భారతీయ విద్యార్థులపై మరో వేటు!

ఏదో ఒక పేరుతో భారతీయ విద్యార్థులను యువ ఉద్యోగులను వేదించడం అమెరికా అధికారులకు అలవాటుగా మారుతున్నది. సరైన వీసాలు లేవంటూ గతంలో వందలాది మందిని నిలిపివేసి కలకలం సృష్టించారు. ఇప్పుడు విద్యా ప్రమాణాలు సరిగ్గా లేవంటూ భారతీయ విద్యార్థులను ఇంటికి పంపే కార్యక్రమం చేపట్టింది. వెస్ట్ కెంటకీ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ మొదటి సెమిస్టర్ చదువుతున్న 25 మంది భారతీయ విద్యార్థులను వారి విద్యాప్రమాణాలు సరిగ్గా లేవన్న పేరిట స్వదేశం తిరిగివెళ్లవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం దిగ్భ్రాంతి కలిగించింది.ఈ యూనివర్సిటీలో 60 మంది భారత విద్యార్థులు కంప్యూటర్ ప్రోగ్రామ్‌లో చేరగా దాదాపు సగం మందిని ఇంటికి పంపడం వారి కుటుంబాలను కలవరానికి గురి చేస్తున్నది. కంప్యూటర్‌సైన్సెస్ విభాగం అధిపతి జేమ్స్ గేరీ చేసిన ప్రతిపాదనను యూనివర్సిటీ యాజమాన్యం ఆమోదించడంతో వారు లబోదిబోమంటున్నారు. అన్ని పత్రాలు సమర్పించి అనుమతులు పొందిన తర్వాతనే అంతర్జాతీయ ఏజన్సీల ద్వారా అధికారికంగానే వారు అడ్మిషన్లు పొందారు. ఆ సమయంలో యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు నిలిపివేయడంతో ఆర్థిక అవసరాల కోసం అంతర్జాతీయ ప్రచారం పెంచి ఇతర దేశస్తులను చేర్చుకున్నమాట నిజమేనని అధికారులు అంగీకరిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రమాణాల పేరిట వారిని వెళ్లి పొమ్మంటే విద్యాసంవత్సరం, పెట్టుకున్న ఖర్చు మొత్తం వృథా కావడమే గాక చాలా సమస్యల పాలవుతారని భారతీయ విద్యార్థి బృందం నాయకుడు ఆదిత్య శర్మ ఆవేదన వ్యక్తం చేశారు.అయితే వారిలో కొందరి జిపిఎ గ్రేడ్ పాయింట్ ఆవరేజి తక్కువగా వున్న మాట నిజమేనని కూడా అన్నారు.ఇవన్నీ వారిని అంతదూరం అనుమతించడానికి ముందు చూసుకోవలసిన విషయాలు. మరోసెమిస్టర్ నిర్వహించి వారు మెరుగుపడటానికి సహకరించాలి గాని దేశం తిరిగివెళ్లమంటే ఎలా?