితృస్వామికానికి జరిగిన పరివర్తన మన సమాజీకుల నరనరాల్లో ఇంకి పోయింది ఇక .ఈ ప్రపంచీకరణ యుగంలో మదర్ ఇండియాను మిస్ ఇండియాగా మార్చివేసిన తర్వాత ఇది ఇంకా వికృతరూపం దాల్చింది. అందుకనే మహిళా ఉద్యమం ముందున్న సవాళ్లు గతంలో క న్నా ఇప్పుడు ఇంకా క్లిష్టంగా కష్టంగా గోచరిస్తాయి. మహిళల్లో కొద్ది భాగం విద్యా విజ్ఞానాలు హౌదా పెంచుకోవడం ఒకవైపు అసంఖ్యాకమైన అభాగ్యురాళ్లు అంధకారంలో అలమటించడం మరో వైపు పరస్పర విరుద్ద దృశ్యాలుగా అగుపిస్తున్నాయి. ఐపిఎల్- బిపిఎల్ భారత దేశాల మధ్య తేడాను సూటిగా చెప్పాలంటే బిపిఎల్ భారతంలో పూర్ గర్ల్స్- బిపిఎల్ భారతంలో చీర్గర్ల్స్ కూడా అమ్మాయిలే కావడం ఒక వైపరీత్యం. రెండు చోట్ల వారి ఆత్మ గౌరవాలకు విలువ లేదు.ఇదే నేటి పరిస్తితుల్లో ఒక ప్రధాన వైరుధ్యం.
ఇప్పుడున్న ప్రపంచీకరణ సంసృతి విత్త వినిమయ విలాస సంసృతి అనే మాట తరచూ చెప్పుకునేది. వీటన్నిటితో పాటు ఇది సెక్సిస్టు సంస్కతి కూడా. ఇది మౌలికంగా స్త్రీలకు వ్యతిరేకమైన లక్షణం. వస్తువుల పట్ల వ్యామోహం పెంచడం ఒకటైతే వస్తువులకూ స్త్రీలకూ తేడా లేనట్టు చూపించడం మరొకటి. ఆ వస్తువులను పొందాలన్న కోర్కె రగిలించే వ్యాపార ప్రకటనలు వాటికి ప్రతీకలుగా ప్రచారానికి వాడుతున్న స్త్రీలను కూడా వస్తువుల కన్నా హీనంగా చిత్రించడం దారుణ సత్యం. ఈ ప్రకటనల్లో స్త్రీలను కేవలం పరాధీనలుగా లేక పరమ దాహులుగా చూపించడం వారి వ్యక్తిత్వాలపైనే దాడి.నల్లగా వుండటం, జుట్టు తెల్లబడటం, ప్రసవం తర్వాత ముడుతలు రావడం ఇవన్నీ పెద్ద లోపాలైనట్టు వాటితో జీవితమే వ్యర్థమైనట్టు చెప్పడం వల్ల సమాజంలో విలువలనే తారుమారు చేయడం జరుగుతుంది. బాహ్య సౌందర్యం కన్నా అంతస్సౌందర్యం ముఖ్యమనే సూత్రం కనుమరుగవుతుంది.అందం గురించి చెప్పే ఈ మాటలన్ని అంతిమంగా స్త్రీలపై ఎక్కుపెట్టినవే. ఒక వేళ కండల పురుషులు ఎవరైనా వున్నారనుకుంటే అక్కడా స్త్రీలనే అవమానకరంగా ఎగబడిపోతున్నట్టు చూపిస్తుంటారు. రెండు మాసాల పిల్లలపైన కూడా ప్రభావం చూపించే ఇలాటి ప్రకటనలు నిరంతరం గుప్పిస్తూ స్త్రీ గౌరవం గురించి ఎంత చెప్పినా ఫలితమేముంటుంది?
ప్రపంచీకరణకు మార్కెటింగు, మత ఛాందసం రెండు పార్శ్యాల వంటివి. వ్యాపార ప్రపంచం ఇలా వుంటే సనాతన వాదులు స్త్రీలను కొత్త కొత్త ఆంక్షలకు గురి చేస్తున్నారు. కాలం చెల్లిన సంప్రదాయాలు ఫ్యాషనబుల్ రూపంలో చలామణిలోకి తెస్తున్నారు. టీవీ సీరియళ్లలో ఖరీదైన ఆడ విలన్లలాగే అధునాతనంగా కనిపిస్తూ రోత పుట్టే మూఢత్వాలను మహిళలతో చెప్పిస్తున్నారు. బోధింపచేస్తున్నారు. మొదటే చెప్పుకున్నట్టు మన సంప్రదాయంలో మహిళల శక్తి సంపత్తులు వ్యక్తమైన సందర్భాలను చెప్పడం కంటే కట్టు బొట్టు హారతులు పూజలు ప్రదక్షిణలు ఇవే మహిళలకు ముఖ్యమన్న భ్రమ కలిగిస్తున్నారు. విద్యాధిక వనితలను చూసి ఇతరులు కూడా ఆ వలయంలో చిక్కుకుంటున్నారు.
సమాజంలో వివిధ తరగతులకు చెందిన సామాన్య ప్రజానీకానికి సవాలక్ష సమస్యలున్నాయి. మహిళల విషయంలోనూ అవన్నీ వుంటాయి. కాని మహిళలుగా వారికి అసమానతల నుంచి అత్యాచారాల వరకూభ్రూణ హత్యల నుంచి సజీవ దహనాల వరకూ అసంఖ్యాకమైన సమస్యలు అనేకానేక ఘోరాలు వెన్నాడుతుంటాయి. వేటాడుతుంటాయి. వీటిని పరిష్కరించడం సంగతి అటుంచి అర్థం అయ్యేలా చేయడానికే బోలెడు పెనుగులాట.ఈ లోగా అనేక కష్టనష్టాలు, బలిహౌమాలు జరిగిపోతూనే వుంటాయి. ఉదాహరణకు అత్తింటి సమస్యల గురించి పుట్టింటి వారు, బయిట సమస్యల గురించి ఇంటి వారు తెలుసుకోవడానికే చాలా కాలం.. ఆ తర్వాత కూడా నింద ఎవరిపైన పడుతుందో తెలియని స్థితి. ప్రతిదానికి తేలిగ్గా మహిళలనే వేలెత్తి చూపించే సమాజ పోకడ. కాస్త చొరవ స్వతంత్రం కనపర్చినా సహించలేని ఆంక్షలు..వీటన్నిటి మధ్యనా సహ జీవనమే ప్రశ్నార్థకమై పోతుంటే సమ జీవనం గురించి వూహించడం దుర్లభమై పోతుంది.వీటి గురించి విచారించేందుకు కూడా వ్యవధి లేనంతగా బాధ్యతల భారం.. ఏది ఎలా పోయినా తప్పని పిల్లల బాధ్యత. శక్తి సామర్థ్యాలతో( అనేక సందర్భాల్లో హౌదాలతో కూడా) నిమిత్తం లేకుండా స్త్రీలు కేవలం సహాయకులు మాత్రమేనని భావించే పురుషాహంకార భావనలు నిరంతరం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఈ బరువు బాధ్యతలు తోడై మహిళల పురోగమన వేగం మందగిస్తుంది. అనేక సార్లు తిరోగమనమూ సంభవిస్తుంది. చదువుకునే రోజుల్లో లేదా చిన్న తనంలో పరుగులు తీసిన వారు కూడా కొద్ది కాలంలోనే మారిపోవడం సర్వ సాధారణం. ఇవన్నీ ఖాతరు చేయకుండా దూసుకుని పని చేసుకుని పోయేవారు అలాగే ముందుకు పోతుంటారు గాని ఎక్కువ మందికి ఈ సమస్యలు తప్పడం లేదు.
ఏ దశలోనూ స్త్రీ స్వాతంత్రానికి అర్హురాలు కాదు అని మనువు చెప్పింది ఇప్పుడు మక్కీకి మక్కిగా అమలు కాకున్నా – కుటుంబ జీవితంలో ఏ హౌదాలో వున్నా స్ల్రీలకు సమానత సాధికారత నాస్తి. సమాజంలోనూ సంఘాలలోనూ కూడా స్త్రీలను అనివార్యమైన ప్రాతినిధ్య దృష్టితో తప్ప ఐచ్చికంగా చైతన్య పూర్వకంగా ప్రోత్సహించడం ఇప్పటికీ తక్కువగానే వుంది. స్త్రీ ఒకరు వుండాలనుకోవడం వేరు, స్త్రీలు కూడా శక్తివంతులు గనక వారికి సముచిత స్తానం వుండటం సహజంగా జరగాలనుకోవడం వేరు. ఈ విషయంలో చైతన్యంలో చాలా మార్పు రావలసివుంది. అయితే ఆ మార్పు మహిళల పోరాటం కృషి లేకుండా వచ్చేది కాదు. అవరోధాలు ఎక్కువగా వున్నప్పుడే మరింత పట్టుదలగా పోరాడాలన్నది ప్రాథమిక జీవన సూత్రం.ఒక వైపున ప్రపంచీకరణలో మార్కెటింగ్ విష సంసృతి మరోవైపున మతతత్వ తిరోగతి మధ్య చైతన్య మహిళా లోకం చేయలసిన పోరాటం తీవ్రంగానే వుంటుంది. కనుకనే ఏ ఆందోళన లేదా ఉద్యమం చూసినా మహిళలే ఎక్కువగా కనిపిస్తుంటారు.ఆ సమరశీలతను సంఘటిత పర్చి సమున్నతంగా తీర్చిదిద్దుకోవడం బృహత్తర కర్తవ్యం.