బిఎంకెజె -జాతీయ గీతాల జగడం

కాదేదీ కలహానికనర్హం అన్నట్టే ఆరెస్సెస్ బిజెసి సంఘ పరివార్ దైనందిన జీవిత సమస్యలతో నిమిత్తం లేని ఏదో ఒక నిరర్థక వివాదం ముందుకు తెస్తూనే వుంటుంది. మళ్లీ వాళ్లలో వాళ్లే పరిపరివిధాలుగా మాట్లాడుతూ గజిబిజి సృష్టిస్తుంటారు. జెఎన్‌యు ఘటనల తర్వాత భారత్ మాతాకీ జై(బిఎంకెజె) అనే వారే దేశంలో వుండాలని ఒక పల్లవి ఎత్తుకున్నారు. మొదట సాక్షాత్తూ మోహన్ భగవత్‌గారే ఈ తరహాలో మాట్లాడి దిశానిర్దేశం చేశారు. అప్పటి నుంచి చోటా మోటా నాయకుల నుంచి బిజెపి బడానేతల వరకూ ఇదే ఇదే ప్రకటిస్తూ ఉద్రిక్తత పెంచారు. నిజానికి రాజ్యాంగంలో ఎక్కడా ఆ విధమైన నిబంధనలేదు. జైహింద్; హిందూస్తాన్ జిందాబాద, బోలో స్వతంత్ర భారత్‌కీ జై ్ వంటి నినాదాలు తప్ప ప్రత్యేకంగా బిఎంకెజె గురించి పట్టు పట్టింది లేదు. అయితే జనగణమన కన్నా వందేమాతరం గీతం ఉత్క్రష్టమైందంటూ ఆరెస్సెస్ పరివారం మొదటి నుంచి అనేక ఆరోపణలు చేస్తున్నది. వందేమాతరం పాటకు స్పష్టమైన మతపరమైన నేపథ్యం వుంది. అయితే దేశ స్వాతంత్ర పోరాటంలో ఆ మాట బాగా పనిచేసింది గనకనే రాజ్యాంగ నిర్మాతలు ఎంతగానో చర్చించి చివరు జనగణమన పాటను జాతీయం గీతంగా చేశారు. ఇది బ్రిటిష్ చక్రవర్తిని కీర్తిస్తూ రాశారని బిజెపి ఆరోపించినా పట్టించుకున్న వారు లేరు. ఎందుకంటే అది నిజం కాదని అందరికీ తెలుసు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఠాగూరు దాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. అందకు ముందు కాంగ్రెస్ జాతీయ సభల్లో పాడారు. దాంతో పోలిస్తే వందేమాతరం నినాదం ప్రసిద్దమైనా ఆ పాటలో మతపరమైన అంశాలు చాలా వున్నాయి గనకే జాతీయ గీతంగా తీసుకోలేదు. కాని బిజెపి వారు ఎప్పుడు అధికారంలో వున్నా వందేమాతరం ఒక వివాదాస్పద అంశం చేస్తుంటారు. దాని కొనసాగింపుగా భారత్ మాతాకు జై నినాదం తెచ్చారు. రాజ్యాంగంలో అది తప్పనిసరికాదు గనక వూరికే వివాదం పెంచుకోవడం సరికాదని ఎంతగా చెప్పి
నా అర్ఠం కాలేదు. అయితే ప్రజల్లో నిరసన చూసిన తర్వా అగ్రనేత అద్వానీ మాత్రం దీనిపై వివాదం తగదని చెప్పారు. ఈ లోగా మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ దాన్ని తాను పాడబోనని అన్నారు. అది వారి ఇష్టం. జైహింద్ అంటామని చెప్పడమే గాక ఆ నినాదంతో ఒవైసీ సోదరుల ఫ్లెక్సీలుకూడా అమర్చారు.రేపు మెహబూబా మఫ్తి కూడా పాడకపోవచ్చు. ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ కూడా ఇష్టమైన వారినే పాడనివ్వండి ఒత్తిడి చేయొద్దు అని సూచించారు. ఆయన సర్దుకున్నా కూడా ఆధునిక రాజకీయవేత్తగా న్యాయశాస్త్ర కోవిదుడుగా పేరొందిన అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు వంటివారు వివాదం కొనసాగిస్తూన్నారు.
నిజానికి స్వాతంత్ర పోరాట కాలంలో వందేమాతరం నినాదం వుందేగాని భారత్ మాతాకు జై ప్రధానంగా లేదు. దేశాన్ని మాతృభూమిగా పితృభూమిగా వర్ణించడం మనవాళ్లు పాశ్చాత్య నాగరికతగా నిరసించే యూరప్‌నుంచే వచ్చింది. పురాణ కావ్యాల్లో భారతదేశం అనే మాట వుంది గాని భారత మాత లేదు. (తర్వాత అదే తెలుగు తల్లి తెలంగాణ తల్లి వంటి రూపాలు తీసుకుంది) నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో గ్రంధంలో భారత మాత ప్రస్తావన చేశారుగాని 1947 ఆగష్టు 15 ప్రసంగం చివరలో జైహింద్ అని మాత్రమే అన్నారు. రాహుల్ గాంధీ బిఎంకెజె అనకపోయినా జైహింద్ అనైనా అన్నారంటే అది తమ జాతీయవాద విజయమని అరుణ్‌జైట్లీ ఆనందపడటం ఆశ్చర్యం కలిగిస్తుంది.మీడియా ప్రముఖులు కరణ్ థాపర్ కూడా బిఎంకెజె అనకపోయినంత మాత్రాన దేశభక్తి లేనట్టుకాదని తేల్చిచెప్పారు. రాజ్యసభలోనైతే దీనిపై చాలా చర్చనే జరిగింది. అయినా సరే ఆ మాటనే పట్టుకుని మంటలు పెట్టాలని చూస్తే ఏం చేస్తాం? వాక్ స్వాతంత్రం అంటే మౌనంగా వుండే హక్కు కూడా.జనగణమన వేసినప్పుడు లేచి నిల్చుంటే చాలునని, పాడకపోయినంత మాత్రాన శిక్ష వేయలేమని సుప్రీం కోర్టు చెప్పింది. అధికారిక జాతీయ గీతం విషయంలోనే ఇలా వుంటే ఇక సంఘ పరివార్ ఆదేశిత గీతాన్ని ఎందుకు రుద్దడం? ఎందుకు రభస చేయడం?