మధుర మంటలతో సైన్యానికీ ముప్పు?

ఉత్తర ప్రదేశ్లోని మథుర జవహర్బాగ్ మంటలపై నేనే ఒకరోజు ఆలస్యంగా పోస్టు వేశాను. కాని తెలుగుమీడియా మరో రోజు తర్వాత గాని దాని తీవ్రతను గుర్తించలేదు. ఇలాటి సందర్భాలు నాకు అప్పుడప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఆ సంగతి అలా వుంచితే ఈ మొత్తానికి నాయకుడుగా చెబుతున్న రామవృక్షయాదవ్ తదితరులు ఆ రోజు మంటల్లో కాలిపోయారని పోలీసులు ప్రకటించారు. నిజంగా అప్పుడే కాలిపోయారా లేక తర్వాత హతమార్చి చెబుతున్నారా అన్నది ఎవరి సందేహం వారికి వుండొచ్చు. ఏమైనా వారు లేరు.
ఈ దారుణ ఉదంతంపై రాజకీయ పార్టీల నుంచి తీవ్ర స్పందన వ్యక్తమవుతున్నది. బిఎస్పి అద్యక్షురాలు మాయావతి, బిజెపి అద్యక్షుడు అమిత్షా వంటివారు ప్రభుత్వ వైపల్యం అంటున్నారు. రెండేళ్లుగా అక్కడ వారు తిష్టవేసుకున్నా ఉపేక్షించడమే గాక పరోక్షంగా వత్తాసునిచ్చిన మంత్రి శివలాల్ యాదవ్ రాజీనామా చేయాలని గట్టిగా పట్టుపడుతున్నారు. ఇది వరకే అనుకున్నట్టుగా 2017లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు సంబంధించి ఆందోళన పెరగడానికి ఈ ఘటన కారణమవుతున్నది. ఘటన తీవ్రత, అంత పెద్ద ఆయుధాగారంతో తిరుగుబాటు చేయడం, అన్నాళ్లు అక్కడే వుండటం అన్నీ అనుమానాస్పదంగా వున్నాయి. జవహర్బాగ్ జిల్లా అధికార కేంద్రానికి చాలా దగ్గరే వుంటుందట. అంతకన్నా తీవ్రమైన విషయమేమంటే సైనిక కంటోన్మెంటు కూడా రెండు కిలోమీటర్ల దూరంలోనే వుండటం! ఇప్పటికే పఠాన్కోటలో పాక్ ఉగ్రవాదుల చొరబాటు, వార్దా ఆయుధాగారంలో దారుణమైన పేలుడులో సైనికుల దుర్మరణం నేపథ్యంలో మధుర మంటలు చాలా తీవ్రంగా తీసుకోవలసి వుంది.దీనిపై నిఘా నివేదికలు రాలేదా. వస్తే ఉపేక్షించారా? ఇన్ని దుర్ఘటనలు జరుగుతున్నా అటు సైన్యం ఇటు పౌర అధికార వ్యవస్థలు రాజకీయ నాయకత్వాలు నిద్ర పోతున్నాయా?ఇప్పుడైనా న్యాయస్థానం ఆదేశాల ప్రకారం అనివార్యంగా వెళ్లడం తప్ప ఎవరూ పట్టించుకోలేదన్నది వాస్తవం. ఇక పాలక పక్షం ఎంపి హేమమాలిని తర్వాత కూడా సరిగ్గా స్పందించకపోవడం సరేసరి. అధికారంలో వున్న ఎస్పితో పాటు బిజెపి బిఎస్పి మూడు పార్టీల మధ్య హౌరాహౌరీ రాజకీయాలు నడిచే యుపిలో ఇంత పెద్ద సాయుధ ముఠా తిష్ట ఎలా దృష్టికి రాకుండా పోయింది? ఎవరూ ఎందుకు జోక్యం చేసుకోలేదు?
కొద్ది కాలం కిందట మతపరమైన హత్యలూ, దొమ్మీలు చూసిన యుపిలో అరాచకానికి ఇది పరాకాష్ట. ఇప్పటికైనా నిజానిజాలు బయిటకు రావాలంటే మళ్లీ సుప్రీం కోర్టు తలదూర్చవలసిందే. అత్యున్నత న్యాయస్థానం ఆధ్వర్యంలో విచారణ జరిపి నిజానిజాలు తేల్చకపోతే అసలు సంగతి ఎప్పటికీ బయిటకు రాదు. రేపు శాంతి భద్రతలకూ భరోసా వుండదు.