ఒక నిముషం అద్బుతం!
సమాజంలో-సంస్థల్లో ఆఖరుకు కుటుంబాలలో ఎక్కడైనా సరే, అనుకున్న లక్ష్యాలను సాధించడం కన్నా సంతోషం వుండదు. ప్రతిచోటా లక్ష్యాలను రూపొందించేందుకు, అమలు చేయించేందుకు నాయకులు, నిర్వాహకులు వుంటారు. సంస్థల్లోనైతే మేనేజర్లు కీలక పాత్ర వహిస్తుంటారు. వారు అందరి సహకారం పొందడంలో విజయం సాధిస్తేనే అనుకున్న లక్ష్యాలు అందుకోగలుగుతారు. కార్పొరేట్ సంస్థలు తమ సిబ్బంది నుంచి గరిష్ట స్థాయిలో ఫలితాలు రాబట్టి లాభాలు పెంచుకోవడానికి నిరంతరం ఏవేవో ప్రయోగాలు చేస్తూనే వుంటాయి. సిబ్బందికి ఎలా ప్రేరణ నివ్వాలి అనే దానిపై నిరంతరం చిట్కాలు చెబుతూనే వుంటారు. వారి లాభార్జనా కోణం నుంచే ఈ సలహాలు వుంటాయి. అయినా ఉపయోగకరమైన అనేక అంశాలు వాటిలో కనిపిస్తాయి. వాటికి విశేషమైన ఆదరణా వుంటుంది. ఆ విధంగా ప్రసిద్ధికెక్కిన పుస్తకాలలో కెన్నెత్ బ్లాంచర్డ్, స్పెన్సర్ జాన్సన్ రచించిన ‘వన్ మినిట్ మేనేజర్’ ఒకటి. మేనేజిమెంటుకు సంబంధించిన విజయ రహస్యాలను తెలుసుకోవడానికి ఒక యువకుడు చేసిన అన్వేషణే ఇది. మంచి మేనేజర్ అంటే ఎవరు? ఎలాంటి పద్ధతులు అనుసరించాలి? అన్న ప్రశ్నలకు సమాధానంగా అత్యంత విజయవంతమైన ఒక మేనేజర్ అనుభవాలు చెబుతున్నట్టుగా ఈ పుస్తకం నడుస్తుంది.
తన అధ్యయనంలో భాగంగా ఆ యువకుడు రకరకాల మేనేజర్లను కలుసుకుంటాడు. బాగా కఠినుడైన, నిరంకుశుడైన మేనేజర్‌గా పేరొందిన వారిని చూస్తే వారి దగ్గర సిబ్బంది నిర్జీవంగానూ, నిర్లిప్తంగానూ వుంటారు. బాగా మృదువైన, కలుపుకు పోయే స్వభావం గలిగిన మేనేజర్‌గా పేరొందిన వారిని కలిస్తే అక్కడ సిబ్బందిలో అవకతవకలు మెండుగా వుంటాయి. రెండు చోట్లా అసంతృప్తి చెందిన ఆ యువకుడు ఒక గొప్ప మేనేజర్ గురించి వింటాడు. అతను చాలా అద్భుత విజయాలు సాధించాడని తెలుసుకుని అతన్ని కలుసుకోవాలనుకుంటాడు. అతనికి ఫోన్ చేస్తే ఆశ్చర్యకరంగా స్వయంగా అందుకుంటాడు. కలుసుకోవడానికి ఎప్పుడు రావాలని అడిగితే బుధవారం ఒక గంట సేపు తప్ప ఎప్పుడైనా రావచ్చునంటాడు. దాంతో మరింత ఆశ్చర్య పోతాడు.
సరే ఆ కార్యాలయానికి వెళ్లే సరికి ఆ మేనేజర్ తీరిగ్గా కిటికీలోంచి బయటకు చూస్తుంటాడు. ఇతను తను వచ్చినట్టు తెలిసేందుకు మెల్లగా దగ్గగానే ఆహ్వానిస్తాడు. తనకు కావలసినంత తీరిక వుంటుందని, బుధ వారం గంట సేపు మాత్రం తన సహాయకులతో సమీక్ష జరిపి వారి లక్ష్యాల సాధనలో ఏ మేరకు విజయం సాధించారో వింటానని చెబుతాడు. దాన్నిబట్టి మీరు ఎలాంటి మేనేజరు అని ఆ యువకుడు ప్రశ్నలు కురిపిస్తే అడిగిందే అడగొద్దంటాడు. తను ప్రజలను ఫలితాలను కూడా పట్టించుకుంటానంటాడు. ”తమను తాము మంచిగా పరిగణించుకోగల ప్రజలు మంచి ఫలితాలు సాధించగలరు’ అన్న సూక్తి రాసి వున్న ఫలకం అందిస్తాడు. రాశి వాసి (క్వాంటిటీ, క్వాలిటీ) రెండూ ముఖ్యమేనని, రెండూ కలిసిందే ఉత్పాదకత అని వివరిస్తాడు. ఇవన్నీ చేసే మిమ్మల్ను మీరు ఏ విధంగా భావించుకుంటారు అంటే ఒక నిముషం మేనేజర్ అని తడుముకోకుండా చెప్పేస్తాడు. తన సిబ్బంది నుంచి మంచి ఫలితాలు రాబట్టడానికి తాను చాలా తక్కువ సమయం తీసుకోవడం వల్ల ఈ పేరు వచ్చిందన్న మాట. ఇదెలా సాధ్యమని అడిగితే వెళ్లి తన సహాయకుల నుంచి తెలుసుకొమ్మని అంటూ కొన్ని పేర్లు సూచిస్తాడు.
యువకుడు మొదట ట్రెనెల్ అనే సహాయకుడిని కలుస్తాడు. ఒక నిముషం లక్ష్య నిర్దేశం మొదటి మెట్టు అని అతను చెబుతాడు. చాలా చోట్ల మనం చేసే దానికి మనం చేయవలసిన పనిగా మనం అనుకుంటున్న దానికి మన నుంచి మేనేజిమెంటు ఆశిస్తున్నదానికి పొంతనే వుండదు. అందుకే ఇక్కడ నిముషంలో లక్ష్య నిర్ణయం జరగాలి. 250 పదాల లోపు మీ లక్ష్యం, దాన్ని సాధించే తీరు వగైరాలు రాసి మేనేజర్‌కు ఇవ్వాలి. ఆ కాపీ ఉభయుల దగ్గరా వుంటుంది. దాని ఆధారంగా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం జరుగుతుంది. అందులోనూ ఆయన 80-20 ఫార్ములా పాటిస్తాడు. అంటే 20 శాతం లక్ష్యాల నుంచే ముఖ్యమైన 80 శాతం పలితాలు కలుగుతాయి. మేము మా ముఖ్యబాధ్యతలకు సంబంధించిన ఆ 20 శాతం విషయాలలోనే లక్ష్య నిర్దేశం చేసుకుంటాము. బహుశా అవన్నీ కలసి ఆరు వరకు వుండొచ్చు. అయితే మధ్యలో ఏవైనా ప్రత్యేక పథకాలు వస్తే మేము ప్రత్యేకమైన ఒక నిముషం లక్ష్యాలు నిర్ణయించుకుంటాము. సమస్య గుర్తిస్తే ఆయనకు తెలియజేస్తాము.అయితే ఆయన వెంటనే సమస్యకు పరిష్కారం అడుగుతాడు. మొదట్లో మాత్రమే సలహా ఇచ్చేవాడు. ఏదైనా బాగాలేదు అని చెబితే అయితే ఎలా వుంటే బావుంటుంది అని అడిగాడు..అంటూ ఒక నిముషం మేనేజర్ సూత్రాలలో మొదటిదాన్ని చెబుతాడు.
రెండో సూత్రం తెలుసుకోవడానికి లెవీ దగ్గరికి వెళతాడు యువకుడు. ఇతనిది ఒక నిముషం ప్రశంస విభాగం. ఎవరైనా ఏదైనా పని చక్కగా చేస్తుంటే పట్టుకోవడం తన పని అంటాడతను. తప్పు చేస్తుంటే పట్టుకోవాలి గాని చక్కగా చేస్తే పట్టుకోవడం ఎందుకంటాడు యువకుడు.అప్పుడు అతను వివరిస్తాడు. ఎంత చిన్నపనైనా బాగా చేసేవారిని పట్టుకుని అభినందిస్తే అది వారికి ప్రేరణ అవుతుంది. అయితే అది పని ప్రారంభించిన మొదటి దశలో లేదా కొత్త కార్యక్రమం చేపట్టినపుడు లేదా నూతన బాధ్యతలు స్వీకిరించినపుడు ఎక్కువగా జరుగుతుంది. అంతేగాక మంచి ఫలితాలు సాధించిన వారిని కరచాలనంతో, అభిమానంగా వెన్నుతట్టడం ద్వారా ప్రోత్సహించాలి.
మూడవ సూత్రం ఒక నిముషం మందలింపు. శ్రీమతి బ్రౌన్ చెబుతుంది. ఏదైనా సరిగ్గా లేనప్పుడు అందుకు కారకులైన వారిని వెంటనే మందలించాలి. వారి పొరబాటు ఏమిటో స్పష్టంగా చెప్పాలి. ఆ పొరబాటు మీపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలియజేయాలి. మీ మనోభావాలు వారికి అర్థం కావడానికి మధ్యలో కొన్ని సెకన్లు విరామం ఇవ్వాలి. అయితే తర్వాత దశలో వారితో కరచాలనం చేయడమో, సున్నితంగా స్పృశించడమో జరగాలి. తద్వారా మీరు వారితోనే వున్నామని భరోసా ఇవ్వాలి. వారికి మీరు ఎంత విలువ ఇస్తున్నారో ఎరుక పర్చాలి. మీరు వారి గురించి మంచి అభిప్రాయం కలిగివున్నా ఈ సమయంలో మాత్రం వారు చేసింది మీకు నచ్చలేదని అర్థమయ్యేట్టు చేయాలి. మందలింపు ఒకసారి పూర్తయిన తర్వాత అయిపోయినట్టేనని కూడా మీరు గుర్తుంచుకోవాలి.
ఇవన్నీ విన్న తర్వాత అవి ఎలా పని చేస్తున్నాయో తెలుసుకోవడానికి యువకుడు మళ్లీ మేనేజర్ దగ్గరకు వెళతాడు. మేనేజిమెంటు అందరూ అనుకునేంత కష్టం కాదంటాడు అతను. అయితే ఉద్యోగుల జీతాలపై ఖర్చు చేసే సంస్థలు వారికి శిక్షణ నివ్వడంపై ఖర్చు చేయకపోవడం అసలు సమస్య అని వివరిస్తాడతను. చాలా సంస్థల్లో ఎలా పనిచేయాలో చెప్పరు. వారికి తెలియదా అని సరిగ్గా చెప్పకుండా, అవకాశమున్న సాధనాలు కూడా అందించకుండా ఫలితాలు రాలేదని నిందించడం నిరర్థకం. అందరిలో విజేతలుంటారు. కాని కొందరు పరాజితుల వేషం వేసుకుని కనిపిస్తారు. పక్షులను బంధించి వాటికి తిండిని చేరుకునే మార్గాన్ని నేర్పించకపోతే అవి చివరకు తిండే వదులుకుని స్తబ్దతలో పడిపోతాయి. అయితే శిక్షణ అనేది దశల వారీ ప్రక్రియ. ఉదాహరణకు డాల్ఫిన్ చేపలు నీటిపై ఎత్తుగా ఎగరడం చూస్తాం. కాని ముందు వాటికి నీటిలోనే బోలెడు శిక్షణనిస్తారు. ఇదే విధంగా సంస్థలలో కూడా సిబ్బందికి ముందు చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశిస్తూ వారి స్థాయి సామర్థ్యం పెంచాలి. చిన్న ముందడుగునైనా అభినందించాలి. అలాగే తప్పులను విమర్శించాలి. కాని చాలా సంస్థలలో ఇలా చేయకుండా ఎప్పుడో సమీక్ష తరుణంలో చెబుదామన్నట్టుగా వేచి వుంటారు. నిర్వహణలో మెతకదనం కాఠిన్యం రెండూ అవసరమేనంటూ ఒక కథ చెబుతాడు. విమర్శలు చేయడంతో పాటు వారి గురించిన మన అంచనాలు అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పవలసిందేనంటాడు. మనం మన ప్రవర్తన అన్నది నిజమే. అయితే మనం మన ప్రవర్తనకు మేనేజర్లం కూడా అని ఒక సూత్రం చెబుతాడు. తర్వాత ఆ యువకుడు అక్కడే చేరి తనూ ఒక నిముషం మేనేజర్ అవుతాడు. మీరు నేర్చుకున్నది ఇతరులతో పంచుకోండి అన్న సూత్రాన్ని అతను జోడిస్తాడు. పుస్తకం అత్యంత సరళంగా సాగుతుంది.
