మోడీ వ్యాఖ్యలపై ఐరాస అనంగీకారం

modi un11
భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి బహిరంగంగా అనంగీకారం వెల్లడించాల్సి వచ్చింది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరులో అమెరికాతో పోటీ పడాలని దానితో కలసి పనిచేయడమే గాక మించి పోవాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న మోడీ బ్రస్సెల్స్‌లో సంస్థపై చేసిన వ్యాఖ్యలను సమితి ప్రధాన కార్యదర్శి బంకీ మూన్‌ ఉప ప్రధాన ప్రతినిధి ఫరాన్‌ హక్‌ తోసిపుచ్చారు. బ్రస్సెల్స్‌ విమానాశ్రయంలో ఐఎస్‌ఐఎస్‌ దాడి తర్వాత కొద్దిరోజులకు అక్కడకు ి వెళ్లిన సందర్భంలో మోడీ భారత మీడియాతో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితిపై అనేక విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఐరాస దగ్గర అన్ని వనరులు వున్నాయి. శక్తిసామర్థ్యాలున్నాయి. కాని ఉగ్రవాదం గురించిన సరైన నిర్వచనం లేదు. వుండాల్సిన అవగాహన ప్రణాళిక లేవు అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఫరాన్‌ హక్‌ స్పందన కోరినపుడు తమకు కావలసిన స్పష్టత వున్నదని సందర్భాన్ని బట్టి నిర్దిష్టంగా వ్యవహరించాల్సి వుంటుందని బదులిచ్చారు. మేము చాలా కాలంగా ఐరాసను ఉగ్రవాదానికి నిర్వచనం ఇవ్వాలని దాన్ని ఎదుర్కొనే మార్గాలు తెలపాలని కోరుతున్నాము. కాని ఫలితం లేదు. అది జరిగే వరకూ సమస్య పరిష్కారం కాదు అని మోడీ అన్నారు. హింసాత్మక ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రధాన కార్యదర్శి త్వరలో మాట్లాడతారు. దీనిపై మేము అంతర్జాతీయ సౌహార్దత కూడా కోరుకుంటాము అని ఐరాస ప్రతినిధి అన్నారు. పాకిస్తాన్‌పై చర్యల విషయంలో మోడీ అసంతృప్తి వెలిబుచ్చివుండొచ్చు గాని ఐరాస మొత్తం ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని స్పందించినట్టు కనిపిస్తుంది. బ్రస్సెల్స్‌ పర్యటనకు ముందు అణుభద్రత సమావేశంలోనూ మోడీ ఇలాటి ప్రసంగమే చేశారు. కాని చివరకు మాట్లాడిన అమెరికా అద్యక్షుడు బారక్‌ ఒబామా మాత్రం ఇండియా పాకిస్తాన్‌లను ఒకేగాట కట్టి మాట్లాడుతూ ఇరు దేశాలు అణ్వస్త్ర నిల్వలు తగ్గించుకోవాలని పిలుపునివ్వడం మోడీ వాదనకు బలం లేకుండా చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *