రెండిళ్లు- రెండేళ్లు!

ts1111
ap1111
నిన్న ఈ రోజు మీడియా మొత్తం తెలంగాణ రాష్ట్రావతరణ ద్వితీయ వార్షికోత్సవం, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ నవనిర్మాణ దీక్ష.. ఇద్దరు ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు, చర్చలు సర్వేలూ అడ్బర్టయిజ్‌మెంట్లు ఇవే. వరస విజయాలతో రాజకీయ ఫిరాయింపుల ఏకైకీకరణతో వూపు మీదున్న కెసిఆర్‌ ప్రభుత్వం తన జనాదరణను చాటుకోవడానికి దీన్ని ఒక సందర్భంగా చేసుకోవడం సహజం. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఫిరాయింపులలో వెనకబడకపోయినా ఇతరత్రా ముఖ్యంగా ప్రత్యేక హౌదా విషయంలో కేంద్రం తిరస్కరణను ఎదుర్కొన్న చంద్రబాబు సర్కారు ఈ సందర్భాన్ని మరో విధమైన సంకేతాల కోసం ఉపయోగించుకోవడం కూడా వూహించుకోదగిందే.
ఈ రెండేళ్ల తెలంగాణ గమనం చూస్తే సంక్షేమ పథకాలకు ప్రాధాన్యతనిచ్చామన్నది ప్రదాన ప్రచారం. నా వరకు నేను విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెట్టడం, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంటు చేస్తామనే ప్రకటన వీటిని బాగా హర్షిస్తాను. అయితే అవీ పాక్షికంగానే అమలవుతున్నాయి.(కాలేజీ పిల్లలకు కూడా అదే బియ్యం సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కొత్తగా ప్రకటించారు) కార్పొరేషన్లలో వారిని పర్మనెంటు చేసే సూచనలు లేవు. సమ్మెలు పోరాటాలు సాగుతూనే వున్నాయి. నీళ్లు నిధులు నియామకాలు అనేది అప్పుడూ ఇప్పుడూ తమ నినాద త్రయం అంటారు కెసిఆర్‌.గత ఏడాది జూన్‌ 2న ప్రసంగంలో 25 వేల ఉద్యోగాలు ఇస్తామని చెబితే అందులో అయిదో వంతు మాత్రమే పూర్తయ్యాయని హిందూ కథనం. నీళ్లకు సంబంధించి రీడిజైనింగ్‌ పవర్‌ పాయింట్లు ఎలా వున్నా ఇచ్చామంటున్న నిధులతోనైనా మూడేళ్లలో పూర్తయ్యే అవకాశమెక్కడీ నిజంగా 25 వేల కోట్లు పూర్తిగా సమర్థంగా ఖర్చు చేసినా కాళేశ్వరం వంటివి అనుకున్న సమయంలో పూర్తి కాగలవా? ఈ ప్రాజెక్టుల విషయంలో ఎగువ రాష్ట్రాలతో చర్చించినట్టే సోదర తెలుగు రాష్ట్రంతోనూ పరిష్కరించుకోవడం మంచిది తప్ప దిగువన వుందనే ఉపేక్ష సరికాదు. డబుల్‌ బెడ్‌రూం లక్షల్లో కడతామంటున్నప్పుడు దానికి కావలసిన కేటాయింపులు స్థలాలు టెందర్లు రేట్ల ఖరారు ఏదీ పూర్తి కాలేదన్నది నిజం.ఎర్రవెల్లిలో మోడల్‌హౌస్‌ షో కేసింగు మాత్రమే. లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటే వేల సంఖ్యలో కూడా నిర్మాణంచేసే పరిస్తితి లేనప్పుడు డబుల్‌ బెడ్‌రూంలపై ట్రిబుల్‌ ప్రచారం ఇప్పటికి బబుల్‌ మాత్రమే! భారీ నిర్మాణాల కాంట్రాక్టులలో అత్యధిక లాభాలు వచ్చినట్టు ఈ ఇళ్లలో రావు గనక చిన్నవారికి అవకాశమిస్తామన్నారు. రాష్ట్రాలు రెండైనాపార్టీలు వేరైనా కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తల మాటే చెల్లుతుందనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
కెజిటుపిజి, దళితులకు భూమి ఇంకా అమలులోకి రాలేదని అధికారికంగానే చెబుతున్నారు. భూ సమస్యను రంగం మీదకు తెచ్చిన తెలంగాణలో భూపంపిణీ చేయలేకపోవడం ఒక విపరీతం. . కొని పంచడం అన్న విధానం ఎవరికి మేలు చేస్తుందో చెప్పనవసరం లేదు.భూసేకరణపై జీవో 123 ఇంకా దారుణంగా వుంది సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ మిల్లుతో సహా మూత పడిన వాటినితెరిపించడం, కార్మిక సమస్యల పరిష్కారం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.విద్యారంగంలో గందరగోళం గురించి ఎంత తక్కువ చెవితే అంత మేలు. పేదలు ఎస్‌సిఎస్‌టి బిసి మైనార్టి వర్గాలు అదికంగా వుండే తెలంగాణలో సామాజిక న్యాయం అన్నది ప్రభుత్వ ఎజెండాలో పెద్దగా వినిపించకపోవడం యాదృచ్చికం కాదు. మహిళలకు మంత్రివర్గంలో చోటు లేదని విమర్శలు ఎంతగా వున్నా ఇప్పట్లో మారే అవకాశం లేదని తేల్పిపారేశారు. వీరతెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని స్మరించుకోవడానికి సిద్ధపడని ప్రభుత్వాధినేత తాత్వికతకు ప్రతిబింబమా ఇది? సనాతన విశ్వాసాలు సమానతకు అడ్డుపడుతున్నాయా? తెలంగాణ సాధనలో ముందు నిలిచిన జెఎసిని కూడా కలుపుకోలేనంత ఏకపక్ష ధోరణి దేనికోసం? జాయింట్‌ యాక్షన్‌ సాధనకే గాని పాలనకు కాదా?ఉద్యమానికి వూపిరులూదిందన్న ఉస్మానియాకు వూతం ఉపశమనం ఇవ్వకపోవడం ఎందువల్ల? ముందస్తు అరెస్టులు సభలకు అనుమతి నిరాకరణలూ ఒకటి రెండుఎన్‌కౌంటర్లు ఇవన్నీ దేనికి సంకేతాలు? . ఇప్పుడిప్పుడే ఆయన జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పడం గురించి మాట్లాడుతున్నారు గాని జాతీయంగా బిజెపి పట్ల తన విధానమేమిటో ఇంతవరకూ చెప్పింది లేదు. లౌకిక ప్రజాస్వామిక వారసత్వంలోనే తెలంగాణ ఔన్నత్యం దాగివుంటుందనేది మాత్రం తిరుగులేని నిజం.
ఇక విభజితాంధ్ర ప్రదేశ్‌ విషయంలో మరింత క్లిష్టమైన సమ్ణస్యలు. తెలుగుదేశం కేంద్రంలో భాగస్వామిగా వున్నావిభజన సయమంలో వాగ్దానం చేసిన ప్రత్యేక హౌదా గాని అర్థిక సహాయం గాని తెచ్చుకోలేని దుస్థితి. బిజెపి టిడిపి దాగుడుమూతల్లో నవ్యాంధ్రప్రదేశ్‌ నలిగిపోతున్న దశ. రాజధాని గురించి తమకేమీ తెలియదని భాగస్వామ్య పార్టీలైన బిజెపివారే చెబుతుంటే ఇక ఇతరుల మాట చెప్పేదేముంది? వేరే సమస్యలే లేనట్టు మొత్తం రాజధానిపైనే కేంద్రీకృతం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆలోచనా సరళి అధికార పక్షంలో వారికే అంతుపట్టడం లేదు. ప్రపంచబ్యాంకు ప్రవేశం, అర్థం కాని అప్పులూ, అడుగడుగునా కార్పొరేట్‌ కైంకర్యాలూ , హక్కుల హరింపులూ, ముందస్తు అరెస్టులూ అన్నీ షరా మామూలే. విభజిత రాష్ట్ర సమస్యలపై ఒక్కసారైనా అఖిలపక్షసమావేశం జరిపింది లేదు. వైఎస్‌ఆర్‌పార్టీ అంటే పడదు, మిగిలిన వారంటే లక్ష్యం లేదు. ఏతావాతా ఏకపక్షం. కేంద్రంతో లేదా పొరుగు రాష్ట్రంతో జరిపే సంభాషణలు సంప్రదింపులపైనైనా వివరణ వుండదు. పదేళ్ల ఉమ్మడి రాజధాని అవకాశాన్ని ఓటుకు నోటుతో పది మాసాలలోనే ఫణం పెట్టి పరుగులు తీస్తున్న విడ్డూరం. తరలింపుపైనా తాత్కాలిక ఏర్పాట్టలపైన తడవకో తర్జనభర్జన. అర్థం కాకుండనే వందల కోట్ల వ్యయం. విదేశాల నుంచి ఏదో ఒరిగి పడుతుందనే భ్రమల వ్యాప్తి. పట్టిసీమ తప్ప మరే ప్రాజెక్టు గురించి పట్టించుకోని వైనం. ఒక విభజన తర్వాతనైనా ప్రాంతీయ అసమానతల తొలగింపునకు ప్రథమ ప్రాధాన్యతనివ్వని రాజకీయ పాక్షికత్వం. నిధులకొరత అంటూనే ప్రపంచంలో ప్రథమ స్థానం గురించిన ప్రజ్ఞలు. అనుభవాన్ణి చూసి అధికారం అప్పగించిన ప్రజలకు అయోమయం. అమరావతి పక్ననే అలజడి, అగమ్యం. పూర్తిగాని రుణమాపీ,పెద్దగా మొదలు కాని ఉద్యోగ నియామకాలు. నవ్యాంధ్ర ప్రదేశ్‌ సవ్యాంధ్ర ప్రదేశ్‌గా మారడానికి ఆటంకాలవుతున్నాయి. శాసనసభ సమావేశాలు మొక్కుబడులుగా ముగిసిపోతున్నాయి. ప్రచారార్భాటాలు ప్రదక్షిణాలూ ఎక్కువై ప్రజా ప్రయోజనాలు వెనక్కు పోతున్నాయి. కులాల చిచ్చు మళ్లీ రాజుకుంటున్న సూచనలున్నాయి. కాల్‌మనీ, ఇసుక దందాల వంటివాటిపై కఠిన చర్యలు తీసుకోని దుష్పలితాలున్నాయి. ఇవన్నీ వదలిపెట్టి ప్రతిపక్షాలపైనో ఉద్యోగుల పైనో రుసరుసలాడటం నిరర్థకం.అదేపనిగా భూములు సేకరించి అవసరం లేని విమనాశ్రయాలూ వినోద కేంద్రాల వివాదం రగిలించేకంటే ప్రాధన్యతా క్రమం పాటిస్తే అందరికీ మంచిది. రాజధాని లేకపోవడం నిధుల కొరత నిజం కావచ్చు గాని ఆంధ్ర ప్రదేశ్‌ హఠాత్తుగా పుట్టుకోచ్చిన వ్యవస్థ కాదని ఒప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన నాయకుడికి ఇవన్నీ బాగా అవగామనలోనే వుంటాయి. ఇప్పటికైనా దృష్టికోణం మార్చుకుంటే ప్రజల్లో విశ్వాసం పెరుగుతంది. భరోసా దొరుకుతుంది.
ఫిరాయింపులతో పాటు మీడియాలో విమర్శలపై అసహనంలో ఇరురాష్ట్రాలూ పోటీ పడుతున్నాయి. . వడడెబ్బ మృతుల్లో కరువు దెబ్బలో రెండూ ముందే వున్నాయి. . రెండు చోట్ల విద్యుత్‌ ఛార్జిల పెంపుదల పొంచిచూస్తున్నది. చెప్పుకోవాలంటే రెండు చోట్లా రెండేళ్లకు సంబంధించి ఇంకా చాలా వున్నాయి అయితే శ్రీశ్రీ అన్నట్టు పాతవి గుంజాళించేందుకు ఇది సమయం కాదు. ఈ కాలమంతా తెలుగు ప్రజలు సుహృద్భావ పూర్వకంగా వుండటం అన్నిటికన్నా మంచి విషయం. పాలకులుకూడా ఇరువైపులా ఆ స్పూర్తిని మరింత పెంపొందించేందుకు కృషి చేస్తారని ఆశిద్దాం. నాయకుల గొప్పతనాలను చెప్పుకోవడంలోనే మునిగితేలకుండా ప్రజలకు సజీవ భాగసామ్యం సమగ్ర సమచారం అందిద్దాం. జాను తెనుగే మేము జాతి ఘనతే మేము అని చెయ్యెత్తి జైకొడదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *