న్యూస్‌ టు నోట్‌..

eye111

లిక్కర్‌ బేహారి విజరుమాల్యా రు.9000 కోట్లు అప్పులకు ఎగనామం పెట్టి విదేశాలకు ఎగిరిపోవడానికి అవకాశమిచ్చిన కేంద్ర పాలకులు ఇప్పుడు బ్యాంకులను తప్పు పడుతున్నారు. అవి ముందే మేల్కొని కోర్టులకు వెళ్లివుంటే అతన్ని ఆపడానికి వీలయ్యేదని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నెపం పెట్టారు. మాల్యాను ఎలా వెళ్లిపోనిచ్చారని రాహుల్‌గాంధీ విమర్వలు కురిపించిన నేపథ్యంలో జైట్లీ కాంగ్రెస్‌ హయాంలో ఇటలీ వ్యాపారవేత్త క్వాట్రోచ్చి పారిపోవడానికి అనుమతించిన వైనం గుర్తు చేసి దెప్పిపొడిచారు. అయితే తమ హయాంలో ఐపిఎల్‌ నిందితుడు లలిత్‌ మోడీ లండన్‌ విడిచివెళ్లడానికి అభ్యంతరం లేదని అవకాశమిచ్చిన ఉదాహరణ మాత్రం మర్చిపోయారు. ఆ కేసులో సుష్మా స్వరాజ్‌, వసుంధరా రాజే తదితరులు ఆరోపణలకు గురై బయిటపడేందుకు ఎన్ని తంటాలు పడ్డారో అందరికీ తెలుసు. ఇక విజరు మాల్యా లండన్‌లో తన ఫాం హౌస్‌ దగ్గర కనిపించారని కొన్ని కథనాలు వస్తున్నాయి.

.యమునా తీరంలో శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ ఉత్సవాలు జరుపకోవడానికి అనుమతించిన ఎన్‌జిటి ముందుగా అయిదు కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది. మరోవైపున ఆయన ఉత్సవాల ఏర్పాట్లకు సైనికులను వినియోగించడంపై సైన్యంలో అసంతృప్తి వ్యక్తమైంది. అయితే వీటన్నిటి మధ్యనా ప్రధాని మోడీ ఈ ఉత్సవాలకు హాజరవుతారన్న సంకేతాలు వస్తున్నాయి. ఎన్‌ఎస్‌జి దళాలు ఆ ప్రదేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించడంతో ఈ అభిప్రాయం పెరిగింది. ఈ దన్ను చూసుకునే రవి శంకర్‌ తాను ఎలాటి జరిమానా కట్టబోనని కావాలంటే జైలుకు వెళతానని బెదిరింపులకు దిగడం విశేషం.

.బెంగాల్‌ శాసనసభ ఎన్నికలకు సంబంధించి వెలువడిన రెండు సర్వేలు తృణమూల్‌ బలం పెరుగుతాయని జోస్యం చెప్పాయి.ఈటీవీ బంగ్లా ఆ పార్టీకి 201 వస్తాయని అంచనా వేసింది. వామపక్షాల బలం సగం తగ్గొచ్చని చెప్పింది. ఇదే గాక కేంద్ర నిఘా విభాగం ఐబి పేరిట మరో నివేదికను హిందూస్తాన్‌ టైమ్స్‌ ప్రచురించింది. కేంద్ర బిజెపి ఆదేశాల మేరకు తయారైన ఈ రహస్య నివేదిక కూడా మమత బలం పెరగొచ్చని సూచించింది. బిజెపికి ఎంత కష్టపడినా అయిదు స్తానాలు వస్తే గొప్ప అని పేర్కొంది.

.ఏడాది కాలంగా ఆమోదం నోచుకోని రియల్‌ ఎస్టేట్‌ బిల్లుకు ఎట్టకేలకు రాజ్యసభలో మోక్షం లభించింది. ప్రతిపక్షాలు సూచించిన ఇరవై సవరణలు చేసిన తర్వాత ఈ రోజు ఆమోదం పొందింది. కొనుగోలు దారుల దగ్గర ముందుగా సొమ్ములు తీసుకున్న బిల్డర్లు సకాలంలో పూర్తిచేయకుండా ఇబ్బందులు పెట్టడాన్ని నివారించడమే ఈ బిల్లు లక్ష్యమని ప్రభుత్వంచెబుతున్నది. వారు తమకు వచ్చిన పెట్టుబడిలో సగం డిపాజిట్‌ చేయాలని అన్ని వివరాలు పంచుకోవాలని ఆదేశిస్తున్నది. ఇందులో ఇంకా ఏవైనా హానికర అంశాలువున్నాయేమో లోతుగా పరిశీలించవలసి వుంటుంది.

.ఇష్రత్‌ జహాన్‌ కేసులో అప్పటి గుజరాత్‌ముఖ్యమంత్రిగా వున్న మోడీని దోషిని చేసేందుకు యుపిఎ ప్రభుత్వం కుట్ర పన్నిందని హౌం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపించారు. ఆ యువతి ఎల్‌ఇటి తీవ్రవాది అని ఎనౌకౌంటర్లో కాల్చేశారు. అయితే ఆమె అమాయకురాలని తర్వాత సిబిఐమరో సవరించిన అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇటీవల అమెరికాలోని టెర్రరిస్టు హైడ్లీని విచారించినప్పుడు ఏ సందర్భం లేకపోయినా అధికారుల ప్రశ్నలకు సమాధానంగా ఇస్రాత్‌ టెర్రరిస్టు అని చెప్పాడు. ఆ తర్వాత మాజీ హౌంశాఖ కార్యదర్శి జికెపిళ్లె నాటి ప్రభుత్వం తమను బలవంతపెట్టి ఈ కొత్త నివేదిక రాయించందని ఆరోపించారు. ఆ తర్వాత మరో ఐబి అధికారి ముందుకొచ్చి తనను సిగరెట్‌ పీకలతో కాల్చి హింసించిన ఫలితంగానే ఆమె టెర్రరిస్టు కాదని నివేదించానని తెలిపారు. దీనిపై బిజెపి తీవ్ర దుమారమే లేవనెత్తుతున్నది. అయితే సిబిఐ మాజీ డైరెక్టర్‌ కాలమిస్తు రాఘవన్‌ దీనిపై వ్యాఖ్యానిస్తూ పిళ్లె ఆ వ్యాఖ్యలు చేయడానికి హేతువేమిటో తెలియదని వ్యాఖ్యానించారు. అలాగే తనను హింసించి రాయించారని మరో అధికారి చెప్పడం సిగ్గుచేటని కొట్టిపారేశారు. హౌం మంత్రిగా ఐబికి ఆధ్వర్యం వహించే చిదంబరం ఏదైనా ఆదేశాలు ఇవ్వొచ్చుగాని దాని వెనక హేతుబద్దత ఏమిటో చెప్పవలసి వుంటుందని కూడా పేర్కొన్నారు. తన కింద వుండే ఐబి నివేదికనే ఆయన ఎందుకు సందేహించారన్నది అంతుపట్టని ప్రశ్న అంటూనే ఈ వ్యవహారం మొత్తం రాజకీయ వివాదంగా మారడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. అయితే ఇప్పుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆరోపణతో ఆ వివాదం పరాకాష్టకు చేరినట్టయింది. ఆ నాడు ఇస్రత్‌ కుటుంబం తరపున న్యాయ పోరాటం చేసిన జ్యొతి పున్వాని మొత్తం ఏం జరిగిందో సవివరంగా ఒక వ్యాసం రాసి నెట్‌లో అందుబాటులో వుంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *