రోహిత్‌ దళితుడేనని నివేదిక

RohitVemula_2699961f
హెచ్‌సియులో కుల వివక్షకు బలైన రోహిత్‌ వేముల దళితుడేనని అధికారికంగా వెల్లడైంది. . గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దాండే.ే ఈ మేరకు జాతీయ షెడ్యూలు కులాల కమిషన్‌(ఎస్‌సిఎస్‌సి)కు తన నిర్ధారణలు పంపించారు. నిబంధనల ప్రకారం ఈ విషయంలో ప్రామాణికంగా పరిగణించేది జిల్లా కలెక్టర్‌ నివేదికనేరోహిత్‌ వేముల చక్రవర్తి హిందూ మాల అనీ, రాజ్యాంగ ప్రకారం ఇది ఎస్‌సి కులాల జాబితాలో వుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. రోహిత్‌ బామ్మను కూడా తాము విచారించినట్టు ఆయన అందులో తెలిపారు.రోహిత్‌ వేముల విషాదమరణం తర్వాత హెచ్‌సియు ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఎస్‌సిఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం కింద వైస్‌ఛాన్సలర్‌ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలతో సహా పలువురిపై కేసు నమోదైంది. అయితే ఆ తర్వాత దశలో రోహిత్‌ అసలు దళితుడే కాదన్న దుమారం లేవనెత్తారు. కొన్ని మీడియా సంస్థలు మొదలుపెట్టిన ఈ కథనాన్ని పట్టుకుని తెలంగాణ పోలీసులు రోహిత్‌ స్వగ్రామం వెళ్లారు. స్వయానా తల్లి రాధిక తాము దళితులమనీ అలాగే పెరిగామనిచెబుతున్నా పట్టించుకోలేదు. తనను ఒక మహిళ పెంచుతున్నానంటూ చాకిరీ చేయించుకోవడమే గాక ఒక వడ్డెర కిచ్చి పెళ్లి చేసిందని రాధిక వెల్లడించారు. వారిద్దరూ విడాకులు తీసుకున్నాక రోహిత్‌ తల్లిదగ్గరే పెరిగాడు. అయితే తండ్రి మణికుమార్‌ కూడా ఈ చర్చలో జోక్యం చేసుకుని అతని దళిత నేపథ్యాన్ని ప్రశ్నించేవిధంగా మాట్లాడ్డం విమర్శకులకు బలం చేకూర్చింది. అయితే కనిపెంచిన తల్లి కులం రోహిత్‌కు చెందుతుందనేది రాజ్యాంగ రీత్యానూ కోర్టు తీర్పుల రీత్యానూ కాదనలేని సత్యం. బహుశా ఆందోళనను దెబ్బతీయడానికి పెద్దలను కేసు నుంచి తప్పించడానికి రోహిత్‌ శవంపై కుల పంచాయితీ చేశారు రాజకీయ వేత్తలు ఘనత వహించినకొన్ని మీడియా సంస్థలూ! .రోహిత్‌ మెరిట్‌తోనే సీటు సంపాదించుకున్నాడు గాని రిజర్వేషన్‌ కింద కాదనేది కూడా గమనించాల్సిన విషయం.స్థానిక నేతలు చెప్పిన ఈ అవాస్తవాలనే కేంద్ర మంత్రి సృతి ఇరానీ పార్లమెంటు సాక్షిగా వల్లె వేయడం మరింత దారుణం. ఇప్పుడు కలెక్టర్‌ నివేదిక స్పష్టంగా వుంది గనక ఇప్పటికైనా ఈ అమానవీయ చర్చ ముగించడం అవసరం. ఎన్‌సిఎస్‌సి బహుశా ఈ ఆగష్టులో నివేదికను పరిశీలించవచ్చునని కేసు వాదిస్తున్న న్యాయవాది ఎస్‌.గుణరతన్‌ చెబుతున్నారు.
ఈ వివాదంలో విద్యార్థుల ఆందోళనకు స్పందించి ప్రజాస్వామిక పరిష్కారం కనుగొనేబదులు ప్రభుత్వం, విసి తదితరులు కూడా కక్ష సాధింపువైఖరితో వ్యవహరించారు. పైగా ఆందోళన వల్ల చదువులు పాడవుతున్నాయంటూ వారిలో వారికి చీలికలు తెచ్చే ప్రయత్నంచేశారు. ఈ వారంలో కూడా ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్‌ చేయడంలోనూ ఇదే కక్ష ధోరణి కనిపిస్తుంది. ఇందుకు నిరసనగా ఇద్దరు ప్రొఫెసర్లు తమ బాధ్యతలకు రాజీనామా చేశారు.ఈ రోజున విద్యార్థుల టెంట్లు పీకివేసి ఆందోళన విఫలమైందని సంతోషించవచ్చు.కాని సామరస్య పరిష్కారం లేకపోతే వారిలో అసంతృప్తి మిగిలిపోవడం సంస్థకూ సమాజానికి కూడా నష్టదాయకమన్న కనీస ఇంగితం ఏలినవారికి లేకపోవడం బాధాకరం. ఈ సమస్యలో ఎలాటి చొరవ చూపని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా ఆ విసిని వెనక్కు పిలిపించాలని శాసనసభలోనే కోరారు. అయినా ఆయననే పట్టుకుని వేళ్లాడుతూ విద్యార్థులు అధ్యాపకులపై వేటు వేస్తున్నారంటే వారి వెనక ఎంత బలీయమైన శక్తులున్నాయో తెలియడం లేదూ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *