పఠాన్‌కోటపై పదిమాటలు!

దేశభద్రత అంటూ నిరంతరం హడావుడి చేసే నరేంద్ర మోడీ ప్రభుత్వం గానీ.దాని వివిధ విభాగాలు గానీ అత్యంత సున్నితమైన పఠాన్‌కోట దాడి విషయంలోనే అంతులేని అయోమయానికి గురవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కేసులో పాకిస్తాన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశాము గనక మేమే వచ్చి దర్యాప్తు చేసుకుంటామని ఆ దేశం కోరితే మన ప్రభుత్వం అంగీకరించింది. ఖాట్మండులో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పాక్ విదేశాంగ మంత్రి సత్రాజ్ అజీజ్‌ను కలిసినప్పుడు ఈ అంగీకారం కుదరింది. ఈ మేరకు దర్యాప్తు బృందం వస్తుంది కదా అని పార్లమెంటులో అడిగితే హొం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనకు దీనిపై సమాచారం లేదన్నారు! సరే ఏదైతేనేం వీసాలు ఇచ్చారు.పాక్ నిఘా విభాగం ప్రధానాధికారి మహ్మద్ తహిరాన్ తహి నాయకత్వంలో ఆ బృందం రానే వచ్చింది.జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) వారిని ఆహ్వానించింది. అయితే ఈ వచ్చిన వారిని కీలక ప్రాంతాలలోకి అనుమతించబోమని రక్షణ శాఖా మంత్రి మనోహర్ పరిక్కర్ మొదట ప్రకటించారు. అయితే నేరం జరిగిన ప్రాంతాలను గతంలోనే అప్పగించామని, ఎక్కడకు తీసుకెళ్లాలో వారే నిర్ణయిస్తారని ఆయనే చెప్పారు. దాంతో తమకు సంబంధం లేదన్నారు. రక్షణ శాఖ వారిని తీసుకురాలేదని కూడా చెప్పారు. . ఈ బృందం పఠాన్‌కోట ప్రాంతం చూసి తర్వాత దర్యాప్తు బృందాలతో సమావేశమై తమ సందేహాలు తీర్చుకుంటుందట. ఈ గజిబిజి తర్వాత దర్యాప్తు బృందాన్ని పఠాన్‌కోటకు తీసుకెళ్లినప్పటికీ అక్కడ నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటన తతంగమే విడ్డూరంగా వుందని ధ్వజమెత్తింది. అక్కడ వారికి వ్యూహాత్మక స్థలాలు చూపించకుండా వుండేందుకు రక్షణ శాఖ అనేక దొంతరలు ఏర్పాటు చేసింది. ఆ రోజు కాల్పుల్లో చనిపోయిన టెర్రరిస్టుల మృతదేహాలను స్థానిక ఆస్పత్రిలో భద్రపరిచినప్పటికీ అవి అప్పటికే కుళ్లడం ప్రారంభమైంది. వాటి దగ్గరకు ఎవరిని అనుమతించవద్దని గట్టి ఆదేశాలు జారీ చేయడంతో ఇతర మృతదేహాలను మార్చురీ వైపు తీసుకురాకుండా ఆపేశారు. దానివల్ల కూడా సమస్య ఏర్పడింది.పాకిస్తాన్‌లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో జైషే మహమ్మద్ పేరు లేదు. భారత దేశం వారే ఇందుకు కారణమని అంటున్నది.స్వయంగా చూసినా ఏ ఆధారాలు కనిపించలేదని ప్రకటించడమే పాకిస్తాన్ బృందం రాకలో ఆంతర్యం అని చాలామంది పరిశీలకులు భావిస్తున్నారు. పఠాన్ కోట దాడిని ఎదుర్కోవడంలో జరిగిన పొరబాట్లు తొందరపాటు ప్రకటనలు ఇప్పుడు అంతకు రెట్టింపు స్థాయిలో పునరావృతం కావడం సమన్వయ లేమికి అద్దం పడుతుంది.