పరీక్ష మాకే మోడీజీ!
ఎన్ని విమర్శలున్నా సరే ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల నాడి పట్టుకోగల మనిషి అని చెప్పక తప్పదు. చారు వాలా నుంచి గారు వాలాగా మారి వుండొచ్చు గాని ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ఆయన ప్రయత్నం చేస్తుంటారని ఒప్పుకోవాలి. అందులోనూ ఆరెస్సెస్‌లో ప్రచారక్‌గా పనిచేసిన అనుభవం రీత్యా మోడీకి వివిధ తరగతులకు ఎలా దగ్గరవాలో ఏ అంశాలు చెబితే నచ్చుతుందో కూడా అవగాహన వుంటుంది. మన్‌కీ బాత్‌లో విద్యార్థుల పరీక్షల గురించి మాట్లాడ్డంలో ఈ ప్రజా రంజకత్వం ప్రస్పుటమవుతుంది. మీకే కాదు నాకు కూడా రేపు (బడ్జెట్) పరీక్ష వుందని ప్రధాని మాట్లాడ్డం పిల్లల భాషకు దగ్గరగా వుంది. కాకుంటే రాజకీయంగా మాత్రం ఈ సందేశం సగమే నిజం. ఎందుకంటే బడ్జెట్‌కు ముందు సమర్పించిన ఆర్థిక సర్వే ప్రకారం చూస్తే పరీక్ష ఆయనకు కాదు, ప్రజలకే నని తేలిపోతుంది.
సూపర్ రిచ్ మధ్యతరగతి…
.మొదటి సంగతి లక్ష కోట్ల రూపాయల సబ్సిడీ సంపన్నులకు పోతుంది గనక దాన్ని కోత కోయాలని స్పష్టంగా వుంది. ఏవేవో తప్పు లెక్కలతో దేశ జనాభాలో 70 శాతం సంపన్నులని తేల్చారు. ఇది నిజం కాదని అందరికీ తెలుసు. నిజంగా 70 శాతం జనాభా సంపన్నులై వుంటే ఈ దేశం ఇలా వుండేది కాదు. మామూలు బాషలో వాస్తవం ఇందుకు రివర్స్. 70 శాతం ఎంతో కొంత పేద మధ్యతరగతిలో వుండగా 30 శాతమే సంపన్నులు.
.సర్వేలో మరో వింత వ్యాఖ్యానం చేశారు. మనం మధ్య తరగతిగా భావించేవారు విదేశాల లెక్కలలో మధ్యతరగతి తప్ప మన దేశంలో పరిస్థితి ప్రకారం చూస్తే మహా సంపన్నులు(సూరప్ రిచ్) అనుకోవాలట. వీరందరికీ కిరోసిన్, గ్యాస్,విద్యుత్ సబ్సిడీలు ఎత్తివేయడం ఎలాగన్నదే విపరీతంగా చర్చించారు.
.గ్యాస్‌పై ఇచ్చే సబ్సిడీలో 91 శాతం సంపన్నులకే పోతుందట.
.రైల్వేలలో అన్ రిజర్వుడు ప్రయాణీకులే పేదలుగా స్లీపర్‌నుంచి ఎసి వరకూ తీసుకునేవారంతా సంపన్నులుగా పరిగణించారు.
.మధ్యతరగతి వారు ఆదాయపు పన్ను పరిమితిని పెంచాలని కోరుతుంటే ఆర్థిక సర్వే మాత్రం మరింత మందిపై ఆదాయపు పన్ను విధించేలా విస్తరించాలని చెబుతున్నది.
.చిన్న పొదుపు మొత్తాలు కూడా సంపన్నులకే మేలు చేస్తున్నాయి గనక వాటిపైనా కూడారాయితీలు తొలగించాలంటుంది.
.రాజస్థాన్‌లో ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణల వంటివి దేశమంతా అమలు జరపాలంటుంది
.వ్యవసాయ రంగంలో కనీస మద్దతు ధరల విధానంపైనా ఎరువుల సబ్సిడీపైన పరోక్షంగా దాడిచేస్తున్నది
.. ఇందులో ఇంకా చాలా హెచ్చరికలున్నాయి. ఎలాగూ రేపే ప్రకటిస్తారు గనక ఇవన్నీ శాంపిల్ మాత్రమే.
