జగన్ వైఖరిలో మార్పు రావద్దా?

వైఎస్సాఆర్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగడానికి కారణం జగన్ ఏకపక్ష పని విధానమేనని ప్రత్యర్థులు ఎప్పుడూ అంటుంటారు. దానికి తగినట్టే చాలామంది వెళ్లిపోయిన తర్వాత కూడా ఆయన ఎలాటి సమీక్షా ధోరణిలో మాట్లాడకపోగా నేనూ అమ్మ మాత్రమే బయిలుదేరాం, మమ్ముల్ను చూసే ఓటేస్తారన్నట్టు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం భారీగా సొమ్ము ముట్టజెప్పడం, భవిష్యత్తులో ఆ నేతలకు వారి వర్గానికి పదవులు అవకాశాలు కల్పించడం వల్లనే వెళ్లిపోతున్నారని ఆయన అనుయాయులు విమర్శిస్తున్నారు. ఇందులో కొంత నిజం వుంది కూడా. దీన్నే నేను పేమెంటు అగ్రిమెంటు కమిట్మెంటు ఈ ఫిరాయింపుల వెనక వున్నాయని అంటుంటాను. అయితే రాజకీయ పరిస్థితిలో వచ్చిన మార్పు కూడా ఇందుకు దోహదం చేస్తున్నదని చెప్పక తప్పదు. 2014 ఎన్నికలకు ముందు జగన్ విజయం గురించి బలమైన అంచనాలే వుండేవి. సర్వేలు కూడా అలాగే వచ్చేవి. మరోవైపున రెండు వరస ఓటముల తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ సారి గెలవకపోతే పార్టీని కాపాడుకోలేమన్న ఆందోళనతో పనిచేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి పెట్టారు. మతతత్వ విమర్శలున్న బిజెపితో చేతులు కలిపి అప్పుడు మోడీపట్ల వున్న ఆకర్షణను ఉపయోగించుకున్నారు. అలా మొత్తానికి మూడవసారి ప్రమాణ స్వీకారం చేయగలిగారు. అప్పటివరకూ ముఖ్యమంత్రి కావడం తప్ప మరో వూహనే దగ్గరకు రానివ్వని జగన్ ఈ తీర్పు తర్వాత తమ కార్యాచరణను నిర్ణయించుకోవడానికి సమయం పట్టింది. తెలుగుదేశం పొరబాట్లు చేస్తున్నా ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి వున్నా వాటివల్ల వైసీపీ ప్రయోజనం పొందకుండా చంద్రబాబు చాలా పకడ్బందీగా వ్యూహం నడిపించారు. నియోజకవర్గాల్లో అన్నీ తెలుగుదేశం కనుసన్నల్లో నడిచేలా అధికారికంగానే ఏర్పాటు చేశారు. దీంతో గెలిచిన వైసీపీ ఎంఎల్ఎలు కూడా ఏమీ చేయలేని చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది.జగన్ ఆర్థిక సహాయం చేయడం ఎప్పుడూ లేదు.దాంతో తమ అనుయాయులను నిలబెట్టుకోవడం కూడా పెద్ద సమస్యగా మారిందని ఎంఎల్ఎలు వాపోయేవారు. పైగా వారిలో చాలా మంది కొత్తవాళ్లు, ఎస్సి ఎస్టిలు కావడంతో బలీయమైన పాలక పక్షాన్ని తట్టుకోవడం సమస్యగానే మారింది. మరో నాలుగేళ్లవరకూ ఏ ఎన్నికలు లేవు కూడా. అప్పటి వరకూ వున్నా జగన్ తర్వాత కూడా తమకే టికెట్ ఇస్తారన్న హామీ లేదు. సభలోనూ ఆయన తమకు అవకాశం ఇవ్వడం చాలా తక్కువ. ఈ నేపథ్యంలో పాలకపక్షంలోకి దూకి రాజకీయ మనుగడ నిలుపుకోవాలన్న ఆలోచన వైసీపీలో బాగా పాకింది. అలాటి వారందరినీ తెలుగుదేశం తీసుకుని వైసీపీని నిరుత్సాహపర్చడంతో పాటు పని అయిపోయిందనే సంకేతాలు పంపించాలని వ్యూహం వేసింది. పాలక పక్ష ఎంఎల్‌ఎలూ తనతో టచ్‌లో వున్నారని ప్రభుత్వాన్ని పడగొట్టడానికి తగినంత మంది వస్తే మీడియాకు చెబుతానని వ్యాఖ్యానించిన జగన్ తన వారినే నిలబెట్టుకోలేకపోయారు. గత కొద్ది రోజుల్లోనూ వివిధ సందర్బాల్లో పదిమందికి పైగా వైసీపీ ఎంఎల్ఎలతో మాట్లాడితే జగన్ చేసేదే కరెక్టు అని గట్టిగా అన్నవారెవరూ లేరు. టిడిపి మాజీ ఎంపి ఒకరు మా సమక్షంలోనే వైసీపీ ముఖ్య నేతను ఆహ్వానించారు. ఆయన మాత్రం తనకు టికెట్ ఇచ్చిన జగన్‌ను వదలి వెళ్లనని చెప్పారు. అదే సమయంలో మీరు విమర్శనాత్మకంగా మాట్లాడాల్సిందే సార్ అంటూ నాతో అన్నారు. మంత్రి పదవి తలుపు తడుతున్నట్టు చెప్పే ఒక వైసీపీ ఎంఎల్ఎ కూడా ఆ కథనాలను ధృవీకరించారు. కనుక ఆ పార్టీలో అసంతృప్తి యథార్థం. ఇంత మందిని తీసుకోవడంపై తెలుగుదేశంలోనూ కొంత అసంతృప్తి వుంది గాని ప్రతిపక్షం బలహీనపడితే మంచిదేనని సరిపెట్టుకుంటున్నారు. కేంద్రం అసెంబ్లీ సీట్లు పెంచితే అవకాశం వస్తుందని చాలామంది ఆశపెట్టుకుని వున్నారు. ఏది ఏమైనా జ్యోతుల నెహ్రూ బృందమే గాక మరో అరడజను మంది వైసీపీ ఎంఎల్ఎలు గోడ దూకే అవకాశం వుంది. వారిని అపగల శక్తి జగన్‌కు లేదు. అంత బలమైన ఉద్దేశం కూడా లేదు. ప్రధాన ప్రతిపక్షమే గాక సభ వరకూ ఏకైక ప్రతిపక్షంగా వున్న వైసీపీకి పాలక పక్షంకన్నా రెండు శాతం తక్కువే ఓటింగు తెచ్చుకున్నది. ప్రజల పట్ల దానికీ చాలా బాధ్యత వుంది. అధికార పక్షం తప్పులపై పోరాడటంలో అధినేత లోటుపాట్లు సరిచేసుకోకుండా సంక్షోభంలో పడిపోతే ఓటేసిన వారి విశ్వాసం వమ్మవుతుంది. జగన్ సందర్శనలు శాసనసభలో గాని బయిట గాని విమర్శలు తప్పిస్తే ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేవడమనే మార్గం వైసీపీ ఎంచుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కొత్తవారైనా చిన్నవారైనా పార్టీ ఎంఎల్ఎలకు అవకాశాలిచ్చి ప్రొత్సహించడం, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాటించడం అవసరం.