భారత్‌లో కుట్ర- నేపాల్ సందేహం

భారత దేశంలో తమ ప్రభుత్వ కూల్చివేతకు కుట్ర జరిగిందని నేపాల్ ప్రధాని కెపిశర్మ ఓలి సందేహిస్తున్నారు.నేపాల్ కమ్యూనిస్టుపార్టీ(మార్క్సిస్టు లెనినిస్టు)కు చెందిన శర్మ స్థానంలో మావోయిస్టు పార్టీ నేత ప్రచండను ప్రతిష్టించడం కోసం ప్రయత్నాలు జరిగాయని వార్తలు వ్యాపించాయి. ఆ నేపథ్యంలోనే భారత దేశానికి రావలసిన నేపాల్ అద్యక్షురాలు విద్యాదేవి భండారి పర్యటన ఆఖరి నిముషంలో రద్దయింది. దౌత్య సంబంధాలలో అది చాలా తీవ్రమైన చర్య. దీనిపై వివరాలు తెలుసుకుందామని ఢిల్లీలోని నేపాల్ రాయబారి దీప్‌కుమార్ ఉపాధ్యాయ ఫోన్ చేవారు. అయితే మీరు వెంటనే వెనక్కు వచ్చేయండని ఆయనకు తాఖీదు అందింది. కాంగ్రెస్ నాయకుడైన దీపాకుమార్ ఈ కూల్చివేతకుట్రలో పాలు పంచుకున్నాడని ప్రధాని అనుమానిస్తున్నారు.
ప్రచండను ప్రధాని కావడానికి అవసరమైన మద్దతు దొరక్కపోవడంతో రాజీకి వచ్చారు. మావోయిస్టుల కోర్కెలు నెరవేర్చేందుకు శర్మ అంగీకరించడంతో సమస్య సమిసిపోయింది. అయితే దీనికి సన్నాహాలు చేసిన వారిని విచారించి తగుచర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. దీపా ఉపాధ్యాయ గతంలో మధేష్ ప్రాంతానికి వెళ్లిరావడం అనుమానాలు పెంచింది. కొత్తరాజ్యాంగంవచ్చాక చాలా కాలం పాటు అక్కదే ప్రతిఘటన దిగ్బంధనం కొనసాగాయి.ఇందుకు భారత దేశం కూడా సహకరించడంతో దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కొన్ని విషయాల్లో నేపాల్ చైనాకు దగ్గరగా వెళ్లిందని మన దేశం భావించింది. తర్వాత సంబంధాలు మెరుగుపడుతున్న దశలో ఈ తీవ్ర పరిణామం సంభవించింది. ఇది దౌత్య సంబంధాలలో మరో అపశ్రుతి కావచ్చు.మోడీ ప్రభుత్వ హయాంలో ఇరుగుపొరుగు దేశాలతో సంబంధాలలో ఒడుదుడుకులు పెరిగాయన్నది దౌత్యవేత్తల అభిప్రాయం. నేపాల్‌ను హిందూ రాజ్యంగానే కొనసాగించాలన్న ఆరెస్సెస్ వ్యాఖ్య కూడా దుమారం రేపింది. .