చెప్పు(డు) మాటలతో చేటు

ఇప్పటి వరకూ ప్రభుత్వ వైపల్యాలను రాజకీయాస్త్రాలుగా ప్రజా ఉద్యమాలుగా మలుచుకోవడంలో పెద్దగా సఫలం కాలేకపోయిన జగన్ తనే అవతలివారికి ఆయుధాలు అందించడం అనుభవ రాహిత్యమా అతిశయపు అంచనాల పలితమా అర్థం కాదు. ఎందుకంటే అప్రతిహతంగా దూసుకుపోతున్నప్పుడు అసహనంతో రగులుతున్నప్పుడు కూడా నాయకులు మాట తూలుతుంటారు. అవతలివారిని ఇరకాటంలో పెట్టాల్సింది పోయి తమే వివాదంలో చిక్కుకుపోతుంటారు. అలాటి సమయంలో బుద్ధిశాలులు కాస్త మాట సరిచేసుకుని సమస్య నుంచి బయిటపడతారు. ఉదాహరణకు నాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ‘అమ్మ కడుపున ఎందుకు పుట్టానా అని విచారిస్తావు’ అనిప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి అన్న మాట వెనక్కు తీసుకున్నారు. చంద్రబాబు విషయంలోనూ అలాటి సవరణలున్నాయి. కాని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిని చెప్పుతో కొట్టాలని పిలుపునివ్వడంపై వివాదం రేగినా సర్దుబాటు చేసుకోవడం లేదు. పైగా మరిన్ని సార్లు అంటున్నారు. అంటే ఎవరైనా ఆయనకు సలహా ఇస్తున్నారో లేక ఇచ్చిన సలహాలు పెడచెవిని పెడుతున్నారో తెలియదు గాని చంద్రబాబు విధానాలతో విభేదించేవారైనా సరే ఈ భాషను హర్షించరు. దీనివల్ల రెండేళ్లు పూర్తయిన విభజిత రాష్ట్రానికి ప్రజలకు సంబంధించిన సమస్యలు, విధాన నిర్ణయాలపై విమర్శ వెనక్కుపోయింది. సహజంగానే తెలుగుదేశం నిరసన కార్యక్రమాలు తీవ్రం చేసింది.జగన్ వారికో అవకాశం చేతులారా ఇచ్చినట్టయింది. ఆ తర్వాత కూడా తన మాటలు సవరించుకునేబదులు జగన్ రెట్టించి చెబుతున్నారంటే వ్యూహాత్మకంగానే అంటున్నారనుకోవాలి. అదేమాట పదేపదే అనడం ద్వారా కలిగే ప్రయోజనం లేకపోగా ప్రతికూలభావనే పెరుగుతుంది. సన్నిహిత సలహాదారులైనా ఆ ముక్క చెప్పడం లేదా? జగన్‌కు నిరసనల సందర్భంలో తెలుగుదేశం కార్పొరేట్ మంటల్లో కాలిగాయపడటం ఒక అపశ్రుతి మాత్రమే గాక హెచ్చరిక కూడా. జగన్‌పై దాడిలో పోటీ పడటం ద్వారా అధినేత మెప్పు పొందుదామనుకునే నేతలు కూడా సంయమనం పాటించడం చాలా మంచిది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆ విధమైన పిలుపునిస్తూనే వైసీపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వ్యతిరేకం అనడం కొసమెరుపు. ఒకవైపున బిజెపి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన వాగ్దానాలను వమ్ము చేసేస్తుంటే పాలక ప్రతిపక్షాలు పరస్పర దూషణల్లో మునిగితేలడం దురదృష్టకరం.