పవన్ కళ్యాణ్ .. మళ్లీ పాత జానర్?

పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ నేను విడుదలైన వారం తర్వాత చూశాను. నిజంగా చెప్పాలంటే కమర్షియల్ ప్రమాణాల్లో మొదటి దానికంటే దీనిలో కొంత కథాంశం వుంది. క్రమబద్దత వుంది. కాని అది మూడో వంతు వుంటే సాగదీత, మాస్ మసాలా అనుకొని పెట్టింది రెండొంతులు వుంది. లేకపోతే ఈ చిత్రం మరింతగా ఆకట్టుకుని వుండేది. . గబ్బర్‌సింగ్‌లో అంత్యాక్షరి నవ్వులు పూయించిందని ఈ చిత్రంలో చీటిమాటికీ వాటిని తీసుకురావడం బిగువు లేకుండా చేసింది. ఇక గబ్బర్ సింగ్ ఇచ్చిన ఇమేజిని ఎక్కువ అంచనా వేసుకున్నారు గాని ప్రేక్షకులు చూసిన ప్రతిదానికి అంతగా గుర్తు పెట్టుకోరు. రాజభవనంలో హౌటల్ కథను ముడిపెట్టడం బాగుంది. రాజకుమారిగా కాజల్ చిత్రానికి చాలా తోడ్పడినట్టు చెప్పాలి. అంత పెద్ద హీరోకు ఒక బుల్లి విలన్‌ను కేవలం గంభీరమైన గొంతు పెట్టినంత మాత్రాన చెల్లుబాటు కాలేదు. ఈ సమస్య మొదటి గబ్బర్‌లో కూడా వుంది. గనుల తవ్వకం అక్రమ రవాణా వంటి సమస్యలే కృష్ణం వందే జగద్గురుంలో కూడా వున్నా ఈ చిత్రంలో బిగువుగా చూపించే ప్రయత్నం చేశారు గాని మొత్తం తేలిపోవడంతో అవి కూడా నిలవలేదు. పవన్ కళ్యాణ్ కామెడీపైనే దృష్టి పెట్టినా నిజానికి సీరియస్ సన్నివేశాల్లో బాగున్నారు.అత్తారింటికి దారేదిలో కూడా అదే జరిగింది.క నుక మంచి కథలు పట్టుగా తీస్తే బహుశా ఆయనకు చాలా ఆదరణ వుంటుంది. ఇప్పుడు లాంఛనంగా షూటింగ్ మొదలుపెట్టిన శరద్ మరార్ చిత్రం వార్తలు చదివితే అవి మళ్లీ పాత జానరే! ఫ్యాక్షన్ జానర్ ఇంకాపనిచేస్తుందని ఆయన అనుకుంటున్నారు. మళ్లీ కామెడీయే మెయిన్ అయికూచుంటుంది. మళ్లీ తంటాలు పడాలి.దానికి బదులు ఏదైనా కొత్తతరహా సమస్యతో లేదా పాయింటుతో తీస్తే అభిమానులు సంతోషిస్తారు. పవన్ కళ్యాణ్ ఈ వేషాలన్నీ కావాలంటే దాన్లోనేవేయొచ్చు!