మహిళలకు ప్రవేశం హర్షణీయం

shani_2806612g
మహారాష్ట్రలోని శనిసింగాపూర్‌ దేవాలయ అంతర్భాగం చౌతారాలోకి మహిళలను కూడా అనుమతించాలని దేవాలయ ట్రస్టు నిర్ణయించింది. దీంతో గత కొంతకాలంగా నడుస్తున్న సంవాదం సంఘర్షణ ముగిశాయి. ఏప్రిల్‌ 1వ తేదీన బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు స్త్రీ పురుష వివక్ష లేకుండా అందరినీ అనుమతించాలని ట్రస్టు నిర్ణయించినట్టు ట్రస్టీలలో ఒకరైన సాయిరాం బంకర్‌ ప్రకటించారు. ట్రస్టు ప్రతినిధి హరిదాస్‌ గారువాలే దీన్ని ధృవీకరించారు. భూదేవి బ్రిగేడ్‌ పేరిట ఇక్కడ స్త్రీల ప్రవేశం కోసం ఉద్యమించిన తృప్తి దేశారు ఈ నిర్ణయంపై హర్షం వెల్లడించారు. త్రయంబకేశ్వర్‌లోని శివాలయం, కొల్లాపూర్‌లోని మహాలక్ష్మి ఆలయం నిర్వాహకులు కూడా ఈ విధంగానే వివక్షకు స్వస్తి పలికి అందరినీ అనుమతిస్తారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ విషయం గతంలో చెప్పుకున్నాం గనక మనం కూడా ఈ మార్పును స్వాగతిద్దాం. ఇతర మతాలు ఏం చేశాయి లేక గుడిలోకి వెళ్లడం గొప్ప విషయమా వంటి వివాదాలకన్నా స్త్రీల పట్ల గౌరవం ఆంక్షల తొలగింపు ఇక్కడ అర్థం చేసుకోవలసిన అంశాలు. ఈ మధ్యనే ఆరెస్సెస్‌ కూడా మనువాదాన్ని ఎవరైనా ఖండిస్తే వ్యతిరేకించకూడదని ఆధునిక పరిస్థితులకు అందులో పేర్కొన్న నిర్దేశాలలో అనేకం వర్తించేవి కావని చెప్పినట్టు కొంతమంది ఆ సంస్థకు చెందిన మిత్రులు తెలిపారు. ఇది అర్థం కాక కొంతమంది మరీ చాందసంగా మాట్లాడుతుంటారు గాని సంస్థ ఆమోదం వారికి వున్నట్టు కాదని వారు చెబుతున్నారు. ముందు ముందు మరింత బాహాటంగానే ఈ మార్పులు వెల్లడి కావచ్చు. స్త్రీల రుతుచక్రాలు, ప్రసవాలు పురుళ్లు ి దోషాలు కావు, మానవజాతి నిరంతరాయంగా కొనసాగడానికి అవసరమైన ప్రాకృతిక ప్రాతిపదికలు. పురుషాధిక్య సమాజం అది తెలిసి కూడా వారిని తక్కువ చేయడం మానవత్వం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *