ఇవతల వారికీ ఇటలీ ప్రేమే!

Girone_2869129f
కాంగ్రెస్‌ పాలనలో పొరబాట్లు కుంభకోణాలు వంటివాటితో పాటు సోనియా గాంధీ పుట్టిల్లు ఇటలీని ప్రస్తావించి దెప్పిపొడవడం బిజెపికి బాగా అలవాటు. అది వారి వ్యూహం. అయితే ఇటలీ ప్రేమలో వారేమీ తక్కువ కాదు. ఎందుకంటే 2012లో అమాయకులైన కేరళ జాలర్లు ఇద్దరిని కాల్పి చంపిన ఇటలీ మెరైన్లను(నౌకాళ సైనికులను) స్వదేశం పంపించేందుకు మోడీ ప్రభుత్వం నిరభ్యంతరంగా అవకాశమిచ్చింది. వారు సముద్రపు దొంగలని పొరబాటుగా చంపేశామని ఈ మెరైన్లు ఇచ్చిన సంజాయిషీతో కోర్టులు ఏకీభవించలేదు. తర్వాత అది అత్యున్నత న్యాయస్థానం ముందుకు వెళ్లింది. ఆ దశలో ఇటలీ వీరిని ఏ దేశంలో విచారించాలనే దానిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పేచీ పెట్టింది. ఆ కేసు సమర్థంగా ఎదుర్కొనే బదులు భారత ప్రభుత్వం మెతకదనం చూపింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే 2014 సెప్టెంబరులో మిసిలిలినో లాటోర్‌ అనే మెరైన్‌ను స్వదేశం వెళ్లనిచ్చారు. ఆ తర్వాత 2015 ఆగష్టులో సుప్రీంకోర్టు విచారణను నిలిపివేసింది. అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ ఈ విచారణ ఎక్కడ జరగాలో తేల్చాకే తదుపరి అడుగు వేయాలని భావించింది. అయితే ఆ ట్రిబ్యునల్‌ 2018 వరకూ తన తీర్పు చెప్పే అవకాశం లేదని తేల్చేసింది. ఈ నేపథ్యంలో తనను కూడా ఇటలీ వెళ్లేందుకు అనుమతించాలని రెండవ మెరైన్‌ సల్వాటోర్‌ గిరోన్‌ అభ్యర్థించారు. అతన్ని వెళ్లడానివ్వడానికి అభ్యంతరం లేదని కేంద్రం కోర్టుకు చెప్పింది. దాంతో భారత దేశంలోని ఇటలీ రాయబారి పూచీకత్తుపై వెళ్లవచ్చని కోర్టు అంగీకరించింది. కేంద్రం సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లనే వారు వెళ్లిపోగలిగారని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ విమర్శించారు. అమాయక జాలర్లను కాల్చిచంపిన వారిని అంత సులభంగా ఎలా వదలిపెడతారని ఆయన ప్రశ్నించారు. ఇదే పని యుపిఎ హయాంలో జరిగివుంటే బిజెపి ఎంత రభస చేసేదో ఒకసారి వూహించడానికి ప్రయత్నిస్తే చాలు.
ఆగష్టా హెలికాఫ్టర్ల కుంభకోణంలో కూడా కాంగ్రెస్‌పై దాడి చేస్తున్న మోడీ ప్రభుత్వం తానెందుకు వారిని మేకిన్‌ ఇండియాలో భాగస్వాములుగా ఆహ్వానించింది సంతృప్తికరమైన సమాధానం ఇంతవరకూ ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టలేదని వాదించిందే తప్ప తాను ఆ పనిచేయడానికి ఏ అడ్డంకి వచ్చింది?
ఈ రెండు పార్టీలను గాని లేక ఇటలీని గాని సమర్థించాల్సిన అవసరం మనకేమీ లేదు. కాకుంటే మాటలకూ చేతలకూ తేడా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆగష్టా వ్యవహారంలో పత్రాలు అందిస్తే మెరైన్లను అప్పగించడానికి ఇటలీతో కేంద్ర నేతలు లోపాయి కారి ఒప్పందం కుదుర్చుకున్నారనే ఆరోపణలు కూడా వున్నాయి. వదలిపెట్టడం మాత్రం కనిపిస్తూన్న సత్యం.ఇక 2018 తర్వాత ఏం జరుగుతుందో గాని ఇప్పటికైనా ఇద్దరూ ఇటాలియన్లు హాయిగా స్వదేశం చెక్కేశారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *