ఎకరాకు 3.7 కోట్లు పరిహారమిచ్చిన కేజ్రీ
అమరావతిలో భూసమీకరణ పేరిట 2013 భూసేకరణ చట్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. మార్కెట్ రేటుకు రెట్టింపుగా పరిహారం ఇవ్వడమే గాక 70 శాతం మంది ఆమోదం వుండాలనీ, భూ యజమానులు కాని వారికి కూడా ఉపాధి కల్పించాలని అనేక షరతులు వున్నా వాటిని పక్కకు పెట్టింది. వాణిజ్య కేంద్రాల్లో స్థలం ఇస్తామని ఆశచూపి 36 వేల ఎకరాలు రాబట్టింది. ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది ఢిల్లీలోని కేజ్రీవాల్ ఆప్ ప్రభుత్వం. అక్కడ ఢిల్లీ మెట్రో కోసం సిరస్‌పూర్ ప్రాంతంలో తీసుకున్న భూమికి సరైన పరిహారం రాలేదని 2013 నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆప్ ఎంఎల్‌ఎ కూడా అందుకు మద్దతు తెలిపి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రెండవ సారి అధికారంలోకి వచ్చాక కేజ్రీవాల్ ప్రభుత్వం ఆరునెలల పాటు అధ్యయనం జరిపి చివరకు ఎకరాకు మూడు కోట్ల 70 లక్షలకు పరిహారం పెంచింది.అంతకు ముందు కేవలం 58 లక్షలు మాత్రమే ఇచ్చిన దాన్ని ఇంత భారీగా పెంచడంతో రైతుల ఆనందానికి మేర లేదు. ఇటీవల జరిపిన సర్వేలో మాణిక్ సర్కార్(త్రిపుర ముఖ్యమంత్రి) లేదా కేజ్రీవాల్ లాటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు చెప్పారంటే ఇలాటి కారణాలే వుంటాయి. పంజాబ్ ఎన్నికల్లో కూడా ఆప్ విజయంసాధిస్తుందని కొన్ని సర్వేలు చెప్పడంతో ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ నిప్పులు తొక్కుతున్నట్టు సమాచారం. ఏదైనా తప్పొప్పులున్నా ప్రజలతో నిలబడితే వారే ఆదరిస్తారు. ఎపిలో ప్రతిచోటా విచ్చలవిడిగా సాగుతున్న భూ సేకరణ ప్రక్రియలో కేజ్రీ అనుసరించిన పరిహార సూత్రాన్ని పాటించి పునరావసం పూర్తయిన తర్వాతనే స్వాధీనం చేసుకోవడం ప్రజాస్వామికం అనిపించుకుంటుంది.
