కాంగ్రెస్‌ ముక్త్‌,బిజెపి యుక్త్‌- ఎంత వరకు ?

congree bjp111
నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ఎన్‌డిఎ కూటమి కేంద్రంలో అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సమయంలో జరిగిన ”మధ్యంతర” ఎన్నికలో అస్సాంలో బిజెపి అధికారం కైవశం చేసుకోవడమే గాక వామపక్ష ప్రధాన రాష్ట్రాలుగా పేరొందిన కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఖాతా తెరవడం, ఆపార్టీ అసాధారణ విస్తరణగా అభివర్ణిస్తున్నారు. గతంలో మహారాష్ట్ర,హర్యానా,రాజస్థాన్‌,అస్సాం రాష్ట్రాలలో అధికారంలోకి రాగలిగినా ఢిల్లీ, బీహార్‌లలో దారుణంగాి దెబ్బతిన్న బిజెపికి అస్సాంలో విజయం పెద్ద వూరటే. కాని ఈ ఫలితాలను బిజెపికి దేశవ్యాపిత విజయంగా చూపించడం కూడా ఉద్దేశపూర్వకమే. వాస్తవానికి ఆ పార్టీకి ప్రతిచోటా ఓటింగు తగ్గింది లోక్‌సభలో 44 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హౌదా కోల్పోయిన కాంగ్రెస్‌ వేగంగా దెబ్బతింటున్న మాట నిజం. కర్ణాటక మినహా మరే పెద్ద రాష్ట్రంలోనూ పాలించడం లేదు. ప్రధాన పార్టీగా అధికారం చలాయించిన కాంగ్రెస్‌ స్థానాన్ని మతవాద మితవాద బిజెపి ఆక్రమిస్తున్నదనేది చాలామంది అంటున్నమాట. అయితే అంతమాత్రాన బిజెపి దూసుకువస్తున్నట్టు కాంగ్రెస్‌ లేదా వామపక్షాలు శాశ్వతంగా దెబ్బతినిపోయినట్టు చిత్రించడం తొందరపాటే. వాస్తవాలు పరిశీలిస్తే అసెంబ్లీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ ఒకేలా వుండవు. 2004-2009 మధ్య దేశంలోని 30 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలోనూ 14 చోట్ల కాంగ్రెస్‌ ఓడిపోయింది. కాని 2009లో కేంద్రంలో గెలుపు సాధించింది. 2009-14 మధ్య కాలంలో బిజెపి 9 రాష్ట్రాలలో ఓటమి చూసింది. కాని తర్వాత కేంద్రంలో ఆధిక్యత వచ్చింది.. 2012లో ఉత్తర ప్రదేశ్‌ శాసనసభలోని 403 సీట్లలోనూ 47 మాత్రమే తెచ్చుకున్న బిజెపి 2014లో అక్కడి 80 లోక్‌సభ స్థానాల్లోనూ 71 తెచ్చుకుంది! కనుక అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల తర్కం భిన్నంగా వుంటుంది. పైగా ఈ విజయాలు బిజెపి మతతత్వ రాజకీయాలకు అసహనానికి ఆమోదం అనుకుంటే ఇంకా నష్టం. వీటి ఆధారంగా కాంగ్రెస్‌ ముక్త భారత్‌ ఏర్పడిందని అంతిమ తీర్పులు ఇవ్వడం కూడా తొందరపాటే. ధనాఢ్యవర్గాలు బిజెపిపై ఓటర్లకు మొహం మొత్తిందని గుర్తించిన రోజున తమ అండదండలు మరో పార్టీకి బదలాయించేందుకు సిద్ధంగానే వుంటాయి. ఈ అయిదు రాష్ట్రాలలోనూ చూసినా కాంగ్రెస్‌కు మొత్తం 115 స్థానాలు వస్తే బిజెపికి కేవలం 63 అందులోనూ 60 అస్సాంలో మాత్రమే వచ్చాయి. కనక తీవ్రమైన తేడాలున్నాయి. దీనంతటి అర్థం కాంగ్రెస్‌ చావుదెబ్బ తినిలేదని కాదు .బలహీనపడిపోతున్న కాంగ్రెస్‌ను ఎలా పునరుద్దరించుకోవాలనేది ఆ పార్టీ నేతలకు అంతుపట్టడంలేదు. ఆర్థిక సామాజిక విధానాలు మార్పు, సంస్థాగత పటిష్టత సమిష్టి నాయకత్వం వంటి చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్‌ పరిస్థితి ఇంకా అధ్వాన్నం కావచ్చు. కాని రాహుల్‌గాంధీ ఈ ఓటమికి బాధ్యుడు కాదని చెప్పడంపైనే కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు కేంద్రీకరిస్తున్నారు.
సున్నితమైన రాష్ట్రాల్లో బిజెపి పాలన
వాస్తవానికి ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం చాలా అధికం. అస్సాంలోనూ ో గత పాలక పార్టీ అస్సాం గణపరిషత్‌(ఎజిపి) బలహీనపడిపోయిన శూన్యాన్ని బిజెపి సొమ్ము చేసుకోబట్టే దానితో కలిసే బిజెపి వచ్చింది. బోడోపీపుల్స్‌ ఫ్రంట్‌ను కూడా చేరువ చేసుకుంది.ఈశాన్యాన బిజెపి ప్రభుత్వ విధానాలు ఎలా వుంటాయి ఏ ప్రభావం చూపిస్తాయన్నది కూడా పరిశీలించాల్సిందే. ఎందుకంటే 34 శాతం ముస్లిం జనాభా, బంగ్లాదేశ్‌ శరణార్థుల సమస్య, అనేక రకాల ఉపజాతి కలహాలు ఆదివాసీ సమస్యలు వున్న రాష్ట్రం అది. ఎన్నికల ప్రచార సందర్భంలో బిజెపి చాలా దారుణంగానే ముస్లిం దురాక్రమణల గురించి మొగలాయిలను ఓడించిన గతం గురించి మాట్లాడింది. హిందూ శరణార్థులకు మాత్రం పౌరసత్వం ఇస్తామని ప్రకటించింది. అసలు 1951 పౌరసత్వ చట్టాన్ని పునరుద్ధరిస్తానన్నది. బోడోలతో దానికి పొత్తు వుండగా బలం కొద్దిగా తగ్గిన ఐఎంయుడిఎఫ్‌ ఆగ్రహంగా వుంది. ఇవన్నీరానున్న రోజుల్లో చాలా జాగ్రత్తగా చూడవలసిన విషయాలు. దేశంలో సమస్యాత్మక రాష్ట్రాలైన కాశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, అస్సాం, పంజాబ్‌(ఇప్పటికి),గుజరాత్‌,రాజస్థాన్‌లు బిజెపిపాలనలోనే వుండటం తీవ్రమైన విషయమే.
కేరళలో ి బిజెపి కూటమి ఓట్లను చీల్చడం ఎల్‌డిఎఫ్‌ అవకాశాలను దెబ్బతీస్తుందని కొందరు కలలు కన్నా అది యుడిఎఫ్‌కే చేటు తెచ్చింది. బెంగాల్‌లో బిజెపి ఓటింగు తృణమూల్‌ కాంగ్రెస్‌కు తోడైందనేది బహిరంగంగా కనిపిస్తునే వుంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇంచుమించు 17శాతం ఓట్లు వచ్చిన ఆ పార్టీ వామపక్షాలు మళ్లీ రాకుండా చేయాలంటే తృణమూల్‌నే బలపర్చాలని నిర్ణయించుకుింది. ఆ క్రమంలో దానికి కూడా సీట్లు దక్కాయి. అదే కాంగ్రెస్‌ విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష ఫ్రంట్‌తో అవగాహన అంటూనే ఓట్ల బదలీ చేయించలేదు. తమిళనాడులో డిఎంకెతో పొత్తుపెట్టుకుని యాభై స్థానాలు తీసుకుని ఏడు మాత్రమే తెచ్చుకుంది. డిఎంకె విజయాల శాతంతో పోలిస్తే ఇది అత్యంత అధ్వాన్నం. అవగాహన ప్రకారం ఓట్లు వేయించకపోవడం, అమితంగా బేరాలాడి ఫలితాలు తలకిందులు చేయడం, అస్సాం వంటిచోట్ల కూడా పాతభాగస్వాములతో పొత్తులకు ప్రయత్నించకపోవడం కాంగ్రెస్‌ అవకాశవాదాన్ని, అయోమయాన్ని, రాహుల్‌గాంధీ నాయకత్వం అపరిపక్వతను సూచిస్తాయి. పైగా వామపక్షాలతో అవగాహన వద్దని రాహుల్‌గాంధీ మొదట వారించారని ఇప్పుడు కథనాలు వదులడం ఇంకా దారుణం.
జయలలిత,మమత విజయాలు
బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో జయలలిత సాధించిన విజయాలపై చాలా విశ్లేషణలు వచ్చాయి. వారి వ్యక్తిగత ఆకర్షణ, మొండితనంతోపాటు సంక్షేమ పథకాలు, భారీ తాయిలాలు కూడా విజయానికి బాటవేశాయని చెబుతున్నారు గాని అదీ పాక్షిక సత్యమే. చాలా కారణాలు అందుకు దారితీశాయి. ఈ ఇద్దరిపైన వారి ప్రభుత్వాలపైన తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. మంత్రుల తొలగింపు,జైలుశిక్షల వంటివి కూడా జరిగాయి. అయినా సరే విజయం సాధించారంటే అవినీతి ఆరోపణలను బట్టి మాత్రమే తీర్పులు వుండవని అంగీకరించవలసిన స్థితి. పాలకవర్గాలు అవినీతిని అంతగా అలవాటు చేసి మామూలు అంశంగా మార్చేశాయన్న మాట. ఇక వ్యక్తిగత పోకడలు ఏకపక్ష నిరంకుశత్వం వంటి విషయాల్లోనూ వీరికి పోలికలున్నాయి. తమిళనాడులో ప్రతిపక్షాల ఓట్ల చీలిక, రకరకాల కులాల వేరు కుంపట్లు అన్నీ కలసినా జయలలిత గతసారి కన్నా తక్కువతోనే గెలిచారు. మెజార్టిలు కూడా తక్కువే. కరుణానిధి కుటుంబ సపరివార అవినీతి, అరాచకం కూడా ప్రజలకు మింగుడు పడలేదు. అయితే డిఎంకెకు వచ్చిన 90 సీట్ల బలం కూడా తక్కువ కాదని గమనించాలి. పాలకపక్షంపై అసంతృప్తి కూడా గట్టిగానే వుందనితేలింది. జయలలితకు కూడా బిజెపి ఓటింగు తోడైంది. ఇవన్నీ చూడాల్సిందే. పాండిచ్చేరిలో అనేక ఆరోపణలతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి ఓడిపోవడం కాంగ్రెస్‌ డిఎంకెలు గెలవడం ఇందుకు భిన్నమైన పరిణామం

బిజెపి బ్రహ్మాండంగా పెరిగిపోతుందని చెబుతున్నా వాస్తవానికి ఈ ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుగుతుంది. మమత జయ వంటి వారు బిజెపికి ఏదోలా సహకరిస్తారు. మరోవైపున వారికి కొంచెం భిన్నమైన కేజ్రీవాల్‌, నితిష్‌ కుమార్‌ నవీన్‌ పట్నాయక్‌,కెసిఆర్‌ వంటి వారు ఏం చేస్తారనే ప్రశ్న కూడా వుంది. యుపిలో ఎస్‌పి బిఎస్‌పిల పాత్ర రాజకీయ వైరుధ్యాలు కూడా వున్నాయి. ముందే చెప్పుకున్నట్టు యుపి ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో మరో దఫా రాజకీయ మధనం జరుగుతుంది.అదే 2019 లోక్‌సభ ఎన్నికలకు భూమిక ఏర్పరుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *