వాస్తవికతను గుర్తించాలన్న పోప్
క్యాథలిక్ మత నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణతో సభ్యులను దూరం పెట్టడం కన్నా మారుతున్న జీవన పరిస్థితులను గుర్తించాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 8న జాయ ఆఫ్ లవ్ ప్రేమాస్పద సంతోషం అన్న విషయమై ఆయన మతాధికారులను ఉద్దేశించి పత్రం విడుదల చేస్తూ ఉపన్యసించారు. విడాకులు తీసుకున్న వారిని, పునర్వివాహాలు చేసుకున్న వారిని దూరం పెట్టడం కాదంటే గర్భస్రావం అన్నదే పాపం అన్నట్టుగా చూడటం గురించి నూతన ప్రతిపాదనలు చేశారు. మారే పరిస్తితులు తీవ్రమైన ఒత్తిళ్లు హింసా కాండ, నిరుద్యోగం వంటి బాధలు మనుషులను కుటుంబాలను ఎంతగానో ఘర్షణకు గురి చేస్తాయని గుర్తించాలన్నారు. మతాధికారులు మౌలిక నియమాలనే మొండిగా పట్టుకుని మానవీయ పరిస్తితులను చూడకుండా కళ్లు మూసుకోరాదన్నారు. మనం చెప్పిన దారికి భిన్నంగానడిచిన వారందరినీ రాళ్లు విసిరేనట్టుగా అవతల పెట్టడం మంచిది కాదు. కరుణతో ప్రేమతో అర్థం చేసుకోవాలి. గర్భధారణ,సంతానం విషయం పూర్తిగా ఆయా దంపతులకు వదలిపెట్టాలి. వారు తమ దైవభక్తిని బట్టి వాస్తవ పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని శిలాశాసనాలు తగవు అని హితవు పలికారు. .వాస్తవానికి క్రైస్తవ మతాధికారులు చేసిన అపరాధాలకు పోప్ చాలాసార్లు క్షమాపణలు చెప్పడం చూశాం. ఇప్పుడు ఏకంగా నియమావళి అమలులోనే పట్టువిడుపులు కావాలని చెప్పడం ఆసక్తికరం. ఒకవైపున అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ వంటి వారు రెచ్చగొట్టే చాందస ప్రసంగాలు చేసి మహిళల ఆగ్రహంతో వెనక్కు తగ్గుతుంటే పోప్ ప్రాన్సిస్ మాటలుపట్టువిడుపులు కావాలని చెప్పడం ఆసక్తికరం. తమ మతాధికారుల అపరాధాలకు పోప్‌లు క్షమాపణలు చెప్పడం చాలాసార్లు జరిగింది. అయితే ఇప్పుడు మౌలిక సూత్రాల అమలులోనే మానవీయమైన మార్పులు పట్టువిడుపులు వుండాలనడం కొత్త కోణం.