దేశ ‘ద్రోహ’ పురాణాలు

బుధ,గురు వారాలలో మిత్రులతో పంచుకున్న అభిప్రాయాలనే సమగ్ర రూపంలో ఇచ్చే వ్యాసం ఇది. ఆంధ్రజ్యోతిలో నా గమనం శీర్షికన 26.2.16న ప్రచురితమైంది. ఇదే రోజున రాజ్యసభలోనూ ఇదే విధమైన విమర్శల తర్వాత సృతి ఇరానీ చదివిన భాగాలనూ, విద్వేషం రెచ్చగొట్టే దైవధూషణ భాగాలను తొలగించనున్నట్టు ఉపాద్యక్షుడు కురియన్‌ ప్రకటించారు.నాపైన అదే పనిగా దాడి చేసిన ‘మిత్రులు’ ఇప్పుడైనా ఆలోచిస్తారని ఆశిస్తాను.

దేశ ‘ద్రోహ’ పురాణాలు smriti44444
హెచ్‌సియు నుంచి జెఎన్‌యు వరకూ విశ్వ విద్యాలయాలలో జరిగిన ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. బండారు దత్తాత్రేయకు అండగా హెచ్‌సియులో జోక్యం చేసుకున్న మంత్రి సృతి ఇరానీతో పాటు జెఎన్‌యు విషయంలో సీనియర్‌ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, వెంకయ్య నాయుడు, బిజెపి అద్యక్షుడు అమిత్‌షా సకల నేతలూ రంగంలోకి దిగారు. మీడియార్ణవ స్వాములనూ దింపారు. జరిగిందేమిటి,చేసిందెవరు అన్న సాక్ష్యాల వివరాలు చెప్పకుండానే దేశద్రోహం ఆరోపణలతో హౌరెత్తించారు. దేశాన్ని అవమానించారంటే ఎవరికైనా ఆగ్రహం కలగడం సహజమే. ేదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవడానికి అభ్యంతరం లేదనే అందరూ చెబుతున్నారు. కాని ఆ ఘటనతో సంబంధం లేని యూనివర్సిటీ విద్యార్థి సంఘ అద్యక్షుడు కన్నయ్య కుమార్‌ను అరెస్టు చేశారు.అతనికి హపీజ్‌ సయిద్‌తో సంబంధాలున్నాయని స్వయానా హొం మంత్రి అసత్యారోపణ చేశారు. ట్యాంపరింగ్‌ చేసిన విడియో టేపులు ప్రచారంలో పెట్టారు. జెన్‌యు పోలీసు శిబిరంగా మారిపోయింది. విద్యార్థులే గాక అధ్యాపక ఉద్యోగ సంఘాలు కూడా ఏకోన్ముఖంగా నిరసన తెలపాల్సి వచ్చింది. బిజెపియేతర పార్టీలన్నీ- ఢిల్లీలోని కేజ్రీవాల్‌ ప్రభుత్వం అధికారంలో పాలుపంచుకుంటున్నకొన్నింటితో సహా ఇది అప్రజాస్వామికమని ఆక్షేపించాయి. నోబుల్‌ గ్రహీతలైన అంతర్జాతీయ మేధావులతో సహా ఈ నిర్బంధాన్ని ఖండించారు. అయితే అధికార పక్షం ఇది కాంగ్రెస్‌ రాజకీయంగా కమ్యూనిస్టుల కుట్రగా చిత్రించడానికి, మతం రంగు ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే వుంది. అరెస్టుల గురించి ప్రశ్నిస్తే దేశద్రోహులనే దుష్ప్రచారమే. ఇది సహించలేక చాలామంది రచయితలు, రాజకీయ వేత్తలు, మీడియా ప్రముఖులు, మీ దేశభక్తి ముద్ర కంటే దేశద్రోహులం అనిపించుకోవడానికే మేము సిద్ధమని ప్రకటించారు.
ఇలాటి సమయంలో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ఈ విషయాలు విచారించవలసిందనే సత్యాన్ని చాటిచెప్పింది. మేమే దేశం అనే వారు నల్లకోట్లతో ప్రత్యక్షమై ఆ ఆవరణలోనే దాడులు చేశారు. దేశభక్తి ఉప్పొంగి న్యాయస్థానంలో వందేమాతర గీతాలాపన చేసి అక్షింతలు వేయించుకున్నారు.. ఇక వివాదాస్పద కార్యక్రమ నిర్వాహకులుగా పేర్కొన్న అయిదుగురు విద్యార్థులు కూడా బయిటకు వచ్చారు. తమ ఉనికిని ప్రభుత్వానికి మీడియాకు తెలియజేశారు! ఇందులో కుట్ర , విద్రోహం ఎక్కడ వున్నట్టు? వారిని విచారించి నిజానిజాలు తెలుసుకోవలసిన సమయం ఇది.
కాని ఈ మొత్తం వివాదంలో ప్రధాన సూత్రధారి సృతి ఇరానీ నాటకీయ దాడితో పరిస్థితిని ఇంకా దిగజార్చడం శోచనీయం. ఆమె మొదట రాజ్యసభలో బిఎస్పీ నేత మాయావతిపై విరుచుకుపడి- నా తల మీ పాదాల దగ్గర సమర్పిస్తానంటూ సవాళ్లు విసిరారు. ఆ తర్వాత మరింత విలయ తాండవానికి లోక్‌సభను రంగస్థలంగా చేసుకున్నారు. విద్యావిజ్ఞానాలకు బాధ్యత వహించే ఉన్నత స్తానానికి ఉచితం గాని ఉద్రేకాలతో వూగిపోయారే తప్ప కొత్తగా వెల్లడించిన విషయం లేదు. ఒక బిజెపి నాయకుడి చిన్న కుమారుడే ఈ ప్రసంగం చూసి అడిగాడట.. నాన్నా ఈమె సినిమా యాక్టరా .? అని. లేకపోతే జెఎన్‌యు వివాదానికి ఆమె చదివిన తీస్తా సెతల్వాద్‌ పుస్తకాలకూ సంబంధం ఏమిటి? బిజెపి పాలిత రాష్ట్రాలలో పాఠ్య పుస్తకాలలో నూరిపోస్తున్న విషయాలేమిటో తెలియదా?.అలాగే దుర్గాపూజ బెంగాల్‌లో ఎక్కువగా జరుగుతుంది గనక రేపటి ఎన్నికల్లో లాభం జరుగుతుందనే ఆశ తోనే ఆమె దేవతను అవమానించారన్న పోస్టరు చదివి వినిపించారు.
దుర్గాదేవి మాతృస్వామిక వ్యవస్థకు ప్రతీకగా నిలిచిన దేవత. మహారాష్ట్రలో ఒక కథ ప్రకారం ఆమె మహిషాసురుణ్ని హతమార్చాక అతను కొత్త రూపంలో వచ్చి ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ఇక బెంగాల్‌లోని అసుర అనే గిరిజన తెగ వారు తాము మహిషాసుర సంతతి అని నమ్ముతారు. వామనుడు అణగదొక్కిన బలిని మళయాలీలు దేవుడుగా పూజిస్తారు. కనుక రాక్షసులు దేవతల గురించిన కథలన్నీ అన్నిచోట్లా ఒకేలా వుండవు. మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యం ప్రకారమే చూసినా శివుడి వరాల వల్ల చావు లేకుండా చేసుకున్న మహిషుణ్ని వధించడానికి త్రిమూర్తులు తమ శక్తులు ధారపోసి దుర్గను తయారు చేస్తారు. ఆమె మహత్తర సౌందర్యంతో ఆయుధధారియై పులిమీద వచ్చి యుద్ధానికి పిలుస్తుంది. మహిషుడి సైనికులు ఒక అప్సరస మీ కోసం వచ్చిందని చెబుతారు. తర్వాత అతను యుద్దంలో హతమవుతాడు. మహిషాసురిడి పేరుమీదనే మైసూరు ఏర్పడిందని ఇతిహాసం. అక్కడి చాముండేశ్వరి ఆలయంలో మహిషాసురుడి విగ్రహం వుంటుంది. మహిష అతని చెల్లెలు అంటూ ఆమెకు కూడా ఒక చోట గుడి కట్టారు. ‘ఏమంటివి ఏమంటివి నీది ఏ కులము?’ అని ఎన్టీఆర్‌ డైలాగులు మార్మోగుతుంటే భారతాన్ని అవమానించినట్టా?ఆయన కన్నా పౌరాణిక బ్రహ్మలా వీరు?
జెఎన్‌యు విద్యార్థుల పోస్టరులో ఏముందో పూర్తిగా తెలియదు గాని ఆమె పార్లమెంటులో చదివి వినిపించడం ద్వారా లేని ప్రచారం కల్పించారు. ఇందువల్ల విద్వేషం పెంచడమే ఉద్దేశమైతే దేశం ఎంత మూల్యం చెల్లించాల్సి వుంటుందో ఆలోచించారా? ఇతర విషయాలు ఎలా వున్నా మహిళా మంత్రిగా సెక్స్‌ వర్కర్‌ అని నొక్కి పలుకుతూ చులకన చేయడం సబబేనా? పురాణాల్లో దేవ వేశ్యలుగా ఇంద్రలోకంలోనూ జోగినులు బసవిలు, దేవదాసీల పేరిట సమాజంలోనూ అట్టిపెట్టబడిన వారు గాని ఒక విధంగా సెక్స్‌వర్కర్లు కారా? ఇంకో చేదు నిజం కూడా ఆమె తెలుసుుకోవాలి. బెంగాల్‌లోని కుమార్‌ తులిలో దుర్గా విగ్రహాలు చేసే కళాకారులు సెక్స్‌ వర్కర్ల వాడగా పేరొందిన సోనాగచ్చి నుంచి మట్టి తీసుకువస్తారు. ఇది తరతరాలుగా అమలవుతున్న ఆచారం. ‘నిషిధ్ధ పలి’్ల నుంచి ‘పుణ్యమటి’్ట గా దాన్ని భావిస్తారే గాని చులకనగా చూడరు. ఇందుకు రకరకాల వివరణలు వున్నాయి గాని ఇక్కడ అప్రస్తుతం. కనుక రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను మతాలను తీసుకురావడం దారుణం. సాక్షాత్తూ శ్రీరాముణ్ని రథంపై ఎన్నికల గుర్తుగా వేసుకుని వూరేగిన వారికంటే మరెవరూ అవమానించగలరు?
ఇక రాజకీయాలకు వస్తే- కమ్యూనిస్టులకు ఇప్పుడు స్థానాలు బాగా తగ్గివుండొచ్చు. వారేమైనా పొరబాట్లు కూడా చేసి వుండొచ్చు. కాని వారి దేశభక్తిని పదే పదే ప్రశ్నించే స్తితిలో బిజెపి వుందా? పంజాబ్‌లో ఉగ్రవాద జ్వాలల మధ్య సమైక్యత కోసం నిలబడిన హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ సత్యపాల్‌డాంగ్‌(సిపిఐ) వంటివారిని మర్చిపోగలమా? ఆయన ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిన యోధుడు కాదా? అస్సాం ఆందోళనలోనూ యువజన విద్యార్థి కార్యకర్తలను ముక్కలుగా నరికిన ఉదంతాలు లేవా? సిపిఎం పాలనలోని త్రిపుర మాత్రమే ఈశాన్యాన ప్రశాంతంగా సమైక్యంగా వుంటున్న మాట నిజం కాదా? కాశ్మీర్‌లో సిపిఎం ఎంఎల్‌ఎ యూసప్‌ తరగామి బృందం ఉగ్రవాదులతో తలబడి తరిమికొట్టారు గాని అధికారం కోసం అర్రులు జాచింది లేదే? అవకాశవాదాలు ఆరోపణలు ఎన్ని వున్నా ఇందిరాగాంధీ రాజీవ్‌ గాంధీలు ఉగ్రవాదులకు బలైన మాట కూడా నిజమేనే? మరి ఆరెస్సెస్‌కు అసలు స్వాతంత్ర పోరాటంతో సంబంధం ఏముంది? క్విట్‌ ఇండియా ఉద్యమంలో స్వయానా వాజ్‌పేయి చేసిందేమిటి? నిన్న వచ్చిన ఇంగ్లీషు వారికంటే మొన్న వచ్చిన మొగలాయీలే ప్రధాన శత్రువులని తమ విధానం కదా? గాంధీని హత్యచేసిన గాడ్సే దేశభక్తుడన్నవారు- నాడు సిక్కు ఉగ్రవాదుల పూజలు చేసిన అకాలీలను అక్కున చేర్చుకున్నవారు- అఫ్జల్‌ గురును ఆరాధించే పిడిపితో కలసి కాశ్మీర్‌లో అధికారం పంచుకుంటున్న వారు ఇతరులనెలా నిందిస్తారు? కాశ్మీర్‌ ఉగ్రవాదులకు నిధులిచ్చిన జైన్‌ డైరీలలో బిజెపి ముఖ్యమంత్రులు ముఖ్య నేతల పేర్లు కూడా బయిటకు వస్తే రాజీనామాలు చేసిన మాట నిజం కాదా? మండల్‌కు వ్యతిరేకంగా కమండల్‌ అంటూ కులాల కురుక్షేత్రం రగిలించిన దాఖలాలు లేవా? ఇప్పుడు పటేళ్లు జాట్లు అందుకు మూల్యం అడగడం లేదా? హెచ్‌సియు నుంచి జెఎన్‌యు వరకూ పరిస్థితులు ఇంత దారుణంగా దిగజారడానికి అపర మనువులు కారణం కాదా?
దారితప్పిన ఉగ్రవాదులనే నచ్చజెప్పి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తాం. ఆవేశంలోనో అంచనా తప్పడం వల్లనో ఎటు నుంచి ఏ పొరబాటు జరిగినా సర్దుబాటు చేసుకోవడం విజ్ఞుల లక్షణం. అందరినీ కలుపునికోవడం అధికారంలో వున్నవారి బాధ్యత. యువతరంపైన, ప్రత్యేకించి అణగారిన తరగతులపైన సానుభూతి లేకుండా రాజకీయ వ్యూహాలతో విద్రోహాలు అంటగట్టడం అనర్థదాయకమని గ్రహిస్తారా ‘బహు’ మేడం? మౌనం వీడతారా ప్రధాని గారూ? సంసృతి అంటే మతం కాదనీ, దేశమంటే మనుషులే గాని మతాలూ కాదని ఒప్పుకుంటారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *