మోడీనోట.. అస్థిరత్వం మాట.. దేనికి బాట!

modi111

ఇందిరా గాంధీని ఆమె పార్టీని అహౌరాత్రులు విమర్శించే ప్రధాని నరేంద్ర మోడీ నోట ఆమె మాటలే రావడం ఆశ్చర్య కరం. ఒరిస్సాలో రైతుల సభలో మాట్లాడుతూ ఆయన తన ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు తీవ్ర ప్రయత్నాలు లేదా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాను అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం వల్లనే ఇలా చేస్తున్నారని కూడా చెప్పారు. ఇందిరాగాంధీ కూడా తనపై కుట్రలు చేస్తున్నారంటూ ఎమర్జన్సీ విధించారు. అప్పుడంటే ఆమెకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చింది. దేశంలో పెద్ద ఉద్యమాలు నడుస్తున్నాయి. కాని ఇప్పుడు మోడీకి పార్లమెంటులో బ్రహ్మాండమైన సంఖ్యాబలం వుంది.కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హౌదా కూడా లేదు. మరి ఆయనను కూలగొట్టడం ఎలా సంభవం? పైగా ఒక చారువాలా ప్రధాని కావడం ఇష్టం లేకనే ఇదంతా చేస్తున్నారనే ఆరోపణ ఇంకా విడ్డూరంగా వుంది. చారువాలా నుంచి ఖరీదైన దుస్తులు ధరించే హారువాలాగా మత రాజకీయాలు రగిల్చే గారువాలాగా ఆయన మారి చాలా కాలమైంది. కనుక ఇంకా ఆ పాతమంత్రం పనిచేయదు. ఇరవై నెలల కిందటే దేశాన్ని ఒక్క వేలితో శాసించే శక్తివంతుడుగా వూరేగిన ప్రధాని మోడీ ఇలా వాపోయే పరిస్థితి రావడం కేవలం స్వయం కృతమే. హెచ్‌సియు నుంచి జెఎన్‌యు వరకూ దేశద్రోహ ఆరోపణలతో దాడి చేసి నిజమైన దేశభక్తుల ఆగ్రహానికి గురైంది ఆయన ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో కాపులు, గుజరాత్‌లో పటేళ్లు, ఇప్పుడు ఉత్తరాదిలో జాట్లు, రాజస్థాన్‌లో గుజ్జర్లు ఇలా కులాల కురుక్షేత్రాలు రగుల్కొల్పిన రాజకీయం కూడా వారిదే. గతంలో రచయితలు అవార్డువాపసీ చేస్తే అనేక విధాల అపహాస్యం చేసిన సర్కారు ఇప్పుడు వ్యవసాయ సంక్షోభం సహించలేక మహారాష్ట్రలో ఆదర్శ రైతులు కూడా అవార్డులు వెనక్కు ఇవ్వడంపై ఏమంటుందో చూడాలి. మేధావులను మీడియాను ప్రతిపక్షాలనూ ఎన్జీవోలను ఆడిపోసుకోవడం గాక తన ప్రభుత్వ తీరుతెన్నులను చక్కదిద్దుకోవడం శ్రేయస్కరం.అప్పుడు అస్తిరత్వం అంటూ ఆక్రోశించే అవసరం వుండదు.అయితే ఈ విమర్శలు రేపు మరెన్ని రాజకీయ దాడులకు దారి తీస్తాయో కూడా చూడవలసిందే. ఇందిర హయాంలోనే గాక ప్రపంచమంతటా పాలకులు ప్రజలపై దాడి చేసేముందు ఇలాటి వ్యాఖ్యలే చేస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *