గుజరాత్లో 10 ఇబిసి రిజర్వేషన్లు- ఓటు బ్యాంకు రాజకీయాలా?

గుజరాత్లో ఆర్థికంగా వెనకబడిన వారికి(ఇబిసి)లకు పదిశాతం రిజర్వేషన్ కల్పించాలని ఆనందిబెన్ పటేల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పెంపు పటేళ్లకు కూడా వర్తిస్తుందని ప్రకటించింది. వాస్తవానికి హార్దిక్ పటేల్‌నాయకత్వంలో సాగిన పటేళ్ల ఆందోళన చిచ్చు కారణంగానే ప్రభుత్వం ఈ రిజర్వేషన్ పెంపు నిర్ణయం తీసకుందనేదిస్పష్టంగా కనిపిస్తుంది. బిజెపి ప్రభుత్వానికి పటేళ్ల మద్దతు చాలా అవసరం. గుజరాత్లో పటేళ్లు వెనకబడిన తరగతులుగా గాక బలమైన వర్గంగా వున్నారు. రాజకీయ మార్పులను కూడా నిర్దేశిస్తుంటారు. నలభై ఏళ్ల కిందట దేశంలో తొలిసారి రిజర్వేషన్వ్యతిరేక ఆందోళన వచ్చింది కూడా గుజరాత్‌లోనే కావడం గమనించదగింది. ఎన్నికల
అవసరాలకోసం బిజెపి కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు రిజర్వేషన్ కోటా పెంపుదల గురించి హామీలు ఇచ్చేస్తుంటాయి. అది కులాల మధ్య కుంపటి రాజేస్తుంటుంది. తీరా ఆ రిజర్వేషన్ పెంపు ఉత్తర్వులు కోర్టుల ముందు నిలుస్తాయో అంటే అదీ వుండదు. పైగా పటేళ్లకు రిజర్వేషన్ పెంచితే ఇతర బిసి ఎస్సిలు మౌనంగా వుండటం జరగదు. అలా ఇది కొత్త ప్రజ్వలనానికి దారితీయొచ్చు. ఇప్పటికే రాజస్థాన్‌లో బిజెపి గుజ్జర్లకు రిజర్వేషన్‌పై చేసిన వాగ్దానం నిలబెట్టుకోకపోవడం పెద్ద కల్లోలానికి దారితీసింది. ఆ తర్వాత హర్యానాలో భూస్వామ్య వ
ర్గంగా వున్న జాట్లకు రిజర్వేషన్ కావాలన్న అలజడి మొదలైంది. ఒకవైపున జిడిపి పెరిగిందంటున్నా ఉద్యోగాల కల్పన తగ్గిపోతున్నది. ఇలాటి పరిస్థితుల్లో రిజర్వేషన్ పెంచినా వచ్చే ఉద్యోగాలు వుండవు. కనుకనే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కోర్కె ముందుకొస్తున్నది. ఆ విధానాన్ని మార్చేబదులు ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషన్ శాతంమరింత పెంచడం వల్ల లేదా లబ్దిదారులను విస్తరించడం వల్ల ఒరిగేది వుండదు. ఎస్సి ఎస్టి బిసి రిజర్వేషన్లను ఖండించేవారు ఆర్థికంగా వెనకబడినవారికీ వుండాలని కోరతారు గనక వారి బాధను కూడా సానుభూతితో అర్థం చేసుకుని చర్యలు తీసుకోవచ్చు. కాని ముందస్తుచర్చలు, శాసనసంబంధమైన ఏర్పాట్లు జరక్కుండా వూరికే కంటితుడుపుగా పెంచడం వాటిని కోర్టుల్లొ సవాలు చేయడం అంతా ప్రహసనంగా మారింది. ఈ లోగా ఇప్పటికే రిజర్వేషన్ పొందుతున్న కులాలలో ఆందోళన బయిలుదేరుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో కాపుల సమస్య అలాగే వుంది. తెలంగాణలోమైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆచరణ సాద్యం గాని వాగ్దానం చేసిన కెసిఆర్ ప్రభుత్వం మొన్న ప్లీనరీలో దానిపై అసలే మాట్లాడక పోవడం చూశాం. నిజంగా అర్హులైన వారందరికీ రిజర్వేషన్ కల్పించడం ఎంత అవసరమో రాజకీయావసరాల కోసం దాన్ని పాచికగా వాడుకోవడడం అంతే తప్పిదం. గుజరాత్లో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో 31 జిల్లాల్లోనూ 25 చోట్ల బిజెపి తుడిచిపెట్టుకుపోయిందన్న ఆందోళన ఈ ఆకస్మిక నిర్ణయానికి కారణమంటున్నారు. జనాభాలో 12 నుంచి 15 శాతం వరకూ వున్న పాటిళ్లను సంతృప్తిపరిస్తే ఎన్నికల్లో మేలు అన్నది ఇక్కడ తారకమంత్రం. మరి బిజెపి విమర్శించే ఓటుబ్యాంకు రాజకీయాలకు ఇదో నిదర్శనం కాదంటారా?