శ్రీనగర్ ఎన్‌ఐటి దుష్పరిణామాలు
హెచ్‌సియు నుంచి జెఎన్‌యు వరకూ ఇంకా ఇతర చోట్ల తలెత్తిన అశాంతి చల్లారక ముందే సున్నితమైన జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని ఎన్‌ఐటిలో విద్యార్థుల మధ్య ఉద్రిక్తత పెరగడం ఎంతైనా ఆందోళన కలిగిస్తుంది. అందులోనూ టి20 క్రికెట్ మ్యాచ్ విజయాలపై విభేదాలు ప్రదర్శనలు ఇలాటి పరిస్థితికి దారితీయడం ఇంకా విడ్డూరం. సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించినప్పుడు క్రీడాభిమానులంతా సంతోషించారు. దానిపై విజయోత్సవ యాత్ర జరిపిన విద్యార్థులు భారత్ మాతాకు జై అనడంతో ఆగక పాకిస్తాన్ ముర్దాబాద్ అని కూడా నినాదాలిచ్చినట్టు సమాచారం. ఆ తర్వాత ఫైనల్‌లో భారత్ జట్టు వెస్ట్‌ఇండీస్ చేతిలో ఓడిపోయినా ఆటలో పెద్ద లోపం వుందని ఎవరూ అనుకోలేదు. నిజానికి ఆటల్లో గెలుపు ఓటములు సహజమే. దాన్ని దేశభక్తితో ముడిపెట్టి జాతీయతా సమస్యగా చూడటం ఈమధ్య పెరిగిన ధోరణి. ఏమైనా ఈ సమయంలో కాశ్మీర్‌కు చెందిన విద్యార్థులు భారత్ ఓటమిపై విజయోత్సవం జరపడం అనుచితం, అసందర్భం కూడా. ఇది ఏప్రిల్1న జరిగితే ఆ తర్వాత కూడా ఎన్‌ఐటి పరిస్థితి సజావుగానే సాగింది. అయితే ఏప్రిల్4న కాశ్మీరేతరుల బ్యానర్‌తో కొందరు ప్రదర్శన చేసి అంతకు ముందు జరిగిన ప్రదర్శనకు వ్యతిరేకంగా నినాదాలు చేశాక ఉద్రిక్తత పెరిగింది. జమ్మూలో హిందువులు కాశ్మీర్‌లో ముస్లిములు అధికంగా వుంటారు గనక దీన్ని హిందూ ముస్లిం సమస్యగా మార్చేపని క్షణాల మీద జరిగిపోయింది. జెఎన్‌యులో వలెనే ఇక్కడా దేశ ద్రోహం జాతిద్రోహం నినాదం ముందుకొచ్చింది. పోలీసులు లాఠీచార్జి చేయడం, విద్యార్థులపై దాడులు వీటితో పరిస్థితి అదుపు తప్పిపోయింది. ఆ తర్వాత సిఆర్‌పిఎప్ కూడా రంగ ప్రవేశం చేసింది. బయిటి విద్యార్థులకు రక్షణ లేకుండా పోయిందంటూ అక్కడి తెలుగు పిల్లలతో సహా ఫోన్లు చేయడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ సమయంలో వెనువెంటనే ప్రశాంతతను నెలకొల్పే చర్యలు తీసుకోవడం విద్యార్థుల మధ్య సుహృద్భావ వాతావరణం పునురుద్ధరించడం జరగాలి. జెఎన్‌యులోనూ ఇతర చోట్ల కాశ్మీర్ విద్యార్థులతో ఎబివిపి ఘర్షణ పడినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్వయంగా జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. కాశ్మీర్‌లో తీవ్రవాదం తారస్థాయిలో వున్నప్పుడు కూడా బయిటివారికి ఎలాటి ముప్పు కలగలేదని నిట్ విద్యార్థులు నిశ్చింతగా వుండొచ్చని ఆమె ప్రభుత్వం చెబుతున్నది.
Vౖాదరాబాదులో టిఆర్‌ఎస్, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాలు వున్నాయి గనక కేంద్ర బిజెపి చాలా కఠినంగానూ రాజకీయ దృష్టితోనూ హడావుడి చేసింది.కాశ్మీర్‌లో వారే అధికారంలో వున్నారు గనక ఆ వూపు కనిపించడం లేదు. మానవ వనరుల మంత్రిత్వశాఖ తరపున ఒక ప్రతినిధి వర్గాన్ని పంపించారు సృతి ఇరానీ. సిఆర్‌పిఎప్ కేంద్ర బృందం వచ్చాయంటే మెహబూబా ఎంత బాగా పనిచేస్తున్నారో తెలుస్తుందని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్డుల్లా దెప్పిపొడిచారు. ఏది ఏమైనా భారత పాక్ సంబంధాలలో కీలక స్థానంలో వున్న కాశ్మీర్‌లో పరిస్థితి చేజారి పోకుండా చూడటం అవసరం. ఉద్రేకాలలో దుష్ప్రచారాలలో దారితప్పిన విద్యార్థిబృందాలకు నచ్చజెప్పి ప్రశాంతత నెలకొల్పాలి. దీనిపై జాతి వ్యతిరేక ముద్ర వేసి వారిని మరింత దూరం చేసుకునే అనర్థదాయకమైన ఆలోచనలు దేశానికి హాని చేస్తాయి. నిజంగా ఏం జరిగింది ఎవరు ఏ ప్రదర్శనలు చేసి ఏం నినాదాలిచ్చారు వంటి వాటిపై సమగ్ర దర్యాప్తు జరిపి మరోసారి మరోచోట ఇలాటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలి. హెచ్‌సియులో ఇప్పటికీ చల్లారని రావణకాష్టం, జెఎన్‌యు విద్యార్థులపై రాజకీయ దాడి వంటివి కాశ్మీర్ నేపథ్యంలో అసలే మంచివి కావని అర్థం చేసుకోవడం అవసరం. అసలు క్రికెట్‌నూ దేశభక్తిని ముడిపెట్టడం, దాంట్లో గెలుపు ఓటములను బట్టి ద్వేషాలు రెచ్చగొట్టుకోవడం ఎవరికీ మంచిది కాదు. పాకిస్తాన్ ఓడితే విద్యార్థులకు ఒరిగేది వుండదు. అలాగే ఆ దేశం గెలిచిందని ఇక్కడ పండుగ చేసుకోవడం కూడా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది. ఇలాటివి ప్రేరేపించే ముస్లిం తీవ్రవాదులు, మజ్లిస్ ముస్లిం లీగ్ వంటి పార్టీల వైఖరి అనుమతించరానిది. అయితే ఆ ప్రచారానికి లోనైన యువతను విద్యార్థులను దేశద్రోహులుగా జాతి వ్యతిరేకులుగా చూడటం కూడా సరికాదు. ఇంతవరకూ కాశ్మీర్‌లో ఉగ్రవాద ప్రభావానికి గురైన యువతను దేశద్రోహులుగా కేంద్రం కూడా అభివర్ణించడం లేదని అర్థం చేసుకోవాలి. నిట్‌లో త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశించాలి.
