నాగపూర్‌ కౌన్సిల్‌చే హనుమాన్‌ చాలీసానా? ఈ దేశం హిందువులకేనా?

nmc111

జాతీయత సమస్యపై దేశమంతా మా వెంట వుందని బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా అసోం ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెబుతున్నారు. జాతీయతపై పోరాటం మొదటి ఘట్టం మేమే విజయం సాధించామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటిస్తున్నారు. ఇలాటి తరుణంలో బాంబే హైకోర్టు బిజెపి ఆధ్వర్యంలోని నాగపూర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ను  – ఈ దేశం హిందువులకేనా అని ఆగ్రహంగా ప్రశ్నించింది.మహారాష్ట్రలో రెండవ రాజధానిగా పరిగణించబడే నాగపూర్‌  కార్పొరేషన్‌ఎయిడ్స్‌ నియంత్రణ పేరిట హనుమాన్‌ చాలీసా గానం చేయాలని నిర్ణయించింది. గురువారం నాడు స్థానిక కస్తూర్‌చంద్‌ పార్కులో ఒక మత ధార్మిక సంస్థతో కలసి ఎయిడ్స్‌ వ్యతిరేక ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. పొద్దురామేశ్వరరావు మందిర్‌ ట్రస్ట్‌ అనే ఆ సంస్థతో కలసి నిర్వహించే ఈ అధికార కార్యక్రమంలో హనుమాన్‌ చాలీసాను గానం చేయడం ఏమిటని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ భూషణ్‌ గవారు, జస్టిస్‌ స్వప్న జోషి నిలదీశారు. మరి దాంతో పాటే ఖురాన్‌ బైబిల్‌ ప్రవచనాలు కూడా చదవొద్దా? వాటివల్ల ఆ మతాల వారు కూడా వస్తారు కదా? ఈ ఒక్కటే చదవడమంటే దేశం హిందువులకే అని అర్థం చేసుకోవాలా అని కోర్టు ప్రశ్నలు కురిపించింది.
ఈ విషయమై జనార్థనమాన్‌ అనే మాజీ కౌన్సిలర్‌ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఆగ్రహించడంతో మున్సిపల్‌  కార్పొరేషన్‌లో బిజెపి నాయకుడైన దయాచంద్‌ తివారీ మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యతిరేక కార్యక్రమానికి హనుమాన్‌ చాలీసా గానానికి సంబంధం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడికి సంతృప్తిచెందని కోర్టు రెండింటి మధ్యన తప్పక గంట వ్యవధి వుండేలా చూడాలని ఆదేశించింది. అయోధ్యలో భజనలు మాత్రమే చేస్తామని సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన బిజెపి అగ్రనేతలు అప్పటి యుపి ముఖ్యమంత్రి కళ్యాణ్‌సింగ్‌ తర్వాత ఏం చేశారో దేశమంతటికీ తెలుసు. దానికి గాను కోర్టు ఆయనకు ఒకరోజు శిక్ష విధించింది కూడా. మరి ఇప్పుడు నాగపూర్‌ నాయకులు ఏం చేస్తారో చూడాల్సిందే. అందులోనూ నాగపూర్‌ అచ్చంగా ఆరెస్సెస్‌ కేంద్ర స్థానమాయె! .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *