నేతాజీ ప్రసంగ ప్రహసనం!

నేతాజీ పైళ్ల పేరుతో నిరాధార హడావుడి చేస్తున్నారని గతంలో చెప్పుకున్నాం. అయితే దీన్ని విరమించేందకు మోడీ ప్రభుత్వం సిద్ధపడటం లేదు. 1945 ఆగష్టు 18 విమాన ప్రమాదం తర్వాత కూడా నేతాజీ రేడియోలో ప్రసంగించినట్టు ఆధారాలు దొరికాయని ఇప్పుడు ఒక కథ ప్రచారమవుతున్నది. ఇది అధికారికమైంది గానీ, ఆ నాటిది గానీ కాదు. పిసికార్ అనే వ్యక్తి 1992లో రాసిన లేఖలో ఈ సంగతి పేర్కొన్నారు. ఆయన బెంగాల్ గవర్నర్ ఆర్జి కేసీ దగ్గర పనిచేసేవాడట. మరణవార్తలు వచ్చిన తర్వాతనే 1945 డిసెంబరు,తదుపరి జనవరి ఫిబ్రవరి నెలలో ఈ ప్రసంగాలు చేశాడన్నది ఆ లేఖల సారాంశం. నేను సుభాస్ చంద్రబోస్‌ను మాట్లాడుతున్నాను, సజీవంగా వున్నాను అని ఆయన చేసిన ప్రసంగం గవర్నర్ కార్యాలయంలో రికార్డింగు యంత్రాంగంలో నమొదైందని పిసికార్ రాయడం మినహా నిజంగా వేరే ఆధారాలు లేవు. మరి ఆయన దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఈ లేఖ ఎందుకు రాసినంత మాత్రాన నిజంగా ఆ ప్రసంగం చేసినట్టు ధృవీకరించడానికి ఆవకాశమే లేదు. ఈ పత్రాలు విడుదలైన తర్వాత హిందూ ప్రతినిది బ్రిటన్‌లో పరిశోధన చేస్తున్న నేతాజీ మనవడు సుగత్ బోస్‌ను వీటి వల్ల కొత్తగా ఏదైనా తెలిసినట్టు భావించాలా అని అడిగితే ఆయన నో అని ఒక్క అక్షరంలో చెప్పేశారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబాసు 1983లో ఇందిరాగాంధీకి రాసిన లేఖ కూడా ఈ ఫైళ్లలో వుంది. బ్రిటన్‌లో నిర్మాణమైన స్ప్రింగింగ్ టైగర్ అనే చిత్రంలో నేతాజీని కించపర్చేలా చిత్రించినట్టు వార్తలున్నందున ఇక్కడకు రాకుండా ఆపవలసిందిగా బాసు ఆ లేఖలో కోరారు. భారత దేశం పట్ల గౌరవం లేని ఇంగ్లీషు రచయిత నీరద్ సి.చౌదరితో ఈ చిత్రానికి రాయించుకోవడం బట్టే నిర్మాతల స్వభావం తెలుస్తుందని కూడా బాసు ఆ లేఖలో రాయడం విశేషం. నేతాజీ ఏ దశలోనూ మా దేశంలో లేరని రష్యా నుంచి వచ్చిన లేఖ కూడా ఈ ఫైళ్లలో వుంది.