కేరళపై రాజకీయ యుద్ధం?

hqdefault
ఎన్నికలన్నాక గెలుపు ఓటములు సహజం. ఈ దఫా అసెంబ్లీ ఎన్నికలలో తమకు ఘన విజయం లభించిందని బిజెపి పొంగిపోతున్నది. ఆ హక్కు వారికి వుంది. వామపక్షాలు ముఖ్యంగా సిపిఎం బెంగాల్‌లో దారుణంగా దెబ్బతిన్నా కేరళలో అసాధారణ విజయం సాధించడం ఒక వాస్తవం. బిజెపి ప్రభావంతో అక్కడ మామూలు వరవడి మారిపోతుందని వారికి తృతీయ శక్తిగా గొప్ప అవకాశం లభిస్తుందని వూహాగానాలు నడిచినా ఒక్క స్థానం రావడం, గతంలోని ఓటింగు కొనసాగడం తప్ప పెద్ద వూపు రాలేదు. అయితే ఆ వెంటనే కాబోయే ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ కృతజ్ఞతాయాత్రపై దాడి చేయడం ద్వారా బిజెపి కార్యకర్తలు ఉద్రిక్తత సృష్టించారని సిపిఎం వెల్లడించింది. ఘర్షణ కూడా జరిగింది. సిపిఎం ఆరెస్సెస్‌ ఘర్షణలను నిలయమైన కన్నూరు జిల్లా ఉద్యమం నుంచి వచ్చిన నేత విజయన్‌. అక్కడ తమ కార్యకర్త ప్రమోద్‌ను సిపిఎం వారు హత్య చేశారని బిజెపి ఆరోపిస్తుండగా ఆపార్టీ ఖండిస్తున్నది. దీనిపై స్వయానా బిజెపి అద్యక్షుడు అమిత్‌షా అనేక ఆరోపణలు చేయగా నితిన్‌ గడ్కరీతో సహా పలువురు కేంద్ర మంత్రులు వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రాలలో అది కూడా ఎన్నికల సమయంలో జరిగే ఘర్షణలను ఇంత స్థాయికి తీసుకుపోవడం చాలా అరుదు.బహుశా రాజకీయ కోణంలో దీనిపై ఆందోళన ఉధృతం చేయాలని బిజెపి భావిస్తుండొచ్చు.వారికి ఆ హక్కు వుంది కూడా. అయితే ఆ తర్వాత ఏకంగా సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకెజి భవన్‌పైనే దాడికి దిగడం మాత్రం దారుణం. గతంలో ఒకసారి, ఇటీవల మళ్లీ జెఎన్‌యు వివాదం నేపథ్యంలో బిజెపి అనుయాయులు ఎకెజి భవన్‌పై దాడికి దిగారు. ఇప్పుడు అధికారికంగానే నిరసన ప్రదర్శన జరిపి అంతటితో ఆగక దాడి చేశారు. దేశంలో వివిధ చోట్ల తలెత్తే సమస్యలపై ఈ విధంగా పార్టీల కేంద్రాలపై దాడి చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అలా అయితే ఢిల్లీలో రోజుకొక పార్టీపై దాడి జరుగుతుంది. బిజెపి నాయకత్వం ఇప్పటికైనా ఈ ధోరణి విరమిస్తుందని ఆశించాలి. తమ ఎన్నికల విజయాన్ని తట్టుకోలేకే బిజెపి ఈ విధంగా రాష్ట్రంపైనా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపైనా దాడికి దిగడం మంచిది కాదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గట్టిగానే విమర్శించారు. కన్ననూరులో శాంతి స్థాపనకు అందరూ సహకరించాలి. రాజకీయ ఘర్షణల వల్ల ఎవరూ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్తితి వుండకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *